Life of krishna: కృష్ణుడి జీవితమే ఒక గొప్ప పాఠం
Life of krishna: పుట్టుక నుంచి కురుక్షేత్ర సంగ్రామం దాకా కృష్ణుడి జీవితం మనకు అనేక బోధనలు చేస్తుంది. ఆయన చేసిన బోధనలు ఒకెత్తయితే ఆయన జీవితం నేర్పే పాఠాలు బోలెడు.
కృష్ణ జన్మాష్టమి సందర్భంగా భగవంతుని లీలలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని కొన్ని విషయాలను, ఆయన బోధనలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చిన్ని కృష్ణుడిగా చిలిపి చేష్టలతో అలరించిన ముద్దు కృష్ణుడే, మనల్ని సన్మార్గంలో నడిపించే జీవిత బోధనలు చేసిన కృష్ణభగవానుడు. ఆయన జీవితమే ఒక పాఠం.
కృష్ణుడి పుట్టుక
ఆయన జననం కన్నా ముందే సంహారం కోసం పన్నాగాలు జరిగాయి. సొంత మామే పుట్టగానే సంహరించడానికి పథకాలు పన్నాడు. దశావతారాల్లో ఒక అవతార జననం జైలులో జరిగింది. అంత:పురంలో అడుగుల సందడి చేయాల్సిన చిన్ని కృష్ణుడు అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా బోరుమని కురుస్తున్న వానలో, చిమ్మని చీకట్లో చిన్న గ్రామానికి చేర్చబడ్డాడు. సొంత తల్లిదండ్రులకు దూరంగా పెరిగాడు. దేవకీ పుత్రుడు యశోద చెంతన చేరాడు. వాసుదేవుడు నందుడి పుత్రుడిగా పెరిగాడు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను తెలుసుకునే శక్తి ఉన్నా దాని గురించి దిగులు పడలేదు. స్థాయిని పట్టించుకోలేదు. గోపాలురు, గోపికలతో కలిసి ఆనందమైన బాల్యం గడిపాడు.
స్నేహంలో స్థాయికి తావులేదు
కృష్ణుడి చిన్నప్పటి స్నేహితుడు కుచేలుడు కృష్ణుణ్ని కలుసుకోడానికి వస్తాడు. ఆయన దీన పరిస్థితి వల్ల కృష్ణుడికి అటుకులు మాత్రమే బహుమతిగా తీసుకు రాగలుగుతాడు. అవి కూడా ఆయన భార్య భిక్షాటన చేసి సంపాదించినవి. స్థాయిని మర్చిపోయి అతణ్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుంటాడు. ఆ అటుకులే మహా ప్రసాదంగా స్వీకరిస్తాడు. అతని దీన పరిస్థితిని అర్థం చేసుకొని మహాభోగాలు, సంపద ప్రసాదిస్తాడు. స్నేహం విలువ చాటి చెప్పాడు.
ఆడపిల్లకు అవమానం జరిగితే ఊరుకోలేదు
ద్రౌపదిని పందెంలో ఓడిపోతారు పాండవులు. నిండు సభలోనే ద్రౌపది వస్త్రాపహరణ చేయడానికి కౌరవులు సిద్దపడతారు, గొప్ప గొప్ప మహా మునులు, మహర్షులు, మేధావులు కొలువై ఉన్న ఆ నిండు సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ తనని కాపాడమని వేడుకుంటుంది ద్రౌపది. ఎవ్వరూ ఆపన్నహస్తం అందించలేదు. “కృష్ణా” అని తలచుకోగానే నిమిషం ఆలస్యం చేయకుండా ద్రౌపది మానాన్ని కాపాడతాడు కృష్ణుడు. ఆడపిల్లకు అవమానం జరుగుతుంటే కాపాడకుండా, మంచి చెడులు ఆలోచించి లెక్కలు వేసే సమయం కాదని కృష్ణుడు తెలియజెప్పాడు.
కొంటెతనం
కొంటె చేష్టలంటే గుర్తొచ్చే దేవుడు శ్రీ కృష్ణుడే. వయసుతో సంబంధం లేకుండా మనలో ఉన్న చిన్న పిల్లాణ్ని గుర్తుంచుకోవాలి. వయసుతో పాటూ ఆనందం పెరగాలి కానీ, ముఖంపై చిరునవ్వే తగ్గిపోకూడదు. ఏ సందర్భంలోనైనా తన కొంటె చేష్టలు, మాటలతో అందరినీ నవ్వించడం కృష్ణుడికే సాధ్యమైంది. గోపాలుర నుంచి గోపికల వరకు అందర్నీ తన మాటలతో మంత్ర ముగ్దుల్ని చేశాడాయన. ముఖం మీద చిరునవ్వు కోల్పోని సుందర నీలి మేఘశ్యాముడాయన.
ధర్మం వైపే నిలబడాలి
కౌరవులు వంద మంది. పాండవులు అయిదుగురు. బలం, బలగం చూసి కౌరవుల పక్షాన చేరలేదు కృష్ణుడు. ధర్మం వైపే పోరాడాలని పాండవులకు అండగా నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు సన్మార్గాన్ని చూపుతూ అండగా ఉన్నాడు. ఆలోచనల్లో స్పష్టత ప్రతి ఒక్కరికి ఉండాలి. సందర్భాన్ని, మనుషుల్ని బట్టి మనకున్న ఆలోచనలు, నిర్ణయాలు మారకూడదు. ధర్మ మార్గంలో మాత్రమే విజయాన్ని సాధించగలమని కృష్ణుడు నిరూపించాడు.