Saturday Motivation: సోమరితనమే మీ పెద్ద శత్రువు, దాన్ని వదిలిపెడితేనే మీకు విజయం దక్కేది
Saturday Motivation: కోరుకున్నది దక్కాలంటే కృషి చేయాలి. అలా కాకుండా ఒక మూల కూర్చుని బద్దకంగా ఆలోచిస్తే ఏదీ దక్కదు. సోమరితనం వదిలించుకుంటేనే అన్ని విధాలా మంచిది.

Saturday Motivation: ఒక గ్రామంలో ఓ రైతు నివసించేవాడు. అతను ఎంతో కష్టపరుడు. తన కుటుంబాన్ని ఎంతో కష్టపడి సాకాడు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చిన ఆ రైతు తన కష్టంతోనే లక్షల ఆస్తిని కూడబెట్టాడు. పొలాలు కొన్నాడు. అతనికి రామయ్య అనే కొడుకు ఉన్నాడు. రామయ్య తన తండ్రికి వ్యతిరేకంగా ఉంటాడు. తండ్రి ఎంత కష్టపడతాడో రామయ్య అంత సుఖ పడతాడు. అతను విపరీతమైన సోమరిపోతు.
రైతు తన కొడుకు రామయ్య ను చూసి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఎన్నోసార్లు కష్టపడి పని చేయమని చెబుతున్నా కూడా రామయ్య చెవికెక్కించుకోడు. ఎలాగైనా అతనికి సోమరితనాన్ని వదిలించి కష్టించి పని చేసేలా చేయాలని అనుకున్నాడు రైతు. అందుకోసం తన భార్యని పిలిచి కొడుకుకి ఆహారం పెట్టవద్దని చెప్పాడు. ఎప్పుడైతే సొంతంగా డబ్బు సంపాదించి తెస్తాడో అప్పుడే అన్నం పెట్టమని చెప్పాడు.
రామయ్య తల్లి దగ్గరకు వెళ్లి తాను పనిచేయలేనని బాధపడ్డాడు. తల్లి ప్రేమతో కొంత డబ్బును ఇచ్చింది. ఆ డబ్బును తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు. ఆ డబ్బులు తాను కష్టపడి సంపాదించానని చెప్పాడు. వెంటనే ఆ రైతు ఆ డబ్బును తీసుకెళ్లి వంటింట్లో మండుతున్న పొయ్యిలో వేశాడు. రామయ్య అది చూసి ఏమీ మాట్లాడలేదు. ఆరోజు తల్లి పెట్టిన భోజనం తిని పడుకున్నాడు. మర్నాడు కూడా రామయ్య తల్లిని అడిగి డబ్బు తీసుకున్నాడు. అదే డబ్బును తండ్రికి ఇచ్చి తాను సంపాదించానని చెప్పాడు. ఆ తండ్రి మళ్ళీ దాన్ని మంటల్లోనే వేశాడు. రామయ్య ఏమి అనకుండా అలా చూసుకుంటూ ఉండిపోయాడు. తల్లి పెట్టిన ఆహారాన్ని తిని నిద్రపోయాడు.
ఆ రైతు తన భార్యను పిలిచి కొడుకుకి డబ్బులు ఇవ్వద్దని గట్టిగా చెప్పాడు. ఇలా ఇస్తే కొడుకు భవిష్యత్తు పాడవుతుందని, వాడిని దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని వివరించాడు. రామయ్య మళ్ళీ తల్లి వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో ఏం చేయాలో తెలియక రామయ్య కూలి పనికి వెళ్ళాడు. సాయంత్రం దాకా కష్టపడ్డాక కూలి డబ్బులు చేతికొచ్చాయి. అవి తీసుకెళ్లి మళ్ళీ తండ్రి చేతిలో పెట్టాడు. ఆ తండ్రి వాటిని కూడా మంటల్లో వేశాడు. దాంతో రామయ్యకు కోపం వచ్చింది. వెంటనే మంటల్లోంచి ఆ డబ్బును బయటకు తీసి పడేసాడు. తండ్రి పై అరుస్తూ ‘నువ్వు చేసిన పని ఏమైనా బావుందా? నేను రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా వృధా చేస్తావా?’ అని అన్నాడు.
దానికి ఆ రైతు తన కొడుకుని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ‘కష్టపడి సంపాదించిన డబ్బుపై ఎంత మమకారం ఉందో తెలిసిందా? నేను మొదటి రెండు రోజులు డబ్బును మంటల్లో వేసినా నువ్వు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే నీకు కష్టం విలువ తెలియదు. ఇప్పుడు కష్టం విలువ తెలిసింది. డబ్బు సంపాదించడం అంత సులువైన పద్ధతి కాదని అర్థమైంది. అందుకే మంటల్లో వేసినా కూడా దానిని నువ్వు బయటికి తీసావు. సోమరితనంతో నువ్వు నేను సంపాదించిన డబ్బును వృధా చేస్తుంటే నాకు అంతే బాధగా ఉంటుంది. అర్థం చేసుకో’ అని చెప్పాడు. అప్పటినుంచి రామయ్య సోమరితనాన్ని విడిచి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు.
ఇంట్లో సౌకర్యవంతమైన ప్రదేశంలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ విజయం ఎలా సాధించాలో అని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారికి చెప్పేది ఒక్కటే... మీరు విజేతగా నిలవాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టండి. సౌకర్యాలు, విశ్రాంతి వంటి పదాలను మరచిపోండి. కష్టపడి పనిచేయండి. విజేత కావాలనుకునే వారు ఎవరూ కూడా ఒకచోట కూర్చుని నిద్రపోతూ ఆలోచించరు. పనిచేస్తూనే ఆలోచిస్తారు. మీరు కోరుకున్నది మీకు ఊరికే లభించదు. కష్టపడి పని చేస్తే మాత్రమే మీకు అది దక్కుతుంది. విజయం అంత సులభం కాదు. సోమరితనం ఉంటే విజయం ఆమడ దూరం ఉండడం ఖాయం.