జీవితంలో తోడు అనేది ప్రతి ఒక్కరికీ అవసరం.అయితే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అంటారు పెద్దలు.కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా లేదంటే ఆర్థిక సమస్యల వల్ల కొందరికి వివాహం కాస్త ఆలస్యం కావొచ్చు. మరికొందరు మొదట్లో పెళ్లి వద్దనుకుని కాస్త లేటుగా రియలైజ్ అవుతుంటారు. అలా లేటు వయసులో తోడు కోసం వెదుకుతుండొచ్చు.
ఇలా లేటు వయసులో అయినా పెళ్లి చేసుకోవాలి అనుకోవడం మంచిదే. ఈ నిర్ణయం సరైనదే అయి ఉండొచ్చు కానీ, ఇలా వయసు పైబడ్డాక అంటే దాదాపు నలభై ఏళ్లు దాటాక కొత్త వ్యక్తిని అంటే భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోగలమని నమ్మినప్పుడే దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా సొంతమవుతాయి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వయసు పైబడ్డాక వివాహం చేసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో వాటిని ఎలా ఎదుర్కొవాలో తెలుసుకుందాం రండి.
ప్రతి వ్యక్తికీ భిన్నమైన అభిరుచులు, అలవాట్లు ఉంటాయి. వయసు పెరిగేపొద్దీ అవి వారిలో పాతుకుపోయి ఉంటాయి. వీటికి అలవాటు పడ్డ వీరు లేటు వయసులో మార్చుకోవడం కష్టంతో కూడినదనే చెప్పాలి. కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తే, ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, అలవాట్ల విషయంలో సర్దుకుపోవడం ఇబ్బందిగా ఉంటుంది. అర్థం చేసుకుని కలుపుకోవాలని ప్రయత్నించినా కొంత సమయం పట్టవచ్చు.
వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. ఇద్దరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉంటే, అవతలి వ్యక్తి దానిని హ్యాండిల్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే సంబంధం చెడిపోయే అవకాశాలు ఉంటాయి కూడా.
కొన్నిసార్లు, కుటుంబ సభ్యులు కొత్త వ్యక్తిని వెంటనే అంగీకరించకపోవచ్చు. వయస్సు దాటిన తర్వాత తోడు కోసం ప్రయత్నిస్తుంటే కుటుంబ సభ్యుల్లోనే వ్యతిరేకత కలుగుతుంది. వారిని ఒప్పించగలిగితేనే ఒత్తిడి లేకుండా సమస్య పరిష్కరించుకోవచ్చు.
గత సంబంధాల వల్ల కలిగిన గాయాలు లేదా కోపం వంటి భావోద్వేగ సమస్యలు కొత్త సంబంధానికి ఆటంకం కలిగించవచ్చు. తరచూ పాత బంధాలను కొత్త వారితో పోల్చుకోవడం కాస్త ఇబ్బందిని కలిగించవచ్చు.
• సహకారం: వృద్ధాప్యంలోనైనా, నడి వయస్సు వారికైనా ఒకరికొకరు తోడుగా ఉండటం చాలా ముఖ్యం. భాగస్వామి ఉంటే, కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు.
• సాంగత్యం: ఒంటరితనం వృద్ధాప్యంలో ఒక పెద్ద సమస్య. భాగస్వామి ఉంటే, మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ఎవరూ లేరనే భావనను దాటగలుగుతారు.
• భావోద్వేగ సంతృప్తి: ప్రేమ, ఆప్యాయత అనే ఫీలింగ్స్ మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచివి. భాగస్వామి ఉంటే, మీరు ఈ భావాలను పొందవచ్చు.
• జీవితకాలంలో నాణ్యత: వృద్ధాప్యంలో వివాహం చేసుకున్న వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారని, సంతోషంగా ఉంటారని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
• సంతానోత్పత్తి ఆందోళనలు: ఆలస్యంగా పెళ్లి చేసుకునే వారిలో తల్లిదండ్రులయ్యే సామర్థం కూడా తగ్గుతుంది.
ఒంటరి జీవితాన్ని గడపడం అనేది వ్యక్తి మానసిక స్థితి, సామాజిక సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎటువంటి మానసిక సమస్యలు లేకుండా సంతోషంగా గడిపేస్తారు. మరికొందరు వ్యక్తులు ఒంటరిగా ఉండలేకపోగా, ఒంటరితనం వల్ల కలిగే ఆందోళన, నిరాశకు గురవుతారు. ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. మీరు ఒంటరి జీవితం గురించి ఆందోళన చెందుతుంటే, మీరు మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించవచ్చు. కచ్చితంగా మీకు తోడు కావాలని అనిపిస్తే లేటు వయస్సులోనైనా మీకు తగ్గ భాగస్వామి కోసం ప్రయత్నించవచ్చు.
సంబంధిత కథనం