Egg curry: కొల్హాపురి ఎగ్ కర్రీని ఇలా వండారంటే చపాతీతో అదిరిపోతుంది, రెసిపీ తెలుసుకోండి
Egg curry: లంచ్ కు స్పైసీగా, టేస్టీగా ఏదైనా కర్రీ వండాలనుకుంటున్నారా? ఇక్కడ మేము కొల్హాపురి ఎగ్ కర్రీ రెసిపీ ఇచ్చాము. ఈ రెసిపీ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ కూర వండడం కూడా చాలా సులువు.

లంచ్, డిన్నర్ లో టేస్టీ కూరలు వండుకుని తినడం తెలుగువారికి అలవాటు. మంచి కూర ఉంటేనే అన్నమైనా, చపాతీ అయినా తినాలనిపిస్తుంది. అన్నంలోనూ, చపాతీలోనూ టేస్టీగా ఉండే గుడ్డు కూర రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది కొల్హాపురి ఎగ్ రెసిపీ. కొల్హాపురి ఎగ్ కర్రీ రుచి సాధారణ గుడ్డు కూర కంటే కొంచెం భిన్నంగా, రుచిగా ఉంటుంది. గుడ్లు తినే వారు రోటీ లేదా నాన్ తో తింటే చాలా బావుంటుంది. కొల్హాపురి ఎగ్ కర్రీ రెసిపీ తయారు చేయడం చాలా సులభం. కాబట్టి కొల్హాపురి ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కొల్హాపురి ఎగ్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
నూనె - మూడు స్పూన్లు
పసుపు - పావు స్పూన్
కారం - ఒక స్పూను
ఉడికించిన గుడ్లు - ఆరు
కొబ్బరి తురుము - అర కప్పు
లవంగాలు - ఆరు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
పెద్ద యాలకులు - నాలుగు
నల్ల మిరియాలు - అర స్పూన్
జీలకర్ర - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - అర కప్పు
తెల్ల నువ్వులు - రెండు స్పూన్లు
పచ్చిమిరపకాయలు - రెండు
టొమాటోలు - రెండు
ఉల్లిపాయ - రెండు
కాశ్మీరీ కారం - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొల్హాపురి ఎగ్ కర్రీ రెసిపీ
- ఎగ్ కర్రీ తయారు చేయడానికి ముందుగా గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో పసుపు, కారం వేయాలి.
- కోడిగుడ్లను మూడు నాలుగు కోతలు పెట్టి కళాయిలో వేసి వేయించాలి. తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి కొబ్బరి తురుము, లవంగాలు, దాల్చినచెక్క, పెద్ద యాలకులు, నల్ల మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, నువ్వులు వేసి మీడియం మంటపై 5 నిమిషాలు వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
- మిక్సీ జార్లో వేయించిన అన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు గుడ్డు వేయించిన కళాయిలోనే నూనె వేసి అందులో ఉల్లిపాయ తరుగు వేసి రంగు మారే వరకు వేయించాలి.
- ఇప్పుడులో అందులో టమాటో తరుగును వేసి బాగా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
- ఇవి బాగా వేగాక అందులో మిక్సీ జార్లో రుబ్బిన మసాలా పేస్టును వేసి బాగా కలపాలి.
- పసుపు, కాశ్మీరీ కారం వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి.
- అర గ్లాసు నీళ్లు వేసి కాసేపు ఉడికించాలి. అందులో ముందుగా వేయించుకున్న కోడిగుడ్డులను కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
- అంతే టేస్టీ కొల్హాపురి ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. ఇది అన్నంతో, చపాతీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
కొల్హాపురి ఎగ్ కర్రీ వేడి వేడి అన్నంలో తింటే ఎంతో బావుంటుంది. అలాగే చపాతీలో, రోటీతో తిన్నా కూడా అదిరిపోతుంది. ఒకసారి ఇక్కడ మేము చెప్పిన విధంగా చేసి చూడండి మీకు ఎంతో నచ్చుతుంది.
సంబంధిత కథనం