పౌడర్ అంటే ఏముంది.. చేతిలో కొంచెం పౌడర్ వేసుకుని, ముఖానికి పూసుకుని, మిగతాది చేతులు దులిపేస్తే పోతుంది. అలా ఇదివరకటిలా కాదిప్పుడు. అవసరాన్ని బట్టి బోలెడు రకాల పౌడర్లు వచ్చేశాయి. దానికి తగ్గట్లు వాడితే కొన్నిసార్లు మేకప్ అక్కర్లేదు కూడా. కొన్నేమో ఫొటోల్లో మెరిసేలా చేస్తే, మరికొన్ని చర్మాన్ని మచ్చల్లేకుండా కనిపించేలా చేస్తాయి. ఆ రకాలేంటో, వాటి ఉపయోగాలేంటో చూసేయండి.
అందరూ డబ్బా దులిపి వాడేది దాదాపు లూజ్ పౌడరే. ముఖం మీద జిడ్డు మెరవకుండా ఉండటానికి పౌడర్ ఉపయోగపడుతుంది. కానీ ఇది కాస్త పొడిబారే చర్మ తత్వం ఉన్నవాళ్లకి, కాంబినేషన్ చర్మం ఉన్నవాళ్లకి మాత్రమే ఎక్కువగా నప్పుతుంది. మేకప్ పూర్తయ్యాక కూడా కొద్దిగా లూజ్ పౌడర్ తీసుకుని నుదురు, ముక్కు భాగాల్లో రాసుకుంటే మేకప్ సెట్ అయిపోతుంది.
రెండు మూడు రకాలుగా ఈ ప్రెస్డ్ పౌడర్ వాడొచ్చు. ప్రైమర్, ఫౌండేషన్ రాసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్ మేకప్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే ప్రెస్డ్ పౌడర్ వాడొచ్చు. మిగతా ఐ, లిప్ మేకప్‌కి ఇది బేస్ మేకప్ లాగా ఉంటుంది. కాకపోతే ఫౌండేషన్ వాడినంత ఎక్కువ కవరేజీ దీనివల్ల రాదు. మేకప్ వేసుకున్నాక ఈ పౌడర్ అద్దితే మేకప్ ఎక్కువ సేపు చెక్కు చెదరకుండా ఉంటుంది.
ఇది మేకప్ మెరవకుండా మంచి మ్యాటె ఫినిషింగ్ ఇస్తుంది. దీంట్లో లైట్, మీడియం, డార్క్ అని మూడు రకాలుంటాయి. మీ చర్మం రంగు ఆధారంగా ఈ పౌడర్ ఎంచుకోవాలి. మేకప్ వేసుకున్నాక చివరగా బ్రష్‌తో ఈ పౌడర్ రాసుకుంటే మీ చర్మం రంగులో కలిసిపోయి మంచి ఫినిషింగ్ వస్తుంది. మేకప్ ఎబ్బెట్టుగా అనిపించదు.
పేరు చెబుతున్నట్లుగానే ఈ పౌడర్లో జింక్ ఆక్సైడ్, టైటానియం డై ఆక్సైడ్ లాంటి మినరళ్లుంటాయి. ఇవి చర్మాన్ని సూర్యరశ్మి ప్రభావం నుంచి కాపాడతాయి. మేకప్ ఉత్పత్తులు అందరికీ నప్పవు. కానీ ఈ పౌడర్‌లో ఉన్న గుణాల వల్ల అన్ని చర్మ తత్వాలకు చక్కగా నప్పేస్తుంది. దీన్ని నేరుగా వేసుకోవచ్చు. లేదంటే మేకప్ పూర్తయ్యాక సెట్టింగ్ పౌడర్ లాగా వాడితే మేకప్ చాలా సహజంగా కనిపిస్తుంది.
హెచ్‌డి ఫోటో ఎంత స్పష్టంగా ఉంటుందో.. ఈ పౌడర్ వల్ల మనం వేసుకున్న మేకప్‌కి కూడా అలాంటి హెచ్.డి ఫినిషింగ్ వస్తుంది. సహజంగా, మృదువుగా చర్మం కనిపించేలా ఈ పౌడర్ వాడతారు. ఎంత పెద్ద కెమెరాలోనైనా చర్మం మీదున్న రంధ్రాలు, మచ్చలు కనిపించకుండా ఈ పౌడర్ వాడతారు. ఎక్కువగా కెమెరా ముందు ఉండాల్సి వస్తే ఈ పౌడర్ ఎంచుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్లకు ఈ పౌడర్ వాడటం వల్ల ఫొటోల్లో మెరిసిపోవచ్చు.
అరటిపండు ఉన్నట్లే కాస్త పసుపు పచ్చని రంగులో ఉంటుంది కాబట్టి దీన్న బనానా పౌడర్ అంటారు. బుగ్గలు, గడ్డం భాగం, నుదురు దగ్గర కొంతమందికి చర్మం చాలా ఎరుపెక్కి ఉంటుంది. అలాంటి చోట్ల ఈ బనానా పౌడర్ వాడితే మంచి ఫినిషింగ్ వస్తుంది. మేకప్ పూర్తయ్యాక కాస్త ఈ పౌడర్ అద్దుకుంటే సహజమైన ఫినిషింగ్ వస్తుంది.