Eco Friendly Diwali 2023: ఈ దీపావళికి మీ వంతుగా పర్యావరణానికి మేలు ఇలా చేయొచ్చు..
Eco Friendly Diwali 2023: దీపావళి పండగను పర్యావరణ హితంగా జరుపుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. అవి ఫాలో అయ్యి మీరూ పర్యావరణానికి సాయం చేయండి. ఆ చిన్న మార్పులేంటో తెలుసుకోండి.

వెలుగుల పండుగ దీపావళి మన అందరి జీవితాల్లోని చీకట్లను పారదోలడానికి వచ్చేస్తోంది. దీపావళి అనగానే పిల్లలంతా టపాసులు కాల్చడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే వీటి వల్ల పర్యావరణానికి చేటు కలుగుతుందని పర్యావరణవేత్తలు ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటారు. మీరూ ప్రకృతికి, పర్యావరణానికి మంచి చేసేలా దీపావళి జరుపుకోవాలనుకుంటున్నారా. ఎకో ఫ్రెండ్లీ దీపావళిని జరుపుకోవడానికి చక్కని మార్గాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
మట్టి దీపాలు :
పూర్వం నుంచి దీపావళికి మట్టి దీపాలను వాడుకునే అలవాటు మనందరికీ ఉంది. అయితే ఇప్పుడు రకరకాల పదార్థాలతో తయారయ్యే లైట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ప్లాస్టిక్‌తో తయారయ్యే ప్రమిదల్లాంటి విద్యుత్ దీపాలను అలంకరణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే నూనెతో వెలిగించిన మట్టి దీపాల వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది. అదే విద్యుత్‌ని ఎక్కువగా వాడటం వల్ల పర్యావరణానికి హానే కదా. సంప్రదాయ మట్టి దీపాల్ని చక్కగా అంతా వెలిగించుకోండి.
గ్రీన్ క్రాకర్లు :
ఈ పండుగను గ్రీన్ క్రాకర్ల లేదా ఎకో ఫ్రెండ్లీ ఫైర్‌వర్క్స్‌తో మాత్రమే జరుపుకోండి. ఇవి మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. శబ్దం కూడా తక్కువగా వస్తాయి. అందువల్ల గాలి కాలుష్యంతోపాటుగా శబ్ద కాలుష్యమూ తగ్గుతుంది.
ఎల్యీడీ లైట్లు :
ఇంటిని చాలా మంది సీరియల్ లైట్లతో అలంకరించుకుంటూ ఉంటారు. అలా లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉంటే ఎంతో మురిసిపోతుంటారు. అలాంటి వారు ఎకో ఫ్రెండ్లీగా ఉండేందుకు మామూలు లైట్లకు బదులుగా ఎల్యీడీ లైట్లను ఏర్పాటు చేసుకోండి. అవి మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ విద్యుత్తును ఖర్చు చేస్తాయి.
సహజమైన రంగులతో ముగ్గులు :
దీపావళి సందర్భంగా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గుల్ని వేసుకుంటూ ఉంటాం కదా. వాటిపైన సింథటిక్ రంగుల్ని చల్లకండి. కెమికల్స్ ఏమీ లేకుండా ఉండే సహజమైన సుద్దతో చేసే రంగుల్ని వేసే ప్రయత్నం చేయండి. లేదంటే పూలతో రంగోలీలను అలంకరించండి.
బహుమతులు, దుస్తులు :
పర్యావరణ హితంగా ఈ దీపావళికి ముస్తాబు కావాలనుకునే వారు కాటన్, ఖాదీ వస్త్రాల్ని ధరించండి. అలాగే మొక్కలు, మట్టి పాత్రలు, ఆర్గానిక్ ఉత్పత్తుల్లాంటి వాటిని బహుమతులుగా ఇవ్వండి. అలాగే బహుమతుల్ని ఇచ్చేప్పుడు పైన గిఫ్ట్ రేపర్‌తో ప్యాకింగ్ చేస్తారు కదా. దాన్ని కూడా కవర్ లాంటి మెటీరియల్‌తో కాకుండా కాగితంతో తయారు చేసిన దాన్ని, జూట్ వాటిని ఎంచుకోండి. ఇప్పుడనే కాదు.. ఎప్పటికీ కవర్లను తక్కువగా వాడాలని గట్టిగా నిర్ణయించుకోండి. మీ ఎకె ఫ్రెండ్లీ జీవనం.. ఒక్క దీపావళితో ఆగిపోకూడదు. ప్రతి రోజును ఇలాగే గడిపేందుకు ప్రయత్నించాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనం మన వంతు పాత్ర పోషించినవారం అవుతాం.