Odela Mallanna Temple : తెలంగాణ శ్రీశైలం ఓదెల మల్లన్న.. ఇక్కడకు ఎలా వెళ్లాలంటే?-maha shivaratri 2024 history of odela mallanna temple and how to go from hyderabad ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Maha Shivaratri 2024 History Of Odela Mallanna Temple And How To Go From Hyderabad

Odela Mallanna Temple : తెలంగాణ శ్రీశైలం ఓదెల మల్లన్న.. ఇక్కడకు ఎలా వెళ్లాలంటే?

Anand Sai HT Telugu
Mar 07, 2024 07:30 PM IST

Odela Mallanna Temple : మార్చి 8న మహాశివరాత్రి. దేవదేవుడిని దర్శించుకునేందుకు పలు ఆలయాలకు వెళ్తారు భక్తులు. అయితే మీరు తప్పకుండా వెళ్లాల్సిన వాటిలో ఒకటి ఓదెల మల్లన్న ఆలయం.

ఓదెల మల్లన్న ఆలయం
ఓదెల మల్లన్న ఆలయం (Unsplash)

మహాశివరాత్రి పురస్కరించుకుని శైవక్షేత్రాలకు భక్తులు తరలివెళ్తున్నారు. తెలంగాణలోనూ చాలా శైవక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లన్న ఆలయం. ఈ క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణ శ్రీశైలంగా పిలుస్తారు. తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకున్నాడు ఆ దేవుడు. ఓదెల మల్లన్న ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయ విశేషాలేంటో చూద్దాం..

ఒకప్పుడు ఓదెల ప్రాంతమంతా అడవిగానే ఉండేది. ఈ అరణ్యంలో శివలింగం స్వయంభూగా వెలిసింది. ఈ లింగాన్ని పంకజ మహాముని పూజించేవాడు. రానురాను.. ఈ శివలింగంపై పుట్టు పెరిగింది. తర్వాత లింగం కనిపించకుండా అయింది. కొన్ని ఏళ్ల తర్వాత గ్రామం విస్తరించడంతో ప్రజలు అడవిని చదును చేసి వ్యవసాయం చేసుకున్నారు.

ఒకానొక రోజు చింతకుంట ఓదెలు అనే వ్యక్తి వ్యవసాయం కోసం దున్నుతుండగా నాగలికి ఏదో బలంగా తగిలింది. అంతే, భయంకరంగా పెద్ద శబ్ధం వచ్చింది. ఓదెలా.. ఇక నీ వంశం నాశించుగాక అని వినిపించిందని చెబుతారు. అయితే జరిగిన పొరబాటును ఓదెలు తెలుసుకుని.. స్వామివారికి మెుక్కుకున్నాడు. తెలియక జరిగిన పొరపాటు అని చెప్పుకొచ్చాడు. మన్నించమని వేడుకున్నాడు.

ఓదెలు నిజాయితీకి మెచ్చిన స్వామివారు.. ఓదెలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా.. ఓదెల మల్లికార్జున స్వామికి అవతరిస్తానని చెబుతాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కొలువై భక్తులు కష్టాలను తీరుస్తున్నాడు. తనకు గాయం చేసిన ఓదెలు పేరు మీదుగానే ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంగా పేరు వచ్చింది. అయితే ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది.

ఓదెల మల్లన్న ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. ఇక్కడి శాసనలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

అంతేకాదు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి ఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే మార్గంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారని స్థల పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా స్వామి వారికి దక్షిణ దిశగా.. సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలు ఉంటాయి. ఆలయానికి తూర్పు దిశగా బంగారు పోచమ్మ, వాయవ్య దిశగా మదన పోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు కచ్చితంగా అమ్మవార్లను దర్శించుకుంటారు.

ఏటా ఓదెల మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు ఉంటాయి. మహారుద్రాభిషకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒగ్గు పూజారులు పెద్ద పట్నాలు వేస్తారు. చుట్టు పక్కల గ్రామాల వారు ఈ పట్నాలు వేయించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

ఓదెల ఆలయానికి ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి ఓదెల మల్లన్నకు వెళ్లేందుకు రైలు, బస్సు ప్రయాణం ఉంటుంది. ఓదెలకు రైల్వే స్టేషన్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకునేవారికి ఉదయంపూట ట్రైన్స్ ఉంటాయి. నేరుగా ఓదెల రైల్వే స్టేషన్లో దిగవచ్చు. అక్కడ నుంచి 20 రూపాయల ఆటో ఛార్జీతో దేవస్థానానికి చేరుకోవచ్చు. ఇక బస్సు మార్గంలో వెళ్లాలంటే జేబీఎస్ నుంచి కరీంనగర్ వెళ్లే బస్సు ఎక్కాలి. అక్కడ నుంచి పొత్కపల్లి వైపు వెళ్లే బస్సు ఎక్కి ఓదెలకు చేరుకోవచ్చు. ఒకవేళ వరంగల్ వైపు నుంచి వెళ్లాలి అంటే.. ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి వరంగల్ వెళ్లే బస్సు ఎక్కాలి. అక్కడ నుంచి జమ్మికుంట చేరుకోవాలి. జమ్మికుంట నుంచి సుల్తానాబాద్ వెళ్లే బస్సు ఎక్కి పొత్కపల్లిలో దిగి ఓదెల మల్లన్న ఆలయానికి చేరుకోవచ్చు.

WhatsApp channel