New Year Promises: మహిళలూ..! కొత్త సంవత్సరాన్ని కొన్ని ప్రమాణాలతో ప్రారంభించండి.. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి-ladies start the new year with some standards love and take care of yourself ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Promises: మహిళలూ..! కొత్త సంవత్సరాన్ని కొన్ని ప్రమాణాలతో ప్రారంభించండి.. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి

New Year Promises: మహిళలూ..! కొత్త సంవత్సరాన్ని కొన్ని ప్రమాణాలతో ప్రారంభించండి.. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి

Ramya Sri Marka HT Telugu
Dec 27, 2024 05:00 PM IST

New Year Promises: జీవితం ఎప్పుడూ కొత్త విషయాలను నేర్పిస్తుంది, కొత్త పరిస్థితులను ముందుకు తీసుకొస్తుంది. సంతోషంగా జీవించాలంటే పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం తప్పనిసరి. కొత్త సంవత్సరం సమీపిస్తోంది. ఏడాదంతా సంతోషంగా గడిపేందుకు మీకు మీరు కొన్ని ప్రమాణాలు చేసుకుంటే తప్పేముంది?

కొత్త సంవత్సరాన్ని కొన్ని ప్రమాణాలతో ప్రారంభించండి.. ఏడాదంతా సంతోషంగా జీవించండి
కొత్త సంవత్సరాన్ని కొన్ని ప్రమాణాలతో ప్రారంభించండి.. ఏడాదంతా సంతోషంగా జీవించండి

అన్ని రోజులు ఒకేలా ఉండవు, కొన్ని రోజులు మన అంచనాల కంటే మెరుగ్గా ఉంటాయి, ఇంకొన్ని రోజులు సవాలుగా మారతాయి. కానీ అదే జీవితాన్ని ఆసక్తికరంగా మారుస్తుంది. ఎందుకంటే అన్ని రకాల ఒడిదుడుకులతో నిండిన నిరంతర ప్రయాణమే జీవితం. ఈ హెచ్చుతగ్గులు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసినప్పటికీ, మహిళలు ఈ మార్పులను కొంచెం ఎక్కువగా అనుభూతి చెందుతారు. ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించడం, కుటుంబం, ఆఫీసు, లెక్కలేనన్ని ఇతర పనులను చూసుకోవడం కొన్నిసార్లు మిమ్మల్ని మానసికంగా బాగా కుంగిపోయేలా చేస్తాయి. అటువంటి పరిస్థితిలో మీకు జీవితం సవాలుగా మారుతుంది, ఏమి చేయాలో అర్థం కాదు.

yearly horoscope entry point

వాస్తవానికి ఇది అంత తీవ్రమైన సమస్య కాదు, ఎందుకంటే మీరు మీ స్వంత జ్ఞానం, విచక్షణతో వ్యవహరించడం ద్వారా ఈ సవాళ్లను సులభతరం చేయవచ్చు. రాబోయే సంవత్సరంలో మీ అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటే, ఖచ్చితంగా మీకు మీరు కొన్ని నియమాలను పెట్టుకొండి, కొన్ని ప్రమాణాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి.

మార్పుకు భయపడకండి

ప్రతిదీ ఎల్లప్పుడూ ఒకేలా ఉండదని గుర్తంచుకోండి. మార్పు అనేది ప్రపంచ నియమం. కాబట్టి మార్పుకు భయపడే బదులు, హుందాతనంతో, పూర్తి విశ్వాసంతో దాన్ని స్వాగతించండి. ఎలాంటి మార్పు అయినా మొదట అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ వ్యక్తిగత ఎదుగుదలకు కొత్త అవకాశంగా భావించి ముందడుగు వేయండి. తద్వారా మీ సమస్యలకు పరిష్కారం సులభతరం అవుతుంది.

సొంత నిర్ణయాలు తీసుకొండి

ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధార పడటం మానుకొండి. కొన్నిసార్లు మీ జీవితం గురించి మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే మీకు ఏది మంచిదో మీకు మాత్రమే తెలుసు. వాళ్లేమనుకుంటారో, వీళ్లు ఏమంటారో అనే భయం నుంచి బయటికి వచ్చి మీ అవగాహనకు అనుగుణంగా జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకొండి. మీ కలలు, మీ అభిరుచికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాదు మీరు తీసుకునే నిర్ణయాలు మరొకరిపై ప్రతికూల ప్రభావాన్ని చూపకుండా ఉండాలి.

మనస్సు మాట వినడం తప్పేం కాదు

మన అంతర్గత స్వరం ఎప్పుడూ మనకు అబద్ధం చెప్పదు, కాబట్టి మీ మనస్సు మాట తప్పకుండా వినండి. మీపై మీరు పూర్తి నమ్మకం ఉంచండి. ఒక్కోసారి మనసు కొన్నింటిని నమ్మదు. అలాంటప్పుడు ఫలితం కూడా బాగుండదు. ఏదైనా పని చేయడానికి సంకోచం ఉంటే లేదా ఏదైనా విషయంపై మనస్సులో సందేహం ఉంటే దానిని మళ్ళీ ఆలోచించి మీరే నిర్ణయం తీసుకొండి.

నో చెప్పడం అలవాటు చేసుకొండి

బాధ్యతలు, అంచనాల కారణంగా మహిళలు తరచూ భారీ ఒత్తిడికి లోనవుతారు. దేని గురించి వారి అసమ్మతిని వ్యక్తం చేయరు. ఫలితంగా పనిభారం పెరిగిపోయి తమకంటూ సమయం లేకుండా పోతోంది. ఈ ఒత్తిడిని నివారించడానికి, 'నో' చెప్పడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రాధాన్యతలకు సరిపోని లేదా అనవసరంగా మీ శారీరక, మానసిక శక్తిని హరించే పనిని మర్యాదగా తిరస్కరించడం నేర్చుకోండి. మీ ఈ కొత్త అలవాటు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా మీ మానసిక ప్రశాంతతను కాపాడుతుంది.

క్షమించడం నేరమేమి కాదు

బాధాకరమైన జ్ఞాపకాలను ఎప్పుడూ మనసులోనే ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతం మళ్ళీ రాదు, మీరు దాచుకున్న జ్ఞాపకాల మూట మిమ్మల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. కాబట్టి గతాన్ని వదిలేసి క్షమించడం నేర్చుకోండి. అప్పుడే మీరు ముందుకు సాగ గలుగుతారు. క్షమించడం అంటే ఎవరైనా మీకు చేసింది సరైనదని కాదు. బదులుగా, మీరు గతం తాలుకా ప్రతికూలతను వదిలివేసి కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారని అర్థం. కొన్నిసార్లు తప్పు చాలా తీవ్రంగా ఉంటుంది, క్షమించడం చాలా కష్టం అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, భవిష్యత్తులో మీకు ఆ వ్యక్తితో ఎటువంటి సంబంధం లేకపోయినా క్షమించడానికి ప్రయత్నించండి. ఇది ఖచ్చితంగా మీకు మనశ్శాంతిని ఇస్తుంది.

మీ హక్కులు కూడా మీకు ముఖ్యమే

ఇతరుల బాగోగులు చూసుకోవడమే తమ ధర్మమని ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచే బోధిస్తారు. బహుశా అందుకే చాలా మంది మహిళలు తమ గురించి ఎప్పుడూ ఆలోచించరు. కానీ అలా చేయడం సరికాదు ఎందుకంటే ఇతరుల మాదిరిగానే, మీకు కూడా సంతోషకరమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి అన్ని హక్కులు ఉన్నాయి. పచ్చని చెట్టు మాత్రమే ఇతరులకు నీడ నివ్వగలదనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం, పౌష్టికాహారం, మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజూ మీ కోసం కొంత సమయం కేటాయించండి, దీనిని మీరు కోరుకున్న విధంగా ఖర్చు చేయవచ్చు.

బావిలో కప్పల్లాగా జీవించకండి

జీవితం చాలా ఉత్తేజకరమైన ప్రయాణం, ఇక్కడ ప్రతి మలుపు ఒక కొత్త అనుభవాన్ని తెస్తుంది. ఒకే పంథాలో అనుసరించే జీవితం సౌకర్యవంతంగా అనిపిస్తుంది, కానీ థ్రిల్ కోల్పోతుంది. మీకు తెలిసిన పరిమితుల నుండి బయటపడండి, బాహ్య ప్రపంచాన్ని కూడా కాస్త అనుభవించండి. మీరు చాలా సంవత్సరాలుగా కలలు కంటున్న మీ జీవితంలో సానుకూల మార్పు తీసుకురావచ్చు. కొత్తదనాన్ని అంగీకరించే కళ మనలో వశ్యత గల నాణ్యతను కూడా పెంపొందిస్తుంది. ఇది జీవితం కొత్త పాఠాలను నేర్చుకోవడాన్ని సులభం చేస్తుంది.

కఠినంగా ఉండకండి.. కాస్త ప్రేమ చూపండి

మనమందరం మన జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చూస్తాము, వాటి వల్ల కచ్చితంగా ప్రభావితమవుతాము. బయటి నుంచి చూస్తే మనిషి లోపల ఏం జరుగుతోందో ఊహించడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరినీ ప్రేమగా కలవండి ఎందుకంటే మీలో ఉండే సానుభూతి గుణం మరొక వ్యక్తి జీవితంలో కొత్త ఆశాకిరణాన్ని తీసుకురాగలదు. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమగా, సామరస్యంగా చూసుకుంటారో అందులో కొంతైనా ఇతరుల మీద చూపించండి. సామరస్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకోండి.

కలిసి నిలబడే వాళ్లని వదలకండి

ఒంటరిగా ఉండి జీవితంలో ముందుకు సాగడం సాధ్యం కాదు. మనం తప్పుడు దిశలో వెళ్తే మనల్ని హెచ్చరిస్తూ ముందుకు సాగేలా ప్రోత్సహించే వ్యక్తులు కావాలి. కాబట్టి అర్థవంతమైన సంబంధాలకు విలువ ఇవ్వండి, మీరు ఎదగాలని నిజంగా కోరుకునే స్నేహితులను గుర్తుంచుకొండి. మంచి సమయాల్లో కలిసి నిలబడే వారు చాలా మంది ఉంటారు, కానీ సంక్షోభ సమయాల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టనివాడే నిజమైన స్నేహితుడు. ఎంత బిజీగా ఉన్నా అలాంటి స్నేహితులను కలవడానికి, మాట్లాడటానికి సమయం కేటాయించండి.

మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవద్దు

జీవితంలో అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం మీరు సరైన స్థానంలో ఉన్నారని నిర్ధారించుకోండి. ఇతరులతో పోటీపడటం లేదా వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానసిక ప్రశాంతతకు భంగం కలిగించడంతో పాటు శ్రమను ఆహ్వానించడం వంటిది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన లక్షణాలతో, వ్యక్తిత్వంతో వేర్వేరు వాతావరణంలో పుడతారు. ఒకే చేతి ఐదు వేళ్లు సమానంగా లేకపోతే ప్రజల జీవితాల్లో సమానత్వం ఎలా ఉంటుంది? మన జీవితాన్ని మరొకరి జీవితంతో పోల్చడం మన ఆత్మవిశ్వాసానికి చాలా హానికరం. కాబట్టి, ఈ పనికిరాని అలవాటును మానుకుంటే మంచిది.

Whats_app_banner