Questions for doctor: షుగర్ చికిత్స మొదలెట్టేముందు డాక్టర్‌ని తప్పక అడగాల్సిన 10 ప్రశ్నలివే..
Questions for doctor: షుగర్ చికిత్సలో మార్పులు చేస్తున్నా, కొత్తగా షుగర్ ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నా వైద్యుల్ని తప్పకుండా ఈ ప్రశ్నలు అడగాలి. అవేంటో తెల్సుకోండి.

చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే లేదా శరీరం ఇన్సులిన్ ను వినియోగించుకోకపోతే ఈ వ్యాధి మొదలవుతుంది. చక్కెర వ్యాధిలో మూడు రకాలుంటాయి. అందులో టైప్ 2 డయాబెటిస్ ఎక్కువ మందిలో కనిపిస్తుంది. దీనికి చికిత్స మొదలుపెడుతున్నా, లేదంటే ఇదివరకటి షుగర్ చికిత్సలో మార్పులు చేస్తున్నా వైద్యుల్ని కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాల్సిందే.
షుగర్ ట్రీట్మెంట్ గురించి అడగాల్సిన ప్రశ్నలు:
1. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
ప్రతి మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ముందుగానే తెల్సుకుంటే వెంటనే ఎలాంటి విపరీత లక్షణాలు రాకుండా చూసుకోవచ్చు. వాటికి భయపడాల్సిన అవసరం ఉండదు.
2. వేరే మందులతో పాటూ వాడొచ్చా?
కొన్ని మందులు ఇతర మందులతో కలిపి వాడితే ఏమైనా ప్రభావం ఉండొచ్చు. అందుకే మీరు ఇదివరకే ఏవైనా మందులు వాడితే వాటి గురించి వైద్యులకు తెలియజేయండి. వాటివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని నిర్దారించుకోండి.
3. మెడిసిన్ వల్ల లాభాలేంటి?
మీరు వాడుతున్న మందుల నుంచి మీరు ఏం ఆశించొచ్చో వైద్యుల్ని అడగండి. దాంతో మీ ఫలితాల మీద స్పష్టత ఉంటుంది. ఆ మందులను వాడాలనే ఆసక్తి కూడా మీలో పెరుగుతుంది. క్రమం తప్పకుండా వాడతారు.
4. ఈ మందులు చక్కెర స్థాయుల్ని బాగా తగ్గిస్తాయా?
సల్ఫోనైల్‌యూరియాస్, ఇన్సులిన్ లాంటి మందులు రక్తంలో చక్కెర స్థాయుల్ని చాలా తగ్గిస్తాయి. దాంతో కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించవచ్చు. దాని ప్రకారం మీ ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు.
5. మందుల్ని ఏ సమయంలో, ఎలా వాడాలి?
మందుల్ని సరిగ్గా వాడితేనే వాటి ప్రభావాల్ని, లాభాల్ని పొందగలం, కాబట్టి సరైన డోసేజ్, టైమింగ్ తెల్సుకోవాలి.భోజనం తర్వాత మందులు తీసుకుంటే చక్కెర స్థాయులు తగ్గించడంలో సాయపడుతుందా లాంటి విషయాలు తెల్సుకోవాలి. దాంతో మందుల లాభాలు పూర్తిగా పొందవచ్చు.
6. డోసేజీ మర్చిపోతే ఏం చేయాలి?
కొన్నిసార్లు మందులు వేసుకోవడం మర్చిపోవచ్చు. అప్పుడు ఏం చేయాలో వైద్యుల్ని అడగాలి. తర్వాతి డోసేజీలో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెల్సుకోవాలి. లేదంటే గుర్తొచ్చిన వెంటనే వేసుకుంటే పరవాలేదా అని కూడా కనుక్కోవాలి.
7. ప్రతి రోజూ చక్కెర స్థాయుల్ని చెక్ చేసుకోవాలా?
క్రమం తప్పకుండా చక్కెర స్థాయుల్ని చెక్ చేసుకోవడం వల్ల మందులు ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తుంది. ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి? ఎన్ని సార్లు చెక్ చేసుకోవాలి? లాంటి విషయాలు అడగాలి.
8. మందుల్ని ఎలా భద్రపరచాలి?
కొన్ని రకాల ఇంజెక్షన్లు, మందుల్ని వాటికి నప్పు ఉష్ణోగ్రతల వద్దే భద్రపర్చాలి. కొన్నింటిని ఫ్రిజ్ లో పెట్టాల్సి వస్తుంది. మరికొన్ని గది ఉష్ణోగ్రత వాడితేనే మంచిది. అయితేనే వాటి ఫలితాలు పొందవచ్చు. దాంతో దూర ప్రయాణాల్లో వాటిని ఎలా తీసుకెళ్లాలో కూడా అవగాహన వస్తుంది.
9. ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి రావాలి?
ప్రతి వ్యాధికి నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు కొన్ని ఉంటాయి. అవేంటో ముందుగానే అడగాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించవచ్చు.
10. చికిత్సలో మార్పుల గురించి?
మీరు చాలా రోజుల నుంచి మందులు వాడుతున్నా ఫలితం లేకపోతే ఇంకేమైనా కొత్త చికిత్సా విధానాలు వచ్చాయా అని అడగొచ్చు. దాంతో మీకు ఎలాంటి ఫలితాలుంటాయో కనుక్కోండి. మీకు నప్పుతుందేమో అడగండి.