Idli Vada: ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయాయా? వాటితో టేస్టీగా గారెలు చేసేయండి, క్రంచీగా క్రిస్పీగా వస్తాయి-left idlis at home make tasty garelu with them they will be crunchy and crispy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idli Vada: ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయాయా? వాటితో టేస్టీగా గారెలు చేసేయండి, క్రంచీగా క్రిస్పీగా వస్తాయి

Idli Vada: ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయాయా? వాటితో టేస్టీగా గారెలు చేసేయండి, క్రంచీగా క్రిస్పీగా వస్తాయి

Haritha Chappa HT Telugu
Oct 18, 2024 11:36 AM IST

Idly Vada: రెండు మూడుసార్లు ఇడ్లీని బ్రేక్ ఫాస్ట్ గా తినే వారి సంఖ్య ఎక్కువ. ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు పడేయకుండా వాటితో టేస్టీ గారెలు వండవచ్చు. రెసిపీ ఇదిగో.

మిగిలిపోయిన ఇడ్లీలతో గారెలు
మిగిలిపోయిన ఇడ్లీలతో గారెలు (pexel)

ఇడ్లీలు ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్. అందుకే ఎక్కువ మంది వాటిని తినేందుకు ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని తినలేక పడేయడం వంటివి చేస్తారు. అలాంటప్పుడు మిగిలిపోయిన ఇడ్లీలతో క్రంచీగా గారెలు వండేయండి. ఈ గారెలను పల్లీ చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఉదయం మిగిలిపోయిన ఇడ్లీలు సాయంత్రానికి స్నాక్స్ గా ఉపయోగపడతాయి. మిగిలిపోయిన ఇడ్లీలతో గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి.

ఇడ్లీలతో గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు

మిగిలిపోయిన ఇడ్లీలు - నాలుగు

ఉప్పు - రుచికి సరిపడా

బియ్యప్పిండి - అర స్పూను

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

మెంతులు - పావు స్పూను

అల్లం తరుగు - అర స్పూను

పచ్చిమిర్చి - రెండు

జీలకర్ర - పావు స్పూను

మిరియాల పొడి - పావు స్పూను

ఉల్లిపాయ - రెండు

ఉప్మా రవ్వ - పావు కప్పు

మిగిలిపోయిన ఇడ్లీలతో గారెలు రెసిపీ

1. ఉల్లిపాయలను, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకులు, కొత్తిమీర అన్నింటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో ఇడ్లీలను చేత్తోనే పొడిపొడిగా మెదుపుకోవాలి.

3. వాటిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, బియ్యప్పిండి, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఉప్మా రవ్వ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

4. ఆ మిశ్రమం మరీ మందంగా ఉంటే కాస్త నీళ్లు పోసి గారెల పిండికి అవసరమైనంత మేరకు కలుపుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి ఆ నూనె వేడెక్కాక కాస్త పిండి ముద్దను తీసి గారెల్లా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి.

7. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.

8. అంతే టేస్టీ గారెలు రెడీ అయినట్టే. ఇవి క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది.

ఇడ్లీలో మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి గారెలు చేసి చూడండి. మీ ఇంట్లో వారికి నచ్చడం ఖాయం. ఇవి కాస్త కొత్త రుచిగా ఉంటాయి. కాబట్టి సాధారణ గారెలు కన్నా ఇవి టేస్టీగా ఉండడం ఖాయం. వీటిని ఒకసారి మీరు చేసి చూడండి.

Whats_app_banner