Leftover Oil Reuse: డీప్ ఫ్రై చేశాక మిగిలిపోయిన నూనెను తిరిగి ఇలా ఉపయోగించండి-leftover oil reuse reuse the remaining oil after deep frying ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Leftover Oil Reuse: డీప్ ఫ్రై చేశాక మిగిలిపోయిన నూనెను తిరిగి ఇలా ఉపయోగించండి

Leftover Oil Reuse: డీప్ ఫ్రై చేశాక మిగిలిపోయిన నూనెను తిరిగి ఇలా ఉపయోగించండి

Haritha Chappa HT Telugu

Leftover Oil Reuse: డీప్ ఫ్రై వంటకాలు చేశాక నూనె మిగిలిపోవడం సహజం. దాన్ని వంటలకు వినియోగించడం మంచిది కాదు. వాటిని వినియోగించేందుకు వేరే మార్గాలు ఉన్నాయి.

డీప్ ఫ్రై చేసిన నూనె ఎలా వినియోగించాలి? (pixabay)

Leftover Oil Reuse: డీప్ ఫ్రై వంటకాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టం. తరచూ ఇటువంటి ఆహారాలను తింటూనే ఉంటారు. అయితే డీప్ ఫ్రై చేశాక మిగిలిన వంట నూనెను తిరిగి వినియోగించకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ నూనెను తిరిగి వినియోగించడం వల్ల గుండె జబ్బులు, బ్రెయిన్, కాలేయ వ్యాధులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. నూనెను వడకట్టి తిరిగి వంటకాలకు వినియోగించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అలా చేస్తే చేజేతులా మీరే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారవుతారు. ఆ నూనెను మీరు పారబోయలేకపోతే దాన్ని అనేక విధాలుగా వినియోగించుకోవచ్చు. డీప్ ఫ్రై చేశాక మిగిలిన నూనెను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. డీప్ ఫ్రై చేసిన నూనెను వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లో వేయాలి. ఆ నూనెలో కొన్ని చుక్కల లిక్విడ్ సోపును కూడా కలపాలి. అలాగే కాస్త నీళ్లను కూడా వేయాలి. బాగా చిలకరించి ఆ మిశ్రమాన్ని మొక్కలపై స్ప్రే చేయడం వల్ల చీడపీడలు రాకుండా ఉంటాయి. ఇలా మిగిలిన నూనెతో మొక్కలను రక్షించుకోవచ్చు.

2. మీరు ఇంట్లో సొంతంగా సబ్బు తయారు చేసుకోవడానికి ఇలా మిగిలిపోయిన వంట నూనెను వినియోగించుకోవచ్చు. నూనెలో సహజ కొవ్వులు ఉంటాయి. ఇవి సబ్బు తయారీకి ఉపయోగపడతాయి. వంట నూనెతో సబ్బులు ఎలా తయారు చేయాలో యూట్యూబ్ లో చూసి ఓసారి ప్రయత్నించండి. మిగిలిన వంట నూనెను పారబోయాల్సిన అవసరం లేకుండా తిరిగి వినియోగించుకోవచ్చు.

3. ఆరుబయట లాంతర్లు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. మొక్కల మధ్యలో కూడా లాంతర్లు పెట్టే వాళ్ళు ఎంతోమంది. ఆ లాంతర్లకు వంటనూనెను పోసి వాడుకుంటే మంచిది. వడకట్టిన నూనెను గాజు కంటైనర్లలో వేసి లాంతరులుగా వెలిగించి ఇంట్లో పెడితే ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే వంట నూనె వేయడం వల్ల ఎక్కువ సేపు దీపం వెలిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి మండే స్వభావం నెమ్మదిగా ఉంటుంది.

4. డీప్ ఫ్రై చేశాక మిగిలిపోయిన వంట నూనెను సహజ కండిషనర్ గా ఉపయోగించుకోవచ్చు. ఒక వస్త్రంలో కొద్దిగా నూనెను వేసి బూట్లు, సంచులు, ఫర్నిచర్, కారు సీట్లు వంటివి రుద్దడం వల్ల అక్కడ ఉన్న మరకలు, మురికి పోతాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి.

5. ఇనుప వస్తువులకు తుప్పు పట్టడం సహజం. ఇలా తుప్పు రాకుండా అడ్డుకునే శక్తి వాడేసిన వంట నూనెకు ఉంటుంది. అలాంటి పరికరాలకు మిగిలిపోయిన వంట నూనెను పూయండి. దీనివల్ల అక్కడ తేమ చేరకుండా, తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇనుము వస్తువును కాపాడుకోవడానికి ఇలా వాడేసిన వంట నూనెను వినియోగించుకోవచ్చు.

6. ఎక్కడికైనా క్యాంపింగ్ కు వెళ్లినప్పుడు క్యాంప్ ఫైర్లు వేసుకోవడానికి వంట నూనెను పోస్తే త్వరగా మంట అంటుకుంటుంది. భోగి మంటలకు కూడా ఇలా మిగిలిపోయిన వంట నూనెను వేసి మొదటిసారి మంటను రగిలించవచ్చు.