Stress relief toys: పని మధ్యలో ఒత్తిడి, నిద్రా? మీ డెస్క్ మీద ఈ బొమ్మల్ని పెట్టుకోండి.. చాలా రిలీఫ్..
Stress relief toys: పని ఒత్తిడి నుంచి మిమ్మల్ని బయటపడేసేందుకు కొన్ని బొమ్మలున్నాయి. వాటిని మీ డెస్క్ మీద పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా చురుగ్గా కూడా ఉంటారు. అవేంటో చూడండి.
రోజంతా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పనిచేయడమంటే శారీరక శ్రమ తక్కువగా కనిపించినా బోలెడంత మానసిక శ్రమ ఉంటుంది. ఒత్తిడిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్ర వస్తుంది. మీ ఒత్తిడిని తగ్గించాలంటే, మెదడు చురుగ్గా మారాలంటే మీరు పని చేసే డెస్క్ మీద కొన్ని ఒత్తిడి తగ్గించే బొమ్మలుండాల్సిందే. వీటికి వయసుతో సంబంధం లేదు. ఒత్తిడిని తగ్గించేందుకే వీటిని తయారు చేస్తారు. వాటి లిస్టు ఒకసారి చూసి, మీకు నచ్చితే మీరూ ఒకటి మీ డెస్క్ మీద పెట్టుకోండి. పని పూర్తి అవ్వట్లేదనే ఒత్తిడి అంటుంటే.. ఈ బొమ్మలతో ఎప్పుడు ఆడతాం అనుకుంటున్నారా? మీ పని మధ్యలో కాసేపు వీటితో గడిపినా మరింత వేగంగా పని పూర్తి చేయగలుగుతారు. మనసు ప్రశాంతంగా అవుతుంది.

1. డెస్క్‌టాప్ పంచింగ్ బాల్:
ఒక్కోసారి పని ఒత్తిడి వల్ల పని మీదో, ఎవరైనా వ్యక్తి మీదో విపరీతమైన కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు మీ కోపం తగ్గించుకోవాలి అనుకుంటే ఈ డెస్క్ టాప్ పంచింగ్ బాల్ వాడొచ్చు. దీనికి ఒక బేస్ ఉంటుంది. మీద స్ప్రింగ్ సాయంతో ఒక పంచింగ్ బాల్ అమర్చి ఉంటుంది. మనం ఆ బాల్ ని కొడితే స్ప్రింగ్ సాయంతో మనవైపే వస్తుంది. మీకున్న కోపాన్నంతా కూడగట్టుకుని మీ పిడికిలితో ఆ బాల్‌ను ఒక్క గుద్దు గుద్దితే చాలు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందట. ట్రై చేయండి. నిద్ర కూడా వదులుతుంది.
2. బీచ్ స్యాండ్ బాక్స్:
చిన్న సైజు బీచ్ సెటప్ డెస్క్‌టాప్ మీద చేసుకోవడం అన్నమాట. దీంట్లో చిన్న బకెట్, కుర్చీ, తెల్లగా మెరిసే ఇసుక, దాన్ని ఒక్కదగ్గర చేర్చడానికి పార లాంటి పరికరం.. ఇలా చాలా ఒక ఫ్రేములో పెట్టి ఉంటాయి. దీన్ని టేబుల్ మీద పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా అనిపిస్తుందట. పని మధ్యలో అప్పుడప్పుడు ఇసుకను బకెట్లలో నింపడం, మళ్లీ సర్దడం.. ఇలా చాలా రకాలుగా దీంతో ఆడుకోవచ్చు. దాంతో పని ఒత్తిడి తగ్గినట్లు అనిపస్తుందట.
3. మినీ బాస్కెట్ బాల్:
మీ వర్క్ డెస్క్ మీద ఇది పెట్టుకుంటే మధ్యమధ్యలో ఈ మినీ బాస్కెట్ బాల్ సెటప్‌తో ఆడుకోవచ్చు. బాల్ ను గురిచూసి కొట్టి ముందున్న నెట్‌లో వేసేయాలి. అలా ప్రయత్నిస్తూ ఉంటే కాస్త విరామం తీసుకున్నట్లు అనిపిస్తుందట. మీకూ ఆటలంటే ఇష్టముంటే ఒకసారి ట్రై చేయండి.
4. వుడెన్ మేజ్ టాయ్ (Labyrinth wooden maze):
డెస్క్ మీద చిన్న మూలన దీన్ని పెట్టేయొచ్చు. దీన్ని మనం చిన్నప్పుడు చాలానే ఆడి ఉంటాం కానీ ఇప్పుడు మర్చిపోయాం. దీంతో చాలా లాభాలుంటాయి. ఈ ఆట వల్ల మన ఎడమవైపు మెదడు పనిచేసి తెలివితేటలు పెరుగుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు చురుకవుతుంది. చెక్కమీద చెక్కిన లైన్ల మధ్యలో నుంచి నాలుగైదు స్టీల్ బాల్స్ కదిలిస్తూ మధ్యలోకి చేర్చాలి. దానికోసం ఏకాగ్రత అవసరం.
5. మ్యాగ్నెటిక్ బిల్డింగ్ బ్లాక్స్ (Magnetic building blocks):
మ్యాగ్నెటిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే.. చిన్న చిన్న స్టీల్ రంగులో మెరిసే బాల్స్ ఉంటాయి. వాటితో రకరకాల ఆకారాలు తయారు చేసుకోవచ్చు. వరుసల్లో ఉండే వీటిని ఒకదాని మీద ఒకటి అంటిస్తూ మనకిష్టమైన ఆకారాలు తయారు చేయొచ్చు. చూడ్డానికి, చేయడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. వీటిని చేస్తున్నప్పుడు అయస్కాంతాలు ఒకదాంతో ఒకటి అంటుకున్నట్లు వచ్చే సన్నని శబ్దాల వల్ల, వాటి అతుక్కునే విధానం వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ ఒత్తిడి తగ్గుతుంది.