Kothimeera Pulusu: ఘుమఘుమలాడే కొత్తిమీర పులుసును ఇలా చేశారంటే ఎవరికైనా నచ్చేస్తుంది, అన్నం ఇడ్లీ దోసెల్లో తినవచ్చు-kothimeera pulusu recipe in telugu know how to make this rasam ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kothimeera Pulusu: ఘుమఘుమలాడే కొత్తిమీర పులుసును ఇలా చేశారంటే ఎవరికైనా నచ్చేస్తుంది, అన్నం ఇడ్లీ దోసెల్లో తినవచ్చు

Kothimeera Pulusu: ఘుమఘుమలాడే కొత్తిమీర పులుసును ఇలా చేశారంటే ఎవరికైనా నచ్చేస్తుంది, అన్నం ఇడ్లీ దోసెల్లో తినవచ్చు

Haritha Chappa HT Telugu

Kothimeera Pulusu: కొత్తిమీరతో చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము చిక్కటి కొత్తిమీర పులుసు రెసిపీ ఇచ్చాము. ఒక్కసారి తిన్నారంటే ఆ రుచిని మరిచిపోలేరు.

కొత్తిమీర పులుసు రెసిపీ

కొత్తిమీర ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. అందుకే ఇక్కడ మేము కొత్తిమీర రెసిపీని ప్రత్యేకంగా ఇచ్చాము. ఘుమఘుమలాడే ఈ కొత్తిమీర పులుసు ఒక్కసారి తిన్నారంటే మీరు జీవితంలో మర్చిపోలేరు. పదేపదే చేసుకుంటారు. సాధారణ రసం కన్నా ఈ కొత్తిమీర పులుసు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది మరీ నీళ్ళలా కాకుండా కాస్త చిక్కగా ఉంటుంది. కాబట్టి ఇడ్లీ దోశలతో కూడా తినవచ్చు. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు. కొత్తిమీర పులుసులో ఎన్నో ఆరోగ్యకర పోషకాలు కూడా ఉన్నాయి. దీని రెసిపీ చాలా సులువు. ఎలాగో తెలుసుకోండి.

కొత్తిమీర పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు

కొత్తిమీర తరుగు - రెండు కప్పులు

పచ్చిమిర్చి - పదిహేను

మెంతులు - ఒక స్పూను

ఆవాలు - రెండు స్పూన్లు

ఎండుమిర్చి - ఐదు

నూనె - నాలుగు స్పూన్లు

చింతపండు - ఉసిరికాయ సైజులో

నీళ్లు - తగినన్ని

అల్లం పేస్టు - ఒక స్పూను

మినప్పప్పు - అర స్పూను

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

కొత్తిమీర పులుసు రెసిపీ

1. కొత్తిమీర తరుగును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. గుప్పెడు కొత్తిమీరను తీసి వేరేగా ఉంచాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసి అందులో పచ్చిమిర్చిని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

5. తర్వాత కొత్తిమీరను కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు మిక్సీ జార్లో మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా పొడి చేయాలి. ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు అదే మిక్సీలో పచ్చిమిర్చి, కొత్తిమీర వేపుడు వేసి మిక్సీ చేసి ఆ పేస్ట్ ని కూడా పక్కన పెట్టుకోవాలి.

8. స్టవ్ మీద ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.

9. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించాలి.

10. రెండు ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి.

11. అలాగే అల్లం తరుగును కూడా వేసి బాగా వేయించుకోవాలి.

12. ఇవన్నీ వేగాక చింతపండు నువ్వు నానబెట్టి గుజ్జులా తీసి ఆ చిక్కటి నీటిని వేసి బాగా కలుపుకోవాలి.

13. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలపాలి.

14. ఈ మిశ్రమం బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఆవ పొడిని వేసి బాగా కలపాలి.

15. ఆ తర్వాత కొత్తిమీర పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

16. అర గ్లాసు నీటిని వేయాలి. ముందుగా పక్కన పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా వేసి పైన మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించాలి.

17. కనీసం పావుగంటసేపు ఉడికించిన తర్వాత మూత తీస్తే ఘుమఘుమలాడే కొత్తిమీర పులుసు రెడీ అయిపోతుంది.

18. ఇది కొంచెం చిక్కగా ఉంటుంది. అన్నంలో మాత్రం ఎక్కువగానే కలుస్తుంది.

19. ఇలా చేసిన మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి ఈ రెసిపీని వండి చూడండి. ఆరోగ్యం... పైగా ఎంతో రుచి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.

కొత్తిమీర పులుసును తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరంలోకి అందుతాయి. కొత్తిమీర నోటి అల్సర్లు, నోటి దుర్వాసన వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దంతాల, చిగుళ్ల సమస్య నుంచి కాపాడుతుంది. పొట్ట ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్నవారు తరచూ కొత్తిమీరను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా కొత్తిమీర రసాన్ని అప్పుడప్పుడు చేసుకుని చూడండి. మీకు దీని రుచి అద్భుతంగా అనిపిస్తుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం