Lemon Water: వేసవి కాలంలో రోజూ నిమ్మరసం తాగడం మంచిదేనా? ఇది తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటి?-lemon water is it good to drink lemon water every day during summer what are the benefits to the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lemon Water: వేసవి కాలంలో రోజూ నిమ్మరసం తాగడం మంచిదేనా? ఇది తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటి?

Lemon Water: వేసవి కాలంలో రోజూ నిమ్మరసం తాగడం మంచిదేనా? ఇది తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటి?

Ramya Sri Marka HT Telugu

Lemon Water: వేసవి కాలంలో నిమ్మరసం ఎక్కువగా తాగుతుంటాం. పెద్దలు చెప్పినట్లు మంచిదనుకుని వీలైనంత వరకూ గ్లాసుల కొద్దీ లోపలకి పంపించేస్తాం. కానీ, అసలు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటి? అది మనకు నిజంగానే మంచి చేస్తుందా? అని ఎప్పుడైనా ఆలోచించారా?

నిమ్మకాయరసంతో కలిగే ప్రయోజనాలు

వేసవి కాలం ప్రత్యేకంగా తాగే నిమ్మరసం ఏడాదంతా తాగినా ఒకే రకమైన ప్రయోజనాలు అందుతాయి. దీనిని పోషకాలు అందించే డ్రింక్ గానో లేదంటే డీటాక్సింగ్ చేసే జ్యూస్ గానో ట్రీట్ చేసి తాగుతుంటారు. రోజుకు ఒకసారి నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు తక్షణమే దాహాన్ని తీర్చి శరీరానికి సరిపడ పోషకాలను అందిస్తాయి. నిమ్మరసం తాగడం వల్ల కలిగే మరెన్నో ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

విటమిన్ సీ

నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ముఖ్య పోషకం. రోజూ నిమ్మరసం తాగడం వల్ల శరీరం అంటువ్యాధుల బారిన పడకుండా పోరాడేందుకు సహాయపడుతుంది. అప్పటికే జలుబు, జ్వరం బారిన పడితే ఆ సమస్య నుంచి తగ్గిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ యాసిడ్లు

నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం అవుతుంది. మలబద్ధకాన్ని నివారించి, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ప్రేగుల కదలికను మెరుగుపరుస్తుంది.

నీరు

మనలో చాలా మంది రోజుకు అవసరమైనంత నీరు తీసుకోరు. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం కలుగుతుంది. శరీరానికి తగినంత నీరు ఉంటే చర్మ ఆరోగ్యం, మూత్రపిండాల పనితీరు, మొత్తం శక్తి స్థాయిలకు మేలు కలుగుతుంది.

తక్కువ కేలరీలు

నిమ్మరసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ప్రయోజనాలు ఎక్కువగా ఉండి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వును తగ్గించడంతో పాటు ఆకలిని అదుపులో ఉంచుతుంది. నిమ్మరసంలో తేనె కలిపి తాగడం వల్ల తగిన వ్యాయామం, ఆహార నియంత్రణతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు

నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సీతో కలిసి, చర్మానికి మెరుపు అందించడంతో పాటు మృదువైన చర్మాన్ని అందిస్తుంది. ఇది మొటిమలు, ముడతలు, చర్మంపై మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో నీటి కొరత రాకుండా చేసుకుని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

వ్యర్థాలను తొలగిస్తుంది:

నిమ్మరసం ఒక సహజమైన డీటాక్స్ డ్రింక్. ఇది శరీరంలో పేరుకున్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. కాలేయం, మూత్రపిండాలలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది పేగులను శుభ్రపరిచి, రోజంతా అవసరమైన శక్తిని ఇస్తుంది.

శ్వాసని మంచిగా ఉంచుతుంది

నిమ్మరసంలో సహజంగానే నోటిని శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి, మీ శ్వాసకు తాజాదనాన్ని సమకూరుస్తుంది. ఉదయం నిమ్మరసం తాగడం వల్ల నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. రోజు మొత్తంలో నోటిలో ఏర్పడే బ్యాక్టీరియాను వీలైనంత వరకూ తగ్గిస్తుంది.

పొటాషియం

నిమ్మకాయలోని పొటాషియం, అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. రోజూ నిమ్మరసం తాగడం వల్ల రక్తపోటును సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు.

నిమ్మరసం తాగడం వల్ల కలిగే దుష్ప్రభవాలు:

నిమ్మరసం మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఎసిడిటీ పెరగడం, వాంతులు కావడం, పళ్లను సెన్సిటివ్ గా మార్చడం, చర్మంపై అలర్జీలు రావడం, కంటి సమస్యలు కలగొచ్చు. వర్షకాలంలో నిమ్మరసం ఎక్కువ తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువ సార్లు కలిగి డీ హైడ్రేషన్ కు దారి తీస్తుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం