Scrunchie benefits: స్క్రంచీలు ఎందుకు వాడాలి? ఎందుకింత ట్రెండ్ అవుతున్నాయి?-know what is scrunchie its latest trends and benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Scrunchie Benefits: స్క్రంచీలు ఎందుకు వాడాలి? ఎందుకింత ట్రెండ్ అవుతున్నాయి?

Scrunchie benefits: స్క్రంచీలు ఎందుకు వాడాలి? ఎందుకింత ట్రెండ్ అవుతున్నాయి?

Koutik Pranaya Sree HT Telugu
Jun 29, 2024 12:15 PM IST

Scrunchie benefits: రబ్బర్ బ్యాండ్ బదులు స్క్రంచీలు వాడటం ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. దీని వల్ల బోలెడు లాభాలున్నాయి. అవేంటో చూడండి.

స్క్రంచీలు
స్క్రంచీలు

ముందు నా చేతి మణికట్టుకున్న నలుపు రంగు స్క్రంచీ తీసి దాంతో నా జుట్టుకు పోనిటెయిల్ వేసుకుని ఈ ఆర్టికల్ రాయడం మొదలుపెడతా. ఒక స్క్రంచీని ఎన్ని రోజులయినా వాడతాం. చెప్పాలంటే అది పాతబడే దాకా దాన్ని పడేయాలంటే మనసు రాదు. ప్రతి ఒక్కరికి ఇష్టమైన స్క్రంచీ ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని సాగిపోయేదాకా వాడతారనడం అబద్దం కాదు.

స్క్రంచీ ఎలా తయారు చేశారు?

జుట్టు కోసం ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ మాత్రమే వాడేవారు. ఎలాస్టిక్ ప్యాంట్లకు నడుము దగ్గర ఉండే ఎలాస్టిక్‌ను చూసి తయారు చేశారట. లోపల ఎలాస్టిక్ బ్యాండ్ పెట్టి చుట్టూ వస్త్రంతో కుట్టి స్క్రంచీలు తయారు చేశారు. ఇవి ముడతగా ఉండడంతో ఆంగ్లంలో అదే అర్థం వచ్చే స్క్రంచీ అని పేరు పెట్టారు. అయితే దీన్ని తయారు చేసిన ఆవిడ పెంపుడు జంతువు పేరు స్కంచీ అని దీనికి పెట్టారట. అదే క్రమంగా అర్థవంతంగా ఉండాలని స్క్రంచీగా మారింది.

స్క్రంచీ ఎందుకు ట్రెండ్ అవుతోంది?

చిన్న వయసులో ఉన్నప్పుడు మనం కుట్టడానికి ఇచ్చిన డ్రెస్సులో నుంచి కొంచెం గుడ్డ తీసుకుని మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ కుట్టిచ్చే వాళ్లు. అలాంటివే ఈ స్క్రంచీలు. మనకు కావాల్సినన్ని రంగుల్లో దొరుకుతాయివి. ఆన్‌లైన్ లో మన డ్రెస్సు రంగు, డిజైన్ బట్టి స్క్రంచీని కస్టమైజ్ చేసిచ్చే సైట్లు కూడా ఉన్నాయి. అంత డిమాండ్ ఉంది వీటికి. వీటిని ఎక్కువగా వెల్వెట్, సిల్క్, శాటిన్ వస్త్రాలతో చేస్తారు. చాలా మెత్తగా, మృదువుగా ఉంటాయి.

జుట్టు తెగిపోదు:

మామూలు ఎలాస్టిక్ బ్యాండ్ పెట్టుకుని తీసేటప్పుడు దానికి కొన్ని వెంట్రుకలు చుట్టుకుని ఉండటం, దాంతో పాటే రబ్బర్ బ్యాండ్ లాగేటప్పుడు కొన్ని వెంట్రుకలు ఊడి రావడం గమనిస్తాం. స్క్రంచీతో ఆ ఇబ్బంది ఏమాత్రం ఉండదు. జుట్టుకు ఏ హానీ చేయవివి. దీన్ని వస్త్రంతో తయారు చేయడమే దానికి కారణం. అలాగే మామూలు ఎలాస్టిక్ బ్యాండ్ వాడినప్పుడు మనకు తెలీకుండానే చాలా బిగుతుగా పోనీటెయిల్ లాంటివి వేస్తాం. దాంతో జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. స్క్రంచీతో అలా సాధ్యం కాదు. ఇవి జుట్టును సరిగ్గా పట్టి ఉంచుతాయి కానీ ఒత్తిడి పడనీయవు.

ఎలాంటి స్క్రంచీలు ట్రెండింగ్?

మనలో చాలా మంది మొదటి స్క్రంచీ నలుపు, సిల్వర్ లేదా పోల్కా డాట్ ఉన్నవి ఎంచుకుని ఉంటాం. వీటిలో మెటాలిక్ లుక్‌లో ఉండే స్క్రంచీలు చాలా బాగుంటాయి. ఇవే ట్రెండింగ్ కూడా. అలాగే రోజూవారీ వాడకం కోసం సిల్క్ లేదా వెల్వెట్ తో చేసినవి ఎంచుకోవచ్చు. దీంతో పాటే రియల్ హెయిర్ స్క్రంచీలు దొరుకుతున్నాయి. అంటే దాన్ని పెట్టుకుంటే జుట్టులో కలిసిపోతుంది. సిగ లాంటివి వేసుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా ఈ రియల్ హెయిర్ స్క్రంచీలు వాడొచ్చు.

వీటితో పాటే బో ఉండే స్క్రంచీలు ప్రత్యేకమే. అంటే రబ్బర్ బ్యాండ్‌కు కింద రెండు రిబ్బన్లు వేళాడుతూ ఉంటాయి. ఇవి వెస్టర్న్ డ్రెస్సుల మీదకి చక్కగా నప్పేస్తాయి.

మల్టీ పర్పస్ స్క్రంచీలు:

కాస్త ఓవర్ సైజ్ స్క్రంచీలు కూడా వాడేస్తున్నారు. చాలా పెద్దగా ఉంటాయివి. వీటికే లోపలి వైపు జిప్ ఉంటుంది. అంటే పర్సులాగా వాడేయొచ్చన్నమాట. ప్రయాణాల్లో, బీచ్ దగ్గర ఈ స్క్రంచీలో చిన్న వస్తువులేమైనా పెట్టుకోవచ్చు.

జుట్టుకే కాదు:

స్క్రంచీలను జుట్టుకు పెట్టుకోవడం కన్నా చాలా మంది చేయికి పెట్టుకుని ఉండటం చూసే ఉంటారు. అది ఒకలాంటి యాక్సెసరీ అయిపోయింది. అందుకేనేమో స్క్రంచీ వాచీలు తీసుకొచ్చారు. వాచీని రబ్బర్ బ్యాండ్ లాగా వేసేసుకోవడమే. వీటిలో స్మార్ట్ వాచీలు వచ్చాయంటే దానికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.

స్క్రంచీ ఖరీదు ఎంత?

గరిష్టంగా 100 లేదా 150 రూపాయలు. చాలా బ్రాండ్లలో 500 రూపాయలకు మూడు లేదా ఐదు స్క్రాంచీల ప్యాక్ లభిస్తుంది. హై బడ్జెట్ ప్యూర్ సిల్క్ స్క్రంచీలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి ధర కాస్త ఎక్కువే.

ఇంకేం.. మీరు ఇప్పటికే స్క్రంచీలు వాడితే ఓకే. లేదంటే తప్పకుండా ఒకట్రెండు తెచ్చుకుని వాడటం మొదలుపెట్టండి. ఇక వేరే రబ్బర్ బ్యాండ్లు పెట్టుకోమన్నా పెట్టుకోరు. అంతగా వాటికి అలవాటు పడిపోతారంటే నమ్మండీ…

 

Whats_app_banner