digital wedding invitation: డిజిటల్ హంగులతో.. పెళ్లి శుభలేఖలు..-latest trends in digital wedding invations designs and types ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Latest Trends In Digital Wedding Invations Designs And Types

digital wedding invitation: డిజిటల్ హంగులతో.. పెళ్లి శుభలేఖలు..

Koutik Pranaya Sree HT Telugu
May 04, 2023 12:17 PM IST

wedding invitation: పెళ్లి పత్రికల్లో చాలా మార్పులొచ్చాయి. నేటితరం మెచ్చిన డిజిటల్ ఇన్విటేషన్ల గురించి చూద్దాం.

డిజిటల్ పెళ్లి పత్రిక
డిజిటల్ పెళ్లి పత్రిక (victoryinvitations)

పాతకాలంలో ఊళ్లో పెళ్లి ఉందంటే చాటింపు వేయించి పెళ్లి ముహూర్తం, తేదీ , చోటు చెప్పేవాళ్లు. ఆ తరువాత కొన్ని రోజులకు పోస్టుల ద్వారా శుభలేఖలు పంపడం మొదలైంది. ప్రయాణ సౌకర్యాలు కాస్త మెరుగయ్యాక దూరంలో ఉన్న వాళ్లకి కూడా స్వయానా వెళ్లి పత్రికలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు విమానంలో వెళ్లొచ్చే సౌకర్యం ఉన్నా.. సమయం ఉండట్లేదు. అందుకే డిజిటల్ పెళ్లి పత్రికలు సర్వ సాధారణం అయిపోయాయి. వాట్సాప్ మెసేజీలో, స్టేటస్ లో పెట్టి అందర్నీ ఆహ్వానిస్తున్నాం. అలాంటప్పుడు ఏదో పేర్లు రాసి, ప్రింట్ చేయించిన పత్రిక ఫోటో తీసి పంపితే ఏం బాగుంటుందనుకున్నారు. అందుకే ఇపుడు డిజిటల్ ఇన్విటేషన్ లలో కూడా చాలా మార్పులొచ్చేశాయి. సినిమా ట్రైలర్ల లాగా చిన్న వీడియోలకు బోలెడు హంగులతో వీటిని తయారు చేస్తున్నారు. ఈతరం అభిరుచికి తగ్గట్టు వచ్చిన డిజైన్లు బోలెడు.. అవేంటో చూద్దాం.

1. వేడుకకి తగ్గట్లు:

ముహూర్తం, పసుపు దంచడం, మంగళ స్నానం, హల్దీ, సంగీత్, మెహందీ.. ఇలా పెళ్లి కన్నా ముందు ఎన్నో కార్యక్రమాలుంటాయి. వాటన్నింటికీ ప్రత్యేకంగా వేటికవే డిజైన్లు చేయించేసుకోవచ్చు. ఆ వేడుకని బట్టి ఇన్విటేషన్ లో మీకుండాల్సిన బట్టల్ని కూడా మీరే కస్టమైజ్ చేయించుకోవచ్చు. వాటికి తగ్గట్లు డిజైన్ చేసిస్తారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పేజీలు బోలెడున్నాయి. మీరెంచుకున్న డిజైన్ కి తగ్గట్లు ధర ఉంటుంది.

2. మీ కథ చెప్పేలా:

ఇక ప్రతి పెళ్లి ప్రత్యేకమే..ప్రతి మనువుకు ఒక కథ ఉంటుంది. ప్రేమ వివాహం అయితే ఎక్కడ కలిశారు? ఎప్పుడు ఇష్ట పడ్డారు? మొదటి సారి కలిసిందెపుడు?ఆ తేదీలేంటి.. ఇలా ఈ వివరాలన్నీ తెలిసేలా డిజిటల్ ఇన్విటేషన్ చేయించుకోవచ్చు. పెద్దలు కుదిర్చిన వివాహమైతే మీ పెళ్లి చూపులు జరిగిన తేదీ, మొదటి చూపులో మీకు కలిగిన అభిప్రాయం, తరువాత ఎక్కడ ఎప్పుడు కలుసుకున్నదీ.. ఇలా అన్ని వివరాలతో మీ పెళ్లి కథ చేయించుకోవచ్చన్న మాట.

3. వీడియోలు, ఆడియోలు:

కొన్ని రకాల పెళ్లి పత్రికలకు తల్లి దండ్రుల గొంతుతో వాళ్ల భావోద్వేగాలు చెబుతూ, వధూవరుల్ని పరిచేయం చేస్తూ పెళ్లి పత్రిక తయారు చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ల వీడియోలతో చేయించుకుంటే .. ఇంకొంతమంది వాళ్లలాగే అనిపించే డిజిటల్ బొమ్మల వీడియోలతో ఈ పెళ్లి పత్రిక తయారు చేయించుకుంటున్నారు.

4. రిచ్ గా కనిపించేలా:

చేతిలో పెట్టే కాగితపు పెళ్లిపత్రికలు కూడా డబ్బులు పెట్టగలిగితే… ఆడంబరంగా కనిపించేలా , లేదంటే ఉన్నంతలో మంచి డిజైన్ ఎంచుకుంటాం. ఆ వైవిధ్యం డిజిటల్ పత్రికల్లో కూడా కనిపిస్తుంది. మంచి ఎఫెక్టులు, మంచి కాస్టూమ్స్ డిజైన్ చేసే డిజిటల్ పత్రికకు ఒక ధర, మామూలు వాటికి ఒక ధర ఉంటోంది.

WhatsApp channel

టాపిక్