Retinal Vein Occlusion । కళ్లు చీకట్లు కమ్ముకుంటున్నాయా? కారణం ఇదే!
Retinal Vein Occlusion: రెటీనా వెయిన్ అక్లూజన్ (RVO) అనేది కంటికి సంబంధించిన ఒక వైద్య పరిస్థితి. దీనివల్ల మీ కంటిచూపుపై ప్రభావం పడుతుంది. కారణాలు ఈ కింద చూడండి.
Retinal Vein Occlusion: రెటీనా అనేది మీ కంటి వెనుక భాగంలో ఉండే ఒక కణజాల పొర, ఇది మీరు కంటితో చూడగలిగే దృశ్యాలకు కాంతిని అనువదింపజేసి, ఆ దృశ్యం మీకు కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. ఈ రెటీనాలో ఏదైనా సమస్య ఏర్పడితే మీ దృష్టి మందగించడం, వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం, కళ్లు చీకటిగా మారడం, ఇతర దృష్టిలోపాలు ఏర్పడతాయి.
రెటీనా వెయిన్ అక్లూజన్ (RVO) అనేది కంటికి సంబంధించిన ఒక వైద్య పరిస్థితి. మీ రెటీనాకు రక్తాన్ని రవాణా జరిగే సిరలో పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డంకి ఏర్పడినపుడు రెటీనా వెయిన్ అక్లూజన్ వ్యాధిగా నిర్ధారిస్తారు. దీనివల్ల మీ కంటిచూపుపై ప్రభావం పడుతుంది. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో 2 శాతం మందిని ఈ కంటి వ్యాధి ప్రభావితం చేస్తుంది. 50 లేదా 60 ఏళ్లలోపు వ్యక్తులను ఈ RVO మరింత ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని కూడా ఈ రెటీనా కంటి వ్యాధి ప్రభావితం చేస్తుంది. దానికి వారి అనారోగ్య పరిస్థితులు కారణం కావచ్చు, కొన్ని కారణాలు ఈ కింద చూడండి.
- అథెరోస్ల్కెరోసిస్
- మధుమేహం
- గ్లాకోమా
- అధిక రక్త పోటు
- ఊబకాయం
- ఒక కంటిలో రెటీనా సిర మూసుకుపోవడం
పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 40 ఏళ్ల లోపు వారికి కూడా ఈ రెటీనా వెయిన్ అక్లూజన్ కంటి వ్యాధి రావడానికి అవకాశం ఉంది.
రెటీనా వెయిన్ అక్లూజన్ లక్షణాలు
దృష్టి తగ్గడం, రంగులు తక్కువగా కనిపించడం, కళ్ళు బయర్లు కమ్మినట్లుగా, కంటిలో ఏవో మచ్చలు కనిపిస్తున్నట్లుగా ఉండే లక్షణాలు ఉంటాయి.
- అస్పష్టమైన దృష్టి లేదా దృష్టి నష్టం: ఇది అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది లేదా కొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలో క్రమంగా అభివృద్ధి చెందుతుంది.
- ఫ్లోటర్స్: ఇవి మీ దృష్టిలో చీకటి మచ్చలు లేదా గీతలు.
- మీ కంటిలో నొప్పి లేదా ఒత్తిడి: సాధారణంగా వ్యాధి మరింత తీవ్రమైన సందర్భాల్లో ఉంటుంది.
రెటీనా వెయిన్ అక్లూజన్ చికిత్స
కంటి వైద్య నిపుణుడు మీ RVO మూల కారణాన్ని పరీక్షించి చికిత్సను అందిస్తారు. ఇందుకోసం కంటి పరీక్షలతో పాటు మీ కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తంలో చక్కెర స్థాయిలు, మొదలైనవి చెక్ చేయడానికి మీకు రక్త పరీక్షలు సూచించవచ్చు. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తకుండా ప్రమాదాన్ని తగ్గించడానికి ఇంజక్షన్ థెరపీ, ఔషధాలు, కంటి చుక్కలు సిఫారసు చేయవచ్చు.
సంబంధిత కథనం