Black alkaline water: బ్లాక్ వాటర్ ఎవరైనా తాగొచ్చా? తాగితే లాభనష్టాలేంటి?
Black alkaline water: బ్లాక్ ఆల్కలైన్ వాటర్ గురించి చాలా సార్లు వింటాం కానీ వాటి గురించి ఉపయోగాలు పూర్తిగా తెల్సుకోం. ఈ నీళ్లకు సంబంధించిన లాభాలు, మరికొన్ని విషయాలు తెల్సుకోండి.

సెలెబ్రిటీలు వాడటం వల్ల బ్లాక్ ఆల్కలైన్ వాటర్ మీద అందరి దృష్టి పడింది. మామూలు నీళ్లకన్నా ఎక్కువ లాభాల నిచ్చే క్షార గుణం ఉన్న నీళ్లు. ఈ నీళ్లు మంచినీళ్ల కన్నా ఎక్కువ పీహెచ్ స్థాయులు కలిగి ఉంటాయి. శరీరానికి కావాల్సిన నీళ్లు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగ్గా ఉంటుంది, ఒంట్లో మళినాలు బయటకు నెట్టివేయబడతాయి.. ఇలా చాలా లాభాలుంటాయి. మరి మంచి నీళ్లకు బదులుగా ఈ బ్లాక్ వాటర్ తాగొచ్చా? దీనివల్ల లాభాలేంటో తెల్సుకోండి.
బ్లాక్ ఆల్కలైన్ వాటర్ అంటే ఏమిటి?
చూడ్డానికి నలుపు రంగులో ఉంటాయీ నీళ్లు. పేరులో బ్లాక్ అనే పదం ఉంది కదానీ మురికి నీళ్లు, కలుషితం అయిన నీళ్లు అనుకోవద్దు. మంచినీళ్ల పీహెచ్ 7 ఉంటుంది. ఈ బ్లాక్ వాటర్ పీహెచ్ 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. అంటే మామూలు నీళ్లకన్నా క్షార గుణం ఎక్కువ. అందుకే ఆల్కలైన్ వాటర్ అంటారు. ఈ నీళ్లలో లవణాలు, పొటాషియం, క్యాల్షియం, విటమిన్లుంటాయి. ఫుల్విక్ యాసిడ్, హ్యూమిక్ మినరళ్లుంటాయి. అందుకే నీళ్లకు కాస్త నలుపుదనం వస్తుంది.
బ్లాక్ ఆల్కలైన్ వాటర్ వల్ల లాభాలు:
1. హైడ్రేషన్:
దీంట్లో ఎలక్ట్రోలైట్లు, మినరళ్లుంటాయి. సాధారణ నీళ్లకన్నా శరీరం ఎక్కువసేపు హైడ్రెటెడ్ గా ఉండేలా ఇవి సాయపడతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్ రివ్యూస్‌లో ప్రచురించిన 2022 అధ్యయనం ప్రకారం, మొత్తం ఆరోగ్యం, శారీరక పనితీరుకు కావాల్సిన ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి ఎలక్ట్రోలైట్‌లు సహాయపడతాయి.
2. పోషకాలు గ్రహించడం:
ఈ నీటిలో ఉండే ఫుల్విక్ మినరళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం ఎక్కువ పోషకాలను శోషించుకునేలా చేస్తాయి. కణాలకు కావాల్సిన పోషకాలను సరఫరా చేయడంలో ఫుల్విక్ యాసిడ్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి.
3. జీర్ణశక్తి:
నీళ్లకుండే క్షారగుణం, ఫుల్విక్ మినరళ్ల వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. దానివల్ల ఉదర సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.
4. శక్తినిస్తాయి:
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటే పోషకాలు ఎక్కువ శోషించుకునేలా చేస్తుంది. దాంతో శరీరానికి కొత్త శక్తి వస్తుంది. ఈ నీళ్లు తాగిన వాళ్లు రోజంతా చలాకీగా, హుషారుగా, కొత్త శక్తితో ఉండగలుగుతున్నామని చెబుతున్నారట.
5. ఎముకల ఆరోగ్యం:
శరీరంలో పీహెచ్ స్థాయులు నిలకడగా ఉంచడంతో పాటూ, ఈ ఆల్కలైన్ వాటర్.. ఎముకలు క్యాల్షియం కోల్పోకుండా కాపాడతాయి.
బ్లాక్ ఆల్కలైన్ వాటర్ తాగడం ఎలా మొదలుపెట్టాలి?
- ముందుగా రోజుకు ఒక్కసారి మీరు తాగే సాధారణ నీళ్లకు బదులు బ్లాక్ ఆల్కలైన్ వాటర్ తాగాలి. క్రమంగా ఈ పరిమాణం పెంచుతూ పోవాలి. కానీ కొన్ని వారాలు మీ శరీరంలో వస్తున్న మార్పులు గమనించుకోవాలి. జీర్ణశక్తి, శక్తి స్థాయులు, ఆరోగ్యంలో మార్పులొస్తే గమనించాలి.
- భోజనం తర్వాత బ్లాక్ వాటర్ తీసుకోవచ్చు. ఇది శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది.
- వ్యాయామాలు, కసరత్తులు చేసిన తర్వాత , చేసే ముందు ఈ నీళ్లు తాగచ్చు. శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి ఇస్తుంది.
- స్మూతీలు, జ్యూసులు చేసేటప్పుడు ఈ బ్లాక్ వాటర్ వాడుకోవచ్చు. సూప్స్, కూరగాయలు ఉడికించడానికి కూడా ఈ నీళ్లు వాడి పోషకాలు పెంచుకోవచ్చు.
సైడ్ ఎఫెక్ట్స్:
ఆల్కలైన్ లక్షణం ఉన్న ఈ నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల ఆల్కలోసిస్ రావచ్చు. అంటే శరీరం పీహెచ్ పెరిగిపోతుంది. తలతిరగడం, వాంతులు అవ్వచ్చు. ఎక్కువగా ఈ నీళ్లు తాగితే కొన్ని రకాల మినరళ్లు శరీరంలో పెరిగిపోతాయి. ఇవి అసమతుల్యతను సృష్టిస్తాయి. అలాగే ఏవైనా మందులు వాడుతున్నా కూడా వైద్యులను సంప్రదించి మాత్రమే ఈ ఆల్కలైన్ వాటర్ తాగాలి.