Love Guru Tips | మీ ప్రేమ పువ్వు పూయక ముందే వాడిపోవటానికి కారణాలు ఇవే!
Love Guru Tips: మీరు ఇష్టపడిన వారు, మిమ్మల్ని మొదట్లో అభిమానించిన వారు కొన్నాళ్లకే మీ నుంచి దూరం జరగటం ప్రారంభించారంటే అందుకు మీకు తెలియని కొన్ని కారణాలు ఉంటాయి, అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
Love Guru Tips: మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు, వారితో బంధం ఏర్పర్చుకోవాలనుకున్నప్పుడు ప్రారంభంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఉదాహరణకు మీకు ఒక అమ్మాయి నచ్చింది, వారిని ఎలాగో అలా ఇంప్రెస్ చేశారు. ఫోన్ నెంబర్స్ కూడా మార్చుకుని చాటింగ్ మొదలు పెట్టారు, మీ మధ్య స్నేహం చిగురించింది. వారు మీకు మరింత దగ్గరయ్యారు. ఇక అమ్మాయి మీకు సెట్ అయ్యింది, లవ్ ఫిక్స్ అనుకుంటున్న తరుణంలో మీకు షాక్ తగలొచ్చు. కొన్నాళ్లకే వారు మీ నుంచి దూరం జరగటం ప్రారంభించవచ్చు. దీంతో మీ ప్రేమ పువ్వు పూయక ముందే వాడిపోవచ్చు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటే అకస్మాత్తుగా ఏమయింది, ఎక్కడ బెడిసి కొట్టింది అని తలలు పట్టుకోవడం మీ వంతు అవుతుంది. ఇందుకు మీరు ప్రారంభంలో చేసే చిన్నచిన్న తప్పిదాలే కారణం అవుతాయి, వాటిని మీరు గుర్తించకపోవచ్చు. అయితే అవి ఎలాంటి కారణాలో ఇక్కడ తెలుసుకోండి.
శారీరక సాన్నిహిత్యానికి ఆత్రుత
మీరు ఒక అమ్మాయిని డేటింగ్ కి పిలిస్తే ఆమె దానికి అంగీకరించి మీతో డేటింగ్ కు వచ్చిందంటే, ఆమె మీతో శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి చూపుతున్నట్లు కాదు. మీ మొదటి కలయికలోనే శారీరకంగా దగ్గరవడానికి ఆత్రుత చూపిస్తే, మీ ప్రేమకథ మొదలవ్వక ముందే శుభం కార్డ్ పడిపోతుంది. కాబట్టి మొదటిసారి మీట్ అవుతున్నప్పుడు నిజమైన భావోద్వేగ సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం.
గోస్టింగ్
గోస్టింగ్ అంటే వారికి ఏ మాత్రం చెప్పకుండా వారిని దూరం పెట్టడం. మీరు వారిపై అలిగి వారికి కాల్స్ రిసీవ్ చేయకపోవడం, ఎదురుపడినా పలకరించకపోవడం, కావాలని దూరం పెట్టడం చేస్తే.. మీ ఈ ప్రవర్తన అవతలి వ్యక్తిని అయోమయానికి గురి చేస్తుంది, బాధిస్తుంది. భవిష్యత్తులో మీతో ఇంకెన్ని ఇబ్బందిపడాల్సి వస్తుందేమోనని వారు మీకు పూర్తిగా దూరం జరుగుతారు.
తొందరపెట్టడం
మీ ప్రతిపాదనలను అంగీకరించాలని తొందరపెట్టడం, ప్రతీ విషయానికి త్వరగా జవాబు ఇవ్వాలని కోరడం, వారు అంగీకరించకపోతే అసహనానికి గురవడం చేయకూడదు. ఇటువంటి హడావిడి అలవాట్లు మానుకోండి, మీరు తొందర పెడితే మీకు తొందరగా గుడ్ బై చెప్పేస్తారు. నిదానంగా చెప్పడం, వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం.
అంతులేని టెక్ట్సింగ్
మీరు వారితో చాటింగ్ చేస్తున్నప్పుడు ఆ చాటింగ్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. మీ గురించి, మీ ఫీలింగ్స్ గురించి పేజీపేజీలు మెసేజ్ లు రాసి పంపిస్తే మీ చాటభారతాన్ని చదవడాన్ని వారు భారంగా భావించవచ్చు. నిరంతరంగా చాటింగ్ కు ఒత్తిడి చేయడం ద్వారా వారు వారి పనులను చేసుకోలేకపోవచ్చు. కాబట్టి పరిమితులు ఉండటం ముఖ్యం.
సుదీర్ఘమైన మీటింగ్
మీరు వారితో సమయం గడపాలనుకోవడంలో తప్పు లేదు. మొదటి మీటింగ్ లోనే వారిని వదలకుండా గంటల తరబడి మాట్లాడటం. వారి చుట్టే తిరగటం వారికి చిరాకు తెప్పించవచ్చు, ఇంక చాలు అని అనుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మీటింగ్ స్వీట్ గా, సింపుల్ గా ఉండాలి. మళ్లీ కలవాలి అని వారికి అనిపించాలి.
ఊహాలోకంలో బ్రతకడం
సాధారణంగా కొంతమందికి అమ్మాయి కొంచెం చనువు ఇస్తే, ఎక్కడికో వెళ్లిపోతారు. ఊహాలోకంలో బ్రతుకుతారు. ఊహల్లోనే వారితో మధుర సంభాషణలు సాగిస్తారు, వారు తమ మనసుకు చాలా దగ్గరైనట్లు భావిస్తారు. మీరు ఊహలు వాస్తవం కావని గ్రహించాలి. మీరే ఏదో ఊహించుకొని వారితో చనువుగా ప్రవర్తిస్తే ఖేల్ ఖతం, కథ సమాప్తం.
కాబట్టి తొలిసారి మీటింగ్ లేదా డేటింగ్ కు వెళ్తున్నపుడు ఏ విషయానికి తొందరపడకండి. తదుపరి డేట్ వచ్చేవరకు వేచి ఉండండి. అప్పుడే మీ ప్రేమ పువ్వు వికసిస్తుంది.
సంబంధిత కథనం