Pregnancy in pregnancy: గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే మరోసారి ప్రెగ్నెన్సీ వస్తుందా? ఇలా సాధ్యమే..
Pregnancy in pregnancy: గర్భం ధరించిన మహిళ మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడం వింతగా అనిపిస్తుంది కదూ. కానీ ఇది సాధ్యమే. శిశువులు కొన్ని వారాల వయసు తేడాతో సూపర్ ఫెటేషన్ అనే అరుదైన సంఘటన వల్ల జన్మిస్తారు. అదెలా సాధ్యమో, ఎవరిలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కడుంటాయో వివరంగా తెల్సుకోండి.
ఒక మహిళకు ప్రసవం అయ్యింది.. కవలలు పుట్టారు.. ఒక శిశువు వయసేమో 36 వారాలు. మరో శిశువు వయసు 34 వారాలు. అదెలా సాధ్యం అంటారా? కవలలంటే ఒకే వయసులో ఉంటారు కానీ ఇదెలా సాధ్యం అనిపిస్తుందా? సూపర్ ఫెటేషన్ అనే అరుదైన సంఘటన ద్వారా ఇది జరగొచ్చు. అంటే మహిళ గర్భం ధరించాక కొన్ని రోజుల వ్యవధిలో మరో పిండం కూడా నిలుస్తుంది. అంటే ప్రెగ్నెన్సీలోనే మరోసారి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదెలా సాధ్యమో చూద్దాం.
సూపర్ ఫెటేషన్:
సూపర్ ఫెటేషన్ అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. సాధారణంగా శుక్రకణంతో అండం ఫలదీకరణ చెందాక గర్భాశయంలో పిండం నిలుస్తుంది. అలా నిలిచిన కొన్ని వారాల తర్వాత మరో శుక్రకణంతో మరో అండం కూడా ఫలదీకరణ చెంది గర్భాశయంలోకి చేరుతుంది. ఇలా పుట్టిన పిల్లల్ని కవలపిల్లల్లాగే పరిగణిస్తారు. కానీ వాళ్ల వయసులో తేడా ఉంటుంది. సాధారణంగా మొదటిసారి గర్భం ధరించిన వెంటనే మహిళల శరీరంలో అండం విడుదల అవ్వదు. చాలా అరుదైన సందర్భాల్లో అండం విడుదల జరగొచ్చు.
ఇది మనుషుల్లోనూ జరిగే అవకాశం ఉన్నా కూడా కొన్ని రకాలు చేపలు, కుందేళ్ల జాతుల్లో ఎక్కువగా జరుగుతుంది. మనుషుల్లో ఇలా జరిగే సంఘటనలు చాలా తక్కువ. ఒకవేళ మహిళ గర్భదారణ కోసం ఐవీఎఫ్ లాంటి చికిత్స తీసుకుంటే ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
కవలలకు, సూపర్ ఫెటేషన్ మధ్య తేడా?
కవలలు పుట్టాలంటే రెండు అండాలు ఒకేసారి ఫలదీకరణం చెందుతాయి. కవలల వయసు సమానంగా ఉంటుంది. అదే సూపర్ ఫెటేషన్‌లో పుట్టే శిశువుల వయసులో వారాల కొద్దీ తేడా ఉండొచ్చు. ఇద్దరి ఎదుగుదల కవలల్లాగా ఒకేలా ఉండదు.
డెలివరీ ఎలా అవుతుంది?
సూపర్ ఫెటేషన్‌లో అత్యంత ప్రమాదకరమైన విషయం శిశువుల వయసులో వ్యత్యాసం. అంటే ఒక పిండం పూర్తిగా ఎదిగి, నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉంటే, మరో పిండం పూర్తిగా ఎదగదు. దాంతో ఆ మహిళ ఒక శిశువును నెలలు నిండకముందే ప్రసవిస్తారు. అలా నెలలు నిండకుండా పుట్టిన శిశువు బరువు ఎక్కువగా ఉండరు. శ్వాసలో ఇబ్బంది, కదలికల్లో తేడాలు, పాలు తాగడం కష్టంగా ఉండటం, మెదడులో సమస్యలు లాంటివి కనిపిస్తాయి. అలాగే కేవలం సిజేరియన్ సెక్షన్ ద్వారానే ప్రసవం చేయాల్సి రావచ్చు.
సూపర్ ఫెటేషన్ అవకాశాలు:
ఇప్పటికి ఈ అరుదైన సంఘటన నమోదైన కేసులు ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యల్లోనే ఉంటాయి. ముఖ్యంగా గర్భదారణ కోసం చికిత్స తీసుకుంటున్న మహిళల్లో ఈ అవకాశం ఎక్కువ.
ఐవీఎఫ్ చికిత్స తీసుకునే మహిళల గర్భాశయంలోకి ఫలదీకరణం చెందిన అండాన్ని ప్రవేశ పెడతారు. అయితే దానికన్నా ముందే మహిళలో అండం విడుదలై, శరీరంలోకి ఐవీఎఫ్ ద్వారా ఫలదీకరించిన అండం ప్రవేశ పెట్టాక శరీరంలో ఉన్న అండం ఫలదీకరణం చెందితే ఈ అరుదైన సంఘటన జరగొచ్చు. మామూలు ప్రెగ్నెన్సీ లాగానే దీని సంకేతాలు ఉంటాయి. వైద్యులు స్కానింగ్ చేసి మాత్రమే దీన్ని గుర్తించగలుగుతారు.
టాపిక్