మీ లైంగిక బంధానికి కొత్త ఊపిరి పోయాలనుకుంటున్నారా? రెట్టింపు ఆనందం కోసం ఈ వ్యాయామాలు చేయండి!-looking to sweeten your love life these exercises will strengthen your bond ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ లైంగిక బంధానికి కొత్త ఊపిరి పోయాలనుకుంటున్నారా? రెట్టింపు ఆనందం కోసం ఈ వ్యాయామాలు చేయండి!

మీ లైంగిక బంధానికి కొత్త ఊపిరి పోయాలనుకుంటున్నారా? రెట్టింపు ఆనందం కోసం ఈ వ్యాయామాలు చేయండి!

Ramya Sri Marka HT Telugu

లైంగిక జీవితం మరింత ఉత్సాహంగా, సంతృప్తికరంగా ఉండాలంటే కేవలం మానసికమైన కోరికలే కాదు. శారీరక దృఢత్వం కూడా ఉండాలి. కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ద్వారా మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం!

లైంగిక సామర్థ్యం మెరుగుపరిచే వ్యాయామలు

లైంగిక బంధానికి, వ్యాయామానికి చాలా దగ్గర సంబంధం ఉంది. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కేవలం రోజువారీ పనులకే కాకుండా, మీ లైంగిక జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ద్వారా మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. మీ భాగస్వామితో మరింత సంతృప్తికరమైన ఆనందాన్ని పొందొచ్చు. ఈ వ్యాయామాలు మీ శరీరంలోని కొన్ని ముఖ్యమైన కండరాలను బలపరచడమే కాకుండా, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. మీ మానసిక స్థితిని కూడా మారుస్తాయి. తద్వారా మీ లైంగిక జీవితం మరింత ఆనందదాయకంగా మారుతుంది.

లైంగిక ఆనందాన్ని రెట్టింపు చేసే కొన్ని వ్యాయామాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

కీగెల్ వ్యాయామాలు:

ఇవి స్త్రీ పురుషులిద్దరికీ ఉపయోగపడతాయి. వీటి ద్వారా పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలపడి, మరింత తీవ్రమైన ఆర్గాజమ్‌లకు దారితీయవచ్చు. పురుషుల్లో శీఘ్ర స్కలన సమస్యను నివారించడంలోనూ సహాయపడతాయి.

ప్లాంక్:

ఇది మీ కోర్ కండరాలను, అలాగే చేతులు, తొడలు, పిరుదులను బలపరుస్తుంది. ఇది మిమ్మల్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్లాంక్ నేరుగా లైంగిక అవయవాలపై పనిచేయకపోయినా, అది మీ శరీరాన్ని లైంగిక చర్యకు మరింత సిద్ధం చేస్తుంది. తద్వారా లైంగిక సంతోషం పెరుగుతుంది.

స్క్వాట్స్:

ఇవి పిరుదులు, తుంటిని బలపరుస్తాయి. ఇవి అనేక లైంగిక భంగిమలు చేయడానికి శరీరాన్ని అనుకూలంగా మారుస్తాయి. స్త్రీ పురుషులిద్దరికీ ఇది చాలా ముఖ్యమైనది.

గ్లూట్ బ్రిడ్జ్:

ఈ వ్యాయామం పిరుదులతో పాటు హామ్‌స్ట్రింగ్‌లను బలపరుస్తుంది. ఇది లైంగిక చర్యలో ముఖ్యమైన కదలికలకు సహాయపడుతుంది.

యోగా:

శారీరక ప్రయోజనాల కోసం పైన వ్యాయామాలన్నీ చేస్తుంటే, యోగా మాత్రం మీ మానసిక ఆరోగ్యాన్ని మార్చేందుకు సహాయపడుతుంది. మీ మనస్సును శాంతపరుస్తుంది. ఇది లైంగిక అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా, కొన్ని యోగా భంగిమలు పెల్విక్ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతాయి.

కార్డియో వ్యాయామాలు (నడవడం, పరిగెత్తడం, స్విమ్మింగ్):

ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి, శక్తి స్థాయిలను పెంచుతాయి. ఇది లైంగిక కోరిక, లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.

మరి ఈ వ్యాయామాలను ఉదయాన్నే చేయాలా.. లేదా?

కీగెల్ వ్యాయామాలు:

వీటిని మీరు ఎప్పుడైనా చేయవచ్చు - కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కూడా. రోజుకు కనీసం మూడు సార్లు, 10-15 సార్లు పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.

ఇతర వ్యాయామాలు:

సాధారణంగా, మీరు మీ దినచర్యలో ఎప్పుడైనా ఈ వ్యాయామాలు చేయవచ్చు. కొంతమందికి, వ్యాయామం తర్వాత వెంటనే లైంగిక కోరిక పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, యాంటిడిప్రెసెంట్స్ తీసుకుంటున్న మహిళలు లైంగిక చర్యకు ముందు వ్యాయామం చేయడం వల్ల ఉత్తేజం పెరిగినట్లు కనుగొన్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీ లైంగిక జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. మీ జీవితం మరింత ఆనందమయం అవుతుంది. ఏదైనా కొత్త వ్యాయామం సోషల్ మీడియాలోనో, లేదా స్నేహితుల ద్వారా తెలుసుకున్నట్లయితే స్టార్ట్ చేసే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మంచిది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.