నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల లడ్డు ఇస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి కోవా నువ్వుల లడ్డు చేసి ఇవ్వండి. దీనివల్ల వారికి నువ్వులు శరీరంలో చేరుతాయి. పైగా ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
రోజుకొక కోవా నువ్వుల లడ్డు ఇస్తే వారికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి. ఎందుకంటే ఇందులో మనం బెల్లం, బాదంపప్పు, నువ్వులు వేసి చేస్తాము. ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కోవా - అరకప్పు
బాదం పప్పు - పది
బెల్లం తురుము - అర కప్పు
నువ్వులు అర కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
1. స్టవ్ మీద కళాయి పెట్టి తెల్ల నువ్వులను తీసుకొని వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
2. ఆ నువ్వులను చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి చిన్న మంట పెట్టాలి.
4. అందులో కోవాను వేసి కలుపుకోవాలి. రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు అదే మిశ్రమంలో ముందుగా పొడి చేసిన నువ్వుల మిశ్రమం, బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి.
6. అలాగే బాదంపప్పును కూడా పొడిలాగా చేసి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
7. ఈ మొత్తం మిశ్రమాన్ని దగ్గరగా వచ్చేలా చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
8. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకొని గాలి చొరబడని డబ్బాలో వేసుకోవాలి.
9. ఇవి వారం నుంచి పది రోజులు పాటు తాజాగా ఉంటాయి. కేవలం పిల్లలకు కాదు ఈ లడ్డూలు పెద్దలకు కూడా చాలా నచ్చుతాయి.
ఇందులో ఉన్న నువ్వులు, బెల్లం, బాదంపప్పు, కోవా... ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. దీనిలో మనం పంచదార కానీ మైదా కానీ కలపలేదు. కాబట్టి ఇది ఆరోగ్యకరమైనది. అలాగే నూనెను కూడా వినియోగించలేదు. కాబట్టి పిల్లలకు ఇది మేలు చేస్తుంది. అలాగే పెద్ద వాళ్ళు కూడా రోజుకో లడ్డు తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరంలోకి చేరుతాయి.
ముఖ్యంగా బెల్లం వల్ల ఐరన్ శరీరంలో చేరుతుంది. పిల్లలు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ప్రతిరోజు ఒక లడ్డుని ఇవ్వడం వల్ల వారికి నువ్వుల్లో ఉన్న పోషకాలు, బెల్లంలో ఉన్న ఐరన్, బాదంలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు అందుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ లడ్డూలను చేసేందుకు సిద్ధమైపోండి.
సంబంధిత కథనం