Toxic friendship: స్నేహితుల్లో ఈ లక్షణాలుంటే వాళ్లను దూరం పెట్టాల్సిందే..-know what are the red flags in a true friendships ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toxic Friendship: స్నేహితుల్లో ఈ లక్షణాలుంటే వాళ్లను దూరం పెట్టాల్సిందే..

Toxic friendship: స్నేహితుల్లో ఈ లక్షణాలుంటే వాళ్లను దూరం పెట్టాల్సిందే..

Koutik Pranaya Sree HT Telugu
Published Jul 05, 2024 02:30 PM IST

Toxic friendship: స్నేహితుల్లో కొన్ని చెడు లక్షణాలుంటే వెంటనే వాటిని గమనించాలి. వాళ్లనుంచి దూరంగా ఉండాలి. లేదంటే వాళ్లని మార్చుకునే ప్రయత్నం చేయాలి.

స్నేహితుల్లో ఉండకూడని లక్షణాలు
స్నేహితుల్లో ఉండకూడని లక్షణాలు (Freepik)

మంచి స్నేహితులుంటే ప్రశాంతత, ఆనందం, బోలెడంత అండాదండ ఉన్నట్లే. కానీ సరైన స్నేహితులు లేకపోతే మీపై అనేక వ్యతిరేక ప్రభావాలూ ఉంటాయి. ఇక వ్యక్తిలో ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలో లోపాలు కొంతయినా గమనించగలుగుతాం. కానీ స్నేహితులతో మనకుండే దగ్గరి సంబంధం వల్ల గుడ్డిగా వాళ్లని నమ్మేస్తాం. వాళ్లలో లోపాలు వెతకాలనే ఆలోచన కూడా రాదు. కానీ వాళ్లలో కొన్ని లక్షణాలంటే మీ మంచికోరే స్నేహితులు కారని అర్థం అవేంటో చూడండి.

1. మీ బాధను అర్థం చేసుకోరు:

అసలైన స్నేహితులు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ బాధ గురించి శ్రద్దగా వింటారు. ఎప్పటికన్నా ఇంకా ఎక్కువ సార్లు మిమ్మల్ని కలుస్తారు. ఫోన్లు చేస్తారు. కానీ మీకు కష్టం వచ్చిందని తెలియగానే మీతో మాట్లాడకుండా తప్పించుకున్నా, మీతో మాట్లాడకపోయినా స్నేహం సరైంది కాదనే లెక్క.

2. తప్పుతోవ పట్టించడం:

మీరు తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడ్డా, తప్పుడు అలవాట్లు చేసుకున్నా వాటి నుంచి మిమ్మల్ని బయటపడేసే ప్రయత్నం చేయరు. అంటే మీ మంచి కోరుకోనట్లు లెక్క. కాబట్టి మీ చుట్టూ మీ మంచి కోరే వ్యక్తులుండేలా చూసుకోవాలి. వాళ్లతోనే స్నేహం చేాయాలి.

3. అసౌకర్యం:

మంచి స్నేహం అంటే హద్దులు లేకుండా ఉండటం కాదు. హద్దులు సరిగ్గా తెలియడం. వాటిని గౌరవించడం. అలాకాకుండా మీ వ్యక్తిగత విషయాల్లో దూరి మీకు ఇబ్బంది కలిగిస్తే వాళ్లు మీ స్నేహితులు కానట్లే. మీమీద, మీ ఇష్టాల మీద వాళ్లకు గౌరవం లేనట్లే.

4. ఇతర వ్యక్తుల గురించి మాట్లాడటం:

ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు మాత్రమే మీతో పంచుకోడానికి ఫోన్ చేస్తుంటే, మీతో కలిసినప్పుడల్లా మీ గురించి కాకుండా వేరేవాళ్ల విషయాలే అవీ ఇవీ చెప్తుంటే వాళ్లకి దూరంగా ఉండటం మేలు. మంచి వ్యక్తిగా ఎదగాలంటే ఆరోగ్యకరమైన స్నేహం అవసరం. మంచి విషయాలు మాట్లాడేవాళ్లు, మీ తెలివిని పెంచేవాళ్లు, మీకు మంచి సలహా ఇచ్చేవాళ్లు మీ స్నేహితులు అయి ఉండాలి.

5. ఆనందం పంచుకోరు:

మీరు చిన్న విజయం సాధించినా అసలైన స్నేహితులు చాలా ఆనంద పడతారు. అలా కాక, మీరు శుభవార్త చెప్పగానే దాన్ని తట్టుకోలేక వాళ్లకున్న కష్టాలు చెప్పి మీ ఆనందాన్ని తగ్గిస్తే వాళ్లు స్నేహితులు కారు.

6. వాళ్లలాగా మారమంటారు:

మీ వ్యక్తిత్వాన్ని నచ్చి మీతో స్నేహం చేసేవాళ్లే అసలైన స్నేహితులు. అలాకాకుండా వాళ్లలాగా, వాళ్లకు తగ్గట్లు మీరు మారాలని కోరుకునే వాళ్లు అసలే మంచి స్నేహితులు కాదు. వాళ్లకున్న నమ్మకాలు, అలవాట్లు మీపై రుద్దితే వాళ్లకు దూరంగా ఉండండి.

మీ ఎదుగులకు సాయం చేసి మీ సంతోషాన్ని పదింతలు చేసే వాళ్లే మీ చుట్టూ ఉండాలి. అలాంటి వాళ్లే మీ స్నేహితులవుతారు. కాబట్టి ఈ విషయాలు మీ స్నేహితుల్లో ఉంటే వాటికి లొంగిపోకండి. వాళ్లని కాస్త మార్చే ప్రయత్నం చేసి మీ బెస్ట్ ఫ్రెండ్ గా మార్చేసుకోండి. వీలు కాకపోతే వాళ్లకి దూరంగా ఉండటం మేలు.

Whats_app_banner