Life saving hacks: లిఫ్ట్ ఉన్నట్లుండి ఆగిపోతే ఏం చేయాలి? మీ ప్రాణం కాపాడే చిట్కాలు ఇవే
Life saving hacks: ఈ మధ్య ప్రతిచోటా లిఫ్టుల ఏర్పాటు ఉంటోంది. అపార్ట్‌మెంట్లు మొదలుకుని షాపింగ్ మాల్స్ దాకా ప్రతిచోటా దీన్ని వాడుతున్నాం. లిఫ్టులో ఇరుక్కోపోతే ఏం చేయాలో తెల్సుకోండి.
ఈ మధ్య ప్రతి చోటా లిఫ్టు వాడకం పెరిగిపోయింది. ఇదివరకు ఎక్కడో పెద్ద పెద్ద షాపింగ్ మాళ్లు, అపార్ట్‌మెంట్లలోనే లిఫ్టుల వాడకం ఉండేది. కానీ ఇప్పుడు రోజూవారీ కూడా చాలా సార్లు దీన్ని వాడుతున్నాం. అయితే రోజూ ఎక్కడోచోట, ఎవరో ఒకరు లిఫ్టులో ఇరుక్కుపోయిన సంఘటన చాలా సార్లు వార్తలో వినిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఈ ఘటనలు ప్రాణాంతకంగానూ మారుతుంటాయి. ఇప్పుడు లిఫ్టులు వాడకుండా పదేసి అంతస్తులు మెట్ల మార్గంలో ఎక్కడం అయితే సాధ్యం కాదు. కానీ అందులో చిక్కుకుంటే ఏం చేయాలో మాత్రం తెల్సుకుంటే మంచిది.
కంగారు వద్దు:
లిఫ్టు ఉన్నట్లుండి ఆగిపోతే వెంటనే కంగారు పడిపోతారు. భయాందోళనలకు గురవుతారు. దానివల్ల ఏం చేయాలో తోచదు. కాబట్టి ముందుగా ప్రశాంతంగా ఉండాలి. తెలివిగా ఆలోచించాలి. అనవసరంగా గట్టిగా అరవడం, మీ బలమంతా కూడగట్టి తలుపులు తెరవాలి అనుకోవడం, శబ్దాలు చేయడం వద్దు. ఇవన్నీ మీలో భయాన్ని మరింత పెంచుతాయి. పరిస్థితిని దిగజారుస్తాయి. మీ రక్తపోటు పెరుగుతుంది. కొంతమందికి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.
లైట్లు ఆగిపోతాయి:
చాలాసార్లు లిఫ్ట్ ఆగిన వెంటనే లైట్లు ఆగిపోయి చీకటిగా ఉంటుంది. కాబట్టి వెంటనే మీ ఫోన్లో ఫ్లాష్‌లైట్ ఆన్ చేయండి.లేదా స్మార్ట్ వాచ్ ఉపయోగించండి. మీ ఫోన్ నుంచి ఎవరికైనా కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఫోన్లో సిగ్నల్స్ లేకపోతే కొన్ని లిఫ్టుల్లో ఎమర్జెన్సీ ఫోన్ సౌకర్యం ఉంటుంది. అలాంటిదేమైనా ఉంటే వెంటనే కాల్ చేసి సమాచారం ఇవ్వండి. అలాగే సాధారణంగా లిఫ్టులో ఎంతసేపున్నా ఊపిరాడకపోవడం అనే సమస్య రాదు. ఒకవేల అలాగేమైనా అనిపిస్తే మీ ఫ్లాష్ సాయంతో ఫ్యాన్ బటన్ వెతికి వెంటనే ఫ్యాన్ ఆన్ చేసుకోండి.
అన్ని బటన్లు నొక్కకండి:
ఎలివేటర్ లో చిక్కుకున్నప్పుడు మొదట కంగారు పడి చేతికొచ్చిన బటన్ నొక్కడం ప్రారంభిస్తాం. ఇది సాంకేతిక సమస్య సృష్టించి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. కాస్త ప్రశాంతంగా చూస్తే దాదాపు ప్రతి లిఫ్టులో ప్యానిక్ బటన్, కాల్ బటన్ ఉంటాయి. సాధారణంగా ఇవి లిఫ్టు డోర్ పక్కన ఎరుపు రంగులో ఉండి వాటి మీద గంట ఆకారం ఉంటుంది. ఆ బటన్ పట్టుకుని కనీసం రెండు మూడు సెకన్లు అలాగే ఉండాలి. పలుమార్లు నొక్కుతూ ఉండండి. వాటిని నొక్కితే సహాయం అవసరం ఉందని సంబంధిత వ్యక్తులకు తెలుస్తుంది.
డూర్ మధ్యలో నుంచి చూడండి:
ఎలివేటర్ రెండు ఫ్లూర్ల మధ్యలోనే ఆగిపోతే అంతా చీకటిగా ఉంటుందని గుర్తుంచుకోండి. తలుపుల మధ్య నుంచి వెలుతురు కనిపిస్తే మీ లిఫ్ట్ ఫ్లోర్ చేరుకున్నాక ఆగిందని అర్థం. అప్పుడు మీ చెప్పులు, షూ లేదా ఇంకేదైనా వస్తువులతో లిఫ్ట్ డూర్ మీద బాదండి. చప్పుడు వల్ల దృష్టిని ఆకర్షించగలుగుతారు. లిఫ్టు తలుపులను అలా కొడుతూ ఉంటే మీకు సహాయం దొరుకుతుంది. అలాగే లిఫ్ట్ తలుపుల ముందు కాకుండా, లిఫ్ట్ వెనకవైపు ఆనుకుని నిలబడండి. ఏదైనా సాయం చేసేవాళ్లు ముందుగా తలుపుల మీద ఏదైనా బలం పెట్టొచ్చు. దానివల్ల ఏం కాకుండా మీరు భద్రంగా ఉండగలుగుతారు.