Popcorn Alternatives: పాప్ కార్న్‌లాంటి చిరుతిండ్లు ఇంకా ఉన్నాయ్... ఏంటంటే!
Popcorn Alternatives: చిరుతిండిగా పాప్ కార్న్ అంటే అందరికీ ఇష్టమే. అయితే దాన్నిమించి ఆరోగ్యకరమైన చిరుతిండ్లు చాలా ఉన్నాయ్. అవేంటో చూడండి.
పాప్ కార్న్ అన్ని చోట్లా తేలికగా అందుబాటులో ఉండే టైంపాస్ స్నాక్. చాలా మంది ఊరికే తింటూ సమయం గడపడం కోసం దీన్ని తినడానికి ఇష్టపడుతుంటారు. దీన్ని చేసేప్పుడు వచ్చే వాసన అంటే చాలా మందికి ఇష్టంగానూ ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్లు ఇది ఉంటుంది. ఇక మన సినిమా థియేటర్లలోనూ, మూవీ నైట్స్‌లో అయితే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఎన్ని సార్లని పాప్ కార్న్‌ని మాత్రమే తింటాం చెప్పండి. ఇంతకు మించిన ఆరోగ్యకరమైన ఆప్షన్‌లు మరి కొన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయండీ. అయితే వాటిపై మనం సరిగ్గా దృష్టి పెట్టం అంతే. అవేంటో తెలుసుకుని వీలైతే ఇంట్లో చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. పాప్‌కార్న్ తిన్నప్పటి లాంటి మజా, అంతకు మించిన ఆరోగ్యం వీటిని తిన్నా కూడా కచ్చితంగా కలుగుతుంది. మరి అవేంటంటే..
ట్రెండింగ్ వార్తలు
ఫూల్ మఖానా:
ఫూల్ మఖానాను ఎంతో మంచి చిరు తిండి అని చెప్పవచ్చు. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే పాప్‌కార్న్‌తో పోల్చి చూస్తే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. తామర పువ్వు గింజలను పాప్ చేసి వీటిని తయారు చేస్తారు. అలా చేసిన వాటిని ప్యాక్ చేసి మార్కెట్‌లో అమ్మకానికి ఉంచుతారు. వీటికి మనకిష్టమైన సీజనింగ్‌ని జత చేసి తినొచ్చు. ఒక్కసారి వేడి చేసి క్రిస్పీగా అయ్యేలా చేయాలి. అప్పుడు వీటిలో కాస్త వెన్న లేదా నూనె వేసి మరోసారి వేయించాలి. కరకరలాడుతున్నాయి అనుకున్నప్పుడు స్టౌ కట్టేసి ఉప్పు, కారం, ఛాట్ మసాలా లాంటివి చల్లుకుని ఓసారి కలిపేసుకుంటే సరి. చక్కటి స్నాక్ తయార్.
మిల్లెట్ పాప్స్:
మనం పాప్ కార్న్‌ని సాధారణంగా మొక్క జొన్న గింజలతో తయారు చేసుకుంటాం. అయితే రాగులు, జొన్నలు, సజ్జలు.. లాంటి చిరు ధాన్యాలు అన్నింటినీ పాప్ చేసుకోవచ్చు. సరదాగా ఆరగించవచ్చు. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ పాప్‌కార్న్ కంటే కూడా వీటిలో ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
వేయించిన శెనగలు:
రోస్టెడ్ చిక్ పీస్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. లేదంటే వీటిని ఇంట్లోనూ మనం తయారు చేసుకోవచ్చు. వాటిలో కొవ్వు పదార్థం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇవి తినడం వల్ల మనకు తక్కువ క్యాలరీలే లభిస్తాయి. కాబట్టి దీన్ని పాప్ కార్న్‌తో పోలిస్టే మరింత ఆరోగ్యకరమైన చిరు తిండిగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
టాపిక్