Easy Plants for Beginners: కొత్తగా మొక్కలు పెంచుతున్నారా? తేలికగా పెరిగే మొక్కలు ఇవే!
Easy Plants for Beginners: మొక్కలు పెంచాలనే ఆసక్తి వస్తే.. కొత్తగా ఏ మొక్కలు పెంచాలో, ఎలా పెంచాలో అని సందేహం ఉంటే.. ఈ మొక్కలు ప్రయత్నించండి. వీటిని సులభంగా ఎవరైనా పెంచేయొచ్చు.
మొక్కలు పెంచడం అంటే చాలా మందికి ఇష్టం. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి టీనేజ్ వయసు ఉన్న వారు కూడా కొత్తగా మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బిగినర్లు కష్టంగా పెరిగే మొక్కల్ని పెంచితే వారు ప్రారంభంలోనే నిరాశకు గురవుతారు. అలా కాకుండా తేలికగా ఆరోగ్యకరంగా మొక్కలు పెరుగుతుంటే వారికి ఇంకా ఇంకా మొక్కల్ని పెంచాలన్నా కోరిక పెరుగుతుంది. అలా ప్రారంభ దశలో ఉన్న వారు పెంచడానికి అనువుగా ఉండే కొన్ని మొక్కల జాబితా ఇక్కడుంది. చదివేయండి.
పీస్ లిల్లీ :
గుబురుగా, పొట్టిగా పెరిగే మొక్కల్లో పీస్ లిల్లీ ఒకటి. ఇవి ఎక్కువగా ఎండ తగలని ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి. రోజుకు ఓ గంట మాత్రమే ఎండ తగిలే చోట్ల వీటిని పాతుకోవచ్చు. మట్టిలో అయినా, కుండీలో అయినా కూడా ఇవి తేలికగా పెరుగుతాయి. రోజూ నీరు పోయడం, పది రోజులకు ఒకసారి పోషకాలు ఇవ్వడం చేస్తే సరిపోతుంది. ఇవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. చక్కగా తెల్లటి ఆకుల్లాంటి పూలతో అలరిస్తాయి. ఈ మొక్కల్లో రకరకాల రంగుల పూలు పూసేవీ అందుబాటులో ఉంటాయి.
జడ్ జడ్ ప్లాంట్ :
మొక్కలను పెంచాలనుకునే వారు ప్రారంభంలో ఎలాంటి కేర్ తీసుకోకపోయినా సరే చక్కగా పెరిగే మొక్క జడ్ జడ్ ప్లాంట్. దీనికి వారానికి ఒకసారి నీరు పోసినా సరిపోతుంది. అయితే ఇది చాలా వేగంగా పెరిగే మొక్క కాదు. కాస్త నెమ్మదిగా ఎదిగే మొక్క. ఇది నేరుగా ఎండ తగిలే చోట కంటే సెమీ షేడ్‌లో, నీడలో బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రారంభ దశలో మొక్కల్ని పెంచాలని అనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు.
మనీ ప్లాంట్ :
ఎవ్వరైనా సరే తేలికగా పెంచుకోగల మొక్కల్లో మనీ ప్లాంట్ ముందు వరుసలో ఉంటుంది. ఇది ఇంట్లో అయినా, కొద్దిగా ఎండ పడే ప్రదేశంలో అయినా చక్కగా పెరుగుతుంది. ఇది గాలిని శుభ్రం చేస్తుంది. మూడ్‌ని మెరుగుపరుస్తుంది. దీనికి రోజూ నీరు పోస్తూ అప్పుడప్పుడూ పోషకాలు అందిస్తూ ఉంటే చాలు. ఆరోగ్యంగా పెరుగుతుంది. చీడపీడల్లాంటివీ దీనికి తక్కువగానే వస్తాయి. కాబట్టి మొక్కల్ని కొత్తగా పెంచుకోవాలని అనుకునే వారు దీనితో మొదలు పెట్టవచ్చు.
సింగోనియం :
సిగోనియం మొక్కల ఆకులు భలే అందంగా ఉంటాయి. వీటిలో రకరకాల రంగుల ఆకులుండే మొక్కలు అందుబాటులో ఉంటాయి. వీటిని పెంచడం చాలా తేలిక. నీరు పోస్తూ ఉంటే చాలు.. గుబురుగా ఆకులు వచ్చి చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇటీవల కాలంలో ఇందులో వెరిగేటెడ్ వెరైటీలు అందుబాటులో ఉంటున్నాయి.