పెరుగును ఇలా తిన్నారంటే ఈజీగా బరువు తగ్గుతారు, కొద్ది రోజుల్లోనే తేడా తెలుస్తుంది!-learn how to eat curd or yogurt for weight loss here are the simple tricks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పెరుగును ఇలా తిన్నారంటే ఈజీగా బరువు తగ్గుతారు, కొద్ది రోజుల్లోనే తేడా తెలుస్తుంది!

పెరుగును ఇలా తిన్నారంటే ఈజీగా బరువు తగ్గుతారు, కొద్ది రోజుల్లోనే తేడా తెలుస్తుంది!

Ramya Sri Marka HT Telugu

బరువు తగ్గడంలో పెరుగు చాలా బాగా సహాయపడుతుందని మీకు తెలుసా? అవును ప్రోటీన్, ప్రోబయోటిక్స్, కాల్షియం వంటి వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే పెరుగును సరైన పద్ధతిలో తిన్నారంటే సులువుగా బరువు తగ్గుతారట. కొద్ది రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుందట. ఎలాగో తెలుసుకుందాం రండి.

బరువు తగ్గడం కోసం పెరుగును ఎలా తినాలో తెలుసుకోండి (Shutterstock)

పెరుగుతున్న బరువుతో ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి తప్పుడు ఆహారం, రెండవది శారీరక శ్రమ తగ్గిపోవడం. కారణాలైవైనా బరువు తగ్గడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వాకింగ్, జాగింగ్ వంటి వాటితో వ్యాయామాలు, యోగాసనాలు వంటివి చేస్తుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆహారంలో మార్పు. వెయిట్ లాస్ కోసం ఒక డైట్ ప్లాన్ చేసుకుని దాని అనుగుణంగా ఆహారాలను విభజించి తీసుకుంటున్నారు. మీరు కూడా అలాంటి వారే అయితే మీ డైట్‌లో పెరుగును తప్పకుండా తీసుకోండి.

కాల్షియం, ప్రోబయోటిక్స్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలతో నిండిన పెరుగు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. దీన్ని విధాలుగా మీ వెయిట్ లాస్ డైట్ లో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. పెరుగును ఎలా తింటే సులభంగా, త్వరగా బరువు తగ్గుతారో తెలుసుకోండి.

బరువు తగ్గడం కోసం పెరుగును ఎలా తినాలి?

1. పండ్లతో కలిపి తినండి

పెరుగును మరింత రుచికరంగా, పోషకాహారంగా మార్చాలంటే మీరు సాదా పెరుగులో కొన్ని తాజా పండ్లను చేర్చుకోవచ్చు. ఆపిల్, అరటి, బెర్రీలు వంటి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెరుగులో వేసుకుని తినండి. దీంట్లో ఉప్పు, చక్కెర వంటి వాటిని కలుపకుండా తింటేనే మంచిదని గుర్తుంచుకోండి. ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ పదార్థాల కలయికను మధ్యాహ్నం పూట తింటే బరువు తగ్గడం సులువు అవుతుంది.

2. మసాలాలు కలిపి తినండి

పెరుగులో ఉన్న మంచి బ్యాక్టీరియా జీవక్రియను పెంచుతుంది. అయితే, కొన్ని భారతీయ మసాలాలను పెరుగుతో కలిపి తినడం వల్ల ఈ లక్షణాలు మరింత వృద్ధి చెందుతాయి. ఇది బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం పెరుగులో చిటికెడు నల్ల మిరియాలు, పసుపు, జీలకర్ర లేదా దాల్చిన చెక్క వంటి మసాలాలను చేర్చుకోవచ్చు. దీని వలన పెరుగు రుచి కూడా మెరుగుపడుతుంది.

3. స్మూతీలో వేసుకుని తినండి

బరువు తగ్గించుకునేందుకు మీ ప్రయాణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చాలనుకుంటే స్మూతీలు బెస్ట్ ఆప్షన్. దీని కోసం, మీరు అరటి, ద్రాక్ష, ఆపిల్, డేట్స్ వంటి పండ్లను పెరుగుతో కలిపి చిక్కటి స్మూతీని తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటంతో పాటు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా అధిక ఆకలి నుంచి తప్పించుకోగలుగుతారు. బరువు పెరగకుండా ఉంటారు. పాలకూర వంటి ఆకుకూరలతో తయారు చేసుకున్న స్మూతీల్లో కూడా పెరుగు వేసుకుని తింటే మంచిది.

4. చారు చేసుకుని తినండి

వేసవిలో బరువు తగ్గడానికి పెరుగు చారు చాలా మంది ఆప్షన్. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఉల్లిపాయలతో పెరుగు చారు తయారు చేసుకోవచ్చు. దీనితో పాటు కొన్ని రకాల కూరగాయలను కూడా చేర్చవచ్చు. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి, కడుపుకు చాలా తేలికగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రుచికరమైన, రిఫ్రెష్‌మెంట్ ఆహారంగా ఎంపికను వెతుకుతున్నట్లయితే పెరుగు చారు మీకు మంచి ఆప్షన్.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం