Maha Kumbamela 2025: పవిత్ర నగరం ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా జరిగే 7 అత్యుత్తమ ప్రదేశాలు ఇవే!
Maha Kumbamela 2025: మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్‌కి వెళ్తున్నారా? మీరు చేయబోయే యాత్రను మరపురానిదిగా మార్చుకోవడానికి ఈ పవిత్ర నగరంలోని 7 అత్యుత్తమ ప్రదేశాలను తప్పక సందర్శించండి.
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, ప్రాచీనమైన సమావేశాలలో ఒకటి మహా కుంభమేళా 2025. 144 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాను మహా కుంభమేళా అంటారు. ప్రస్తుతం ఈ మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ మహత్కార్యానికి లక్షలాది మంది యాత్రికులు, పర్యాటకులు, ఆధ్యాత్మిక ఔత్సాహికులు తరలివస్తారు. ఇది భారతదేశపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలలో భారీ భక్తజనసందోహంతో పాటు తరించే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది.

అంతటి మహత్తర ఘట్టానికి వెళ్లాలని, మిస్ కాకూడదని అనుకుంటున్నారా.. ఒకవేళ మీరు వెళ్లాలని అనుకుంటున్నట్లయితే ఈ యాత్రను కేవలం ఆధ్మాత్మికతకు పరిమితం చేయకుండా కొన్ని పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించండి. అలా చేయడం ద్వారా మీ మనస్సుకు మరింత ఆహ్లాదం కలుగుతుంది.
1. ఆనంద్ భవన్
నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన నివాసం అయిన ఆనంద్ భవన్, పురాతన కట్టడాలను ఇష్టపడే వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఈ ప్రసిద్ధ భవనంలోనే భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన బాల్యాన్ని గడిపారు. ఇప్పుడు మ్యూజియంగా మార్చబడిన ఈ భవనంలో నెహ్రూ కుటుంబానికి చెందిన ఛాయాచిత్రాలు, పత్రాలు, వ్యక్తిగత వస్తువులు సందర్శన కోసం ఉంచారు. అంతేకాదు, అక్కడి నమూనాలు భారత స్వాతంత్య్ర పోరాట దశను కూడా కళ్లకు గట్టినట్లుగా చూపిస్తాయి.
2. హనుమాన్ మందిర్
ప్రయాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న హనుమాన్ మందిర్, హనుమంతుడి కోసమే ప్రత్యేక పూజలు జరిపే ఆలయం. అత్యంత పురాతనమైనదే కాకుండా అత్యంత గౌరవనీయమైన దేవాలయాలలో కూడా ఒకటి. స్వయంభుగా పరిగణించే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది ఒక ప్రధాన ఆధ్యాత్మిక ఆకర్షణ.
3. అలహాబాద్ కోట
16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన వాస్తుశిల్ప కళాఖండమైన చారిత్రాత్మక అలహాబాద్ కోట కూడా ప్రయాగరాజ్‌లో ఉంది. నదీ ముఖంగా ఉండే ఈ కోట పర్షియన్, మొఘల్ శైలులను కలగలిపి అందంగా తీర్చిదిద్దారు. ఈ కోట లోపల ఉండే పాతాళపురి ఆలయంలో అక్షయ వట వృక్షం కూడా ఉంటుంది.
4. జవహర్ ప్లానిటోరియం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఉన్న జవహర్ ప్లానిటోరియంను అలహాబాద్ ప్లానిటోరియం అని కూడా పిలుస్తారు. ఇది 1979లో సైంటిఫికల్ ఎగ్జైట్మెంట్, ప్రాక్టీస్ కోసం ప్రారంభించారు. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారట. ఇది నెహ్రూ కుటుంబానికి చెందిన నివాసం అయిన ఆనంద్ భవన్ పక్కనే ఉంది. ఈ ప్రసిద్ధ ప్రదేశం సైన్స్ ఔత్సాహికులు, చరిత్ర ప్రియులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.
5. అశోక స్తంభం
అలహాబాద్ కోటలో ఉన్న అశోక స్తంభం, మౌర్య రాజవంశానికి చెందిన ఒక అద్భుతమైన చారిత్రక స్మారక చిహ్నం. అశోక చక్రవర్తి శాసనాలు చెక్కబడి ఉంటుంది. భారతదేశపు వారసత్వానికి చిహ్నంగా నిలిచింది.
6. త్రివేణి సంగమం
గంగా, యమునా మరియు పౌరాణిక సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం, కుంభమేళా సమయంలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. ఆత్మను శుద్ధి చేసి పాపాలను కడిగేస్తుందని నమ్ముతూ యాత్రికులు ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి వస్తారు.
7. అలోపీ దేవి మందిరం
అలోపి దేవతను ఆరాధించే ఈ ఆలయం ప్రయాగరాజ్‌లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ముఖ్యమైన ప్రదేశం. కుంభమేళా సమయంలో ఈ దేవతా విగ్రహాన్ని సంగమానికి తీసుకువెళుతుంటారు. అందుకే ఈ అలోపి దేవతా మందిరానికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆలయ సందర్శనానికి వెళ్లిన భక్తులకు దేవి పాదముద్రలు దర్శనమిస్తాయని ఈ ఆలయ స్థల పురాణం చెబుతోంది.
సంబంధిత కథనం