Nimmakaya Charu: టొమాటో రసంలాగే నిమ్మ చారు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Lemon Rasam: నిమ్మకాయతో అనేక రకాల వంటకాలు చేయవచ్చు. నిమ్మకాయతో రుచికరమైన రసం చేయవచ్చు. చింతపండు అవసరం లేకుండా ఈ చారును వండవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.
భోజనంలో చారు లేదా రసం ఉండాల్సిందే. ఎన్ని కూరలు ఉన్నా, వేపుళ్లు ఉన్నా కూడా చారు లేకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. తమిళనాడులో ప్రత్యేకమైన చారును చేస్తారు. అదే నిమ్మకాయ చారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో చింతపండు వాడాల్సిన అవసరం లేదు. ఇది పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మీరే మళ్లీ చేసుకుని తింటారు. దీన్ని చేయడం చాలా సులభం. నిమ్మకాయ చారు రెసిపీ ఇదిగో.
నిమ్మకాయ చారు రెసిపీకి కావలసిన పదార్థాలు
నిమ్మకాయలు - రెండు
టమాటాలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
ఇంగువ పొడి - చిటికెడు
పసుపు - పావు స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
రసం పొడి - ఒక స్పూను
కందిపప్పు - అర కప్పు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నీరు - తగినంత
నూనె - ఒక స్పూను
ఎండు మిర్చి - నాలుగు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
నిమ్మకాయ చారు రెసిపీ
- నిమ్మకాయ రసం తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద పాత్రను స్టవ్ మీద పెట్టాలి.
- అందులో రెండు కప్పుల నీటిని పోసి మరిగించాలి.
- తరువాత అందులో జీలకర్ర పొడి, ఉప్పు, రసం పొడి వేయాలి. తరువాత ఇంగువ పొడి వేయాలి.
- అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసి వేయాలి. తరువాత టమాటోలను ముక్కలు చేసి వేయాలి.
- సాధారణంగా టమాటోలను చేత్తో పిండుతాం. కానీ ఈ రసంలో టమాటోలను ముక్కలు చేసి వేయాలి.
- రసం బాగా మరిగాక అందులో ఉడికించిన కందిపప్పును వేసి కలపాలి.
- మరో కప్పు నీళ్లు కూడా వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంట మీద మరిగించాలి.
- ఇప్పుడు తాళింపు వేసేందుకు సిద్ధమవ్వాలి. ఒక కళాయిని స్టవ్ మీద పెట్టాలి.
- అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి. గుప్పెడు కరివేపాకులు కూడా వేయాలి.
- ఈ తాళింపును మరుగుతున్న కందిపప్పు మిశ్రమంలో వేయాలి. ః
- ఇప్పుడు రెండు నిమ్మకాయలను కోసి ఆ రసాన్ని అందులో వేయాలి.
- పైన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ నిమ్మకాయ చారు రెడీ అయినట్టే.
- దీన్ని వేడి అన్నంలో వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రసాన్ని మీరు కూడా ఇంట్లోనే ప్రయత్నించి చూడండి.
దీనిలో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. దీన్ని కేవలం నిమ్మకాయ రసంతోనే పులుపు వచ్చేలా చేయాలి. అంతేకాకుండా ఈ కొత్త రకం రసాన్ని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
సంబంధిత కథనం