Signs Of Poor Nutrition: తరచూ ఆవలింత, తిమ్మిర్లు వస్తే నిర్లక్ష్యం చేయద్దు.. ఈ లోపాలే కారణం..
Signs Of Poor Nutrition: శరీరంలో ఇలాంటి సమస్యలు, నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకండి. చాలాసార్లు శరీరంలో పోషకాలు లోపించడం వల్ల ఈ సంకేతాలు కనిపిస్తాయి.
మన శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం. వాటిలో ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు, శరీరం వెంటనే స్పందిస్తుంది. కానీ చాలాసార్లు మనం శరీరం యొక్క ఈ ప్రతిచర్యలను అర్థం చేసుకోవడంలో తప్పు, ఆలస్యం చేస్తాము. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాహారం అందక రోగాలు మొదలవుతాయి. మీరు తరచూ ఆవలింతలు వేస్తే లేదా ఎప్పుడూ చల్లగా , తిమ్మిర్లు వచ్చినట్లు అనిపిస్తే.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండి. అవి ఏ సమస్యలకు సంకేతాలో తెల్సుకోండి.

తరచూ ఆవలింత రావడం:
నిద్ర లేకపోవడం వల్ల, నిద్ర బాగా వస్తున్నా ఆవలింతలు వస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కాస్త నీరసంగా అనిపిస్తే రోజంతానూ ఆవలింతలు వస్తూ ఉంటాయి. కానీ ప్రతిరోజూ చాలా అలసటగా, బలహీనంగా అనిపిస్తున్నా.. ఎప్పుడూ ఆవలింతలు తీస్తున్నా శరీరంలో ఇనుము లోపానికి ఇవి సంకేతాలు కావచ్చు.
నొప్పులు:
చేతులు, కాళ్ల కండరాల్లో ఎప్పుడూ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం పనికిరాదు. చిన్న పనిచేసినా కూడా వెంటనే నొప్పిగా అనిపిస్తే అది మెగ్నీషియం లోపాన్ని సూచిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో తరచూ దీర్ఘకాలిక నొప్పి వస్తుంది. కండరాలు నొప్పిగా అనిపిస్తాయి.
చేతులు , కాళ్ళలో జలదరింపు:
కాళ్లు, చేతుల్లో జలదరింపు లాగా లేదంటే తిమ్మిర్ల లాగా తరచూ వస్తుంటాయి. ఈ లక్షణాలు విటమిన్ బి 12 లోపాన్ని సూచిస్తాయి. విటమిన్ బి 12 లోపం శరీరాన్ని బలహీనపరుస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వ్యక్తికి డిప్రెషన్ వంటి సమస్యలు కూడా మొదలవుతాయి.
వెన్నులో నొప్పి:
తరచూ నడుములో నొప్పి ఉన్నా, కాళ్లలో చేతుల్లో కీళ్లలో నొప్పి ఉన్నా శరీరంలో విటమిన్ డి లోపించడం వల్లనే వస్తుంది. కీళ్ల నొప్పులకే కాకుండా.. విటమిన్ డి లోపం వల్ల తరచూ తొందరగా అనారోగ్యానికి గురికావడం, అధికంగా ఆందోళన పడటం, డిప్రెషన్, ఏ గాయాలు అయినా త్వరగా నయం కాకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
చలి పుట్టడం:
మీతో ఉన్నవారి కంటే మీకు వాతావరణం ఎప్పుడూ మరింత చల్లగా అనిపిస్తుంది. శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే ఇలా జరగొచ్చు. అది అయోడిన్ లోపం వల్ల కలిగే హైపోథైరాయిడ్ సంకేతం. కొన్నిసార్లు రక్తం లేకపోవడం, డయాబెటిస్, విటమిన్ బి 12 లోపం కూడా చలి పుట్టడానికి కారణం. అయితే, కేవలం ఈ లక్షణాలు సరైన పోషకాహార లోపాన్ని సూచించకపోవచ్చు. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా సరైన పోషకాలున్న ఆహారం తీసుకోడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.