No White Diet: మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే తెలుపు రంగు ఆహారాలివే..-know what is the list white foods to avoid for good health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No White Diet: మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే తెలుపు రంగు ఆహారాలివే..

No White Diet: మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే తెలుపు రంగు ఆహారాలివే..

Koutik Pranaya Sree HT Telugu
Published Jul 08, 2024 01:30 PM IST

No White Diet: మన ఆహారాన్ని పాడు చేసే ఆహారాలు కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. వేటికి దూరంగా ఉండాలి, వాటికి ప్రత్యామ్నాయాలేంటో వివరంగా తెల్సుకోండి.

నో వైట్ డైట్
నో వైట్ డైట్ (freepik)

నో వైట్ డైట్ గురించి విన్నారా? అంటే తెలుపు రంగులో ఉండే కొన్ని పదార్థాలు మన ఆహారంలో తినకుండా ఉండటం అన్నమాట. దానివల్ల షుగర్ స్థాయులు నియంత్రణలో ఉండటమే కాక, బరువు కూడా పెరగరు. అలాంటి ఆహారాలేంటో, వాటిని ఎందుకు తినకూడదో, వాటికి బదులుగా ఏం తినొచ్చో వివరంగా తెల్సుకుందాం.

1. వైట్ బ్రెడ్:

మైదాతో తయారు చేసే బ్రెడ్ మనకు ఎలాంటి మేలు చేయదు. దాంట్లో ఏ పోషకాలూ ఉండవు. ఉదయం అల్పాహారంగా బ్రెడ్ తీని ఊరుకునే వాళ్లు ఎంతోమంది. ఆకలి కట్టడి చేయడానికి దీన్ని తింటాం కానీ అది మంచిది కాదు. ఎలాంటి పీచు, ప్రొటీన్ లేకుండా ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లను ఒంట్లోకి పంపిస్తున్నాం. ఒకవేళ తినాలనుకుంటే దాంతో పాటూ చేసుకున్న వెజిటేబుల్ స్యాండ్‌విచ్ తింటే కొంతవరకు మేలు. కూరగాయలు ఎక్కువ, బ్రెడ్ తక్కువగా ఉండాలి. అలాగే వోల్ గ్రెయిన్, ఓట్స్ బ్రెడ్ ఎంచుకున్నా కాస్త మంచిదే. అంటే ధాన్యాన్ని పూర్తిగా రిఫైన్ చేయకుండా ఈ బ్రెడ్ తయారు చేస్తారు.

2. వైట్ రైస్:

మనం తినే పాలిష్ చేసిన తెల్లటి సన్నం బియ్యం పూర్తిగా పాలిష్ చేసి తయారు చేసింది. మిల్లింగ్ చేసే సమయంలో మీద ఉండే ఊక మొత్తం తీసేస్తారు. ఇది పూర్తిగా అనారోగ్యకరం కాదు కానీ దీంట్లో పోషకాల కన్నా కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ. పీచు అస్సలే ఉండదు. బదులుగా పాలిష్ చేయని దంపుడు బియ్యం లేదా బ్రౌన్ రైస్ తినడం మేలు. దీంట్లో పీచు, విటమిన్లు ఉంటాయి. లేదంటే తెల్లటి అన్నానికి బదులుగా క్వినోవా, కొర్రల అన్నం, గోధుమ గటిక, జొన్న గటిక.. లాంటివి ఎంచుకోవచ్చు.

3. పంచదార:

పంచదార మితంగా తినడం మేలు. బ్రౌన్ షుగర్, తేనె, మాపుల్ సిరప్ లాంటి తీపి ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా ఎక్కువగా తినకూడదు. వీటిలో కేలరీలు ఎక్కువ. పోషకాలు తక్కువ. ఇవి తిన్న వెంటనే తొందరగా జీర్ణమైపోయి రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెంచేస్తాయి. పంచదార ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడమే కాదు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు తీపి తినాలనిపిస్తే బదులుగా పండు తినండి.

4. ఉప్పు:

తెల్లగా ఉండే టేబుల్ సాల్ట్‌తో పాటే పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, బ్లూ సాల్ట్.. ఇలా చాలా రకాలున్నాయి. కొన్ని ఉప్పుల్లో పోషకాలున్నా ఎక్కువగా తినడం మంచిది కాదు. ఎక్కువ ఉప్పు వల్ల ఒబేసిటీ, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు.. వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బయట దొరకే ప్యాక్ చేసిన చిరుతిండ్లలో కూడా ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికీ దూరంగా ఉండాలి. అందుకే వీలైనంత తక్కువ ఉప్పుతో ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి.

5. బంగాళదుంపలు:

బంగాళదుంపల్లో విటమిన్ సి, పొటాషియం, పీచుతో పాటూ చాలానే పోషకాలుంటాయి. కానీ ఎక్కువగా ఆలూ తినడం మంచిది కాదు. దీంట్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటూ దాంతో చేసే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైలు లాంటివి ఎక్కువ ఉప్పుతో, నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. వాటితో పాటూ రకరకాలు సాస్‌లు, గ్రేవీలు ఇస్తారు. ఇవన్నీ బరువు పెంచేవే. అయితే ఈ బంగాళదుంపల్ని ఎక్కువగా తింటే వాటితో పాటూ మిగతా రంగుల కూరగాయల్నీ తీసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకోకుండా బేక్ లేదా ఉడికించుకుని తినాలి.

తెలుపు రంగు ఆహారం చూస్తే భయపడక్కర్లేదు కానీ.. అవి తింటున్నప్పుడు వాటితో పాటూ సమాన భాగంలో కూరగాయలు, పండ్లు లాంటి పోషకాలున్న ఆహారాలూ తీసుకోవాలి. మితంగా తినాలి.

Whats_app_banner