Pregnancy Mistakes: ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూస్తున్నారా? ఆలస్యానికి కారణాలివే
Pregnancy Mistakes: ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నపుడు కొన్ని అలవాట్లు దాన్ని మరింత ఆలస్యం చేస్తాయి. అవేంటో తెల్సుకుని మార్చుకుంటే సరి.

ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మానసికంగా చాలా ఆందోళనకు గురవుతారు. ఆత్మ స్థైర్యం లోపిస్తుంది. నిరాశ పెరుగుతుంది. ఆలస్యం అయినా కొద్ది బాధ పెరుగుతుంది. అయితే ప్రయత్నంలో లోపం ఉంటే ఫలితాలతో బాధ పడాల్సి వస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొన్నింటికి, కొన్ని అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. వీటివల్ల గర్భధారణ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. అవేంటో చూడండి.
లూబ్రికెంట్లు:
శృంగార సమయంలో మంట, నొప్పి తగ్గించడానికి లూబ్రికెంట్లు వాడతారు. కానీ కొన్ని రకాల లూబ్రికెంట్లు సంతానోత్పత్తికి ఆటంకం కలిగించవచ్చు. ముఖ్యంగా వాటర్ బేస్డ్ లూబ్రికెంట్లు శుక్రకణం కదలికను తగ్గిస్తాయి. అందుకే వైద్య సలహాతో ఆయిల్ బేస్డ్ రకాలు ఎంచుకోవచ్చు.
అతిగా వ్యాయామాలు చేయడం:
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉండాల్సిందే. దానికోసం యోగా లాంటివి చేయాల్సిందే. అలాగనీ మితిమీరి చేయకూడదు. అలాగనీ కదలకుండానూ కూర్చోకూడదు. అతిగా వ్యాయామాలు చేయడం వల్ల అండ ఉత్పత్తికి కావాల్సిన హార్మోన్ల స్థాయుల్లో మార్పులు వస్తాయి. అండ ఫలదీకరణకు, అండం సక్రమంగా విడుదల కాకపోవడానికి కారణం అవుతుంది.
అలాగనీ కదలకుండా ఉండటమూ మంచిది కాదు. కనీసం అరగంట పాటూ వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మగవారిలో శుక్రకణాల నాణ్యత పెరుగుతుంది. మహిళలో ప్రత్యుత్పత్తి ఆరోగ్యం పెరుగుతుంది. వారానికి రోజు అరగంట చొప్పున 150 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు.
ఆల్కహాల్, స్మోకింగ్:
అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా ఈ అలవాట్లుంటే మానేయాలి. వీటివల్ల సంతానోత్పత్తి మీద ప్రభావం పడుతుంది. ప్రెగ్నెన్సీ రావడానికి ఆలస్యం అవుతుంది. పురుషుల్లో ఈ అలవాట్ల వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గుతాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. స్మోకింగ్ వల్ల స్మర్మ్ నాణ్యత కూడా దెబ్బతింటుంది. అమ్మాయిలకు ఈ అలవాటుంటే అబార్షన్లు అయ్యే అవకాశమూ పెరుగుతుంది.
మందులు:
ఇదివరకే ఏవైనా మందులు వాడుతుంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒకసారి వైద్య సలహాలు తీసుకోవాలి. కొన్ని మందుల వాడకం వల్ల కూడా సంతాన లేమి రావచ్చు.
కెఫీన్:
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కాఫీ తాగడం తగ్గించాల్సిందే. రోజుకు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే పరవాలేదు. కానీ కప్పుల కొద్దీ తాగే అలవాటుంటే హానికరం. టీ తాగే అలవాటుంటే హెర్బల్ టీలు తాగొచ్చు. వీటితో తాజాగా అనిపించడంతో పాటూ ఆరోగ్యమూ పెరుగుతుంది.
కొవ్వు ఎక్కువుండే ఆహారాలు:
పండ్లు, కూరగాయలు, గింజలు, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులన్నీ ఉండేలా ఆహారం ఉండాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి. అంతేగానీ తరచూ జంక్ ఫుడ్ తినడం, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తినడం మానేయాలి.
ఒత్తిడి:
చిన్న చిన్న విషయాలకే ఆందోళన, ఒత్తిడి పడటం మానేయాలి. ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థలో, సంతానోత్పత్తిలో అనేక మార్పులకు కారణం అవుతుంది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు ధ్యానం, అరోమా థెరపీ లాంటివి అలవాటు చేసుకోండి.
నిద్రలేమి:
ఒత్తిడికీ, నిద్రకూ సంబంధం ఉంది. సరైన నిద్ర ప్రభావం సంతానోత్పత్తి మీద ఉంటుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని గుర్తుంచుకోండి.