Lipbalm ingredients: లిప్‌బామ్‌‌‌లో ఇవి లేకపోతే ఎంత వాడినా లాభం లేదు.. అవేంటో చూడండి..-know what are the best ingredients of lipbalms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lipbalm Ingredients: లిప్‌బామ్‌‌‌లో ఇవి లేకపోతే ఎంత వాడినా లాభం లేదు.. అవేంటో చూడండి..

Lipbalm ingredients: లిప్‌బామ్‌‌‌లో ఇవి లేకపోతే ఎంత వాడినా లాభం లేదు.. అవేంటో చూడండి..

Koutik Pranaya Sree HT Telugu
Jul 03, 2024 12:30 PM IST

Lipbalm ingredients: రోజూవారీ వాడే లిప్‌బామ్ సరిగ్గా ఎంచుకుంటే పెదాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి. లిప్‌బామ్ కొనేముందు అందులో ఏమున్నాయో చూసి కొంటే సరిపోతుంది.

లిప్‌బామ్
లిప్‌బామ్ (freepik)

అమ్మాయిల పర్సుల్లో, బ్యాగుల్లో ఏమున్నా లేకున్నా లిప్ బామ్ మాత్రం ఉంటుంది. మేకప్ ఏమాత్రం ఇష్టపడని వాళ్లు కూడా బయటకు వెళ్తున్నామంటే పెదాలకు లిప్ బామ్ తప్పకుండా రాసుకుంటారు. అదొక సంతృప్తి. మన శరీరంలో అతి పలుచని చర్మం ఉండేది పెదాలపైనే. దానికోసం రోజూవారీ వాడే ఈ లిప్ బామ్‌లో కొన్ని పదార్థాలుంటే అందంతో పాటూ ఆరోగ్యం కూడా. పెదాలకు కాస్త రంగు, మెరుపుదనంతో పాటూ ఆరోగ్యంగానూ ఉంటాయి. కాబట్టి లిప్ బామ్ కొనే ముందు ఒకసారి ఈ పదార్థాలున్నాయో లేదో చూసి కొనండి..

లిప్‌బామ్ లో ఉండాల్సిన పదార్థాలు:

విటమిన్ ఈ:

విటమిన్ ఈ లో ఉండే యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు పెదాలను పొడిబారకుండా చూస్తాయి. పెదాలకుండే నలుపుదనం తగ్గేలాగా చూస్తుందిది. విటమిన్ ఈ ఉన్న లిప్‌బామ్ ఉత్తమమైనవి అనుకోవచ్చు. ఇది పెదాలకు కావాల్సిన తేమ అందిస్తుంది.

షియా బటర్:

లిప్ బామ్ బదులుగా మార్కెట్లో దొరకే షియా బటర్ పెదాలకు నేరుగా రాసుకున్నా ఫలితం ఉంటుంది. కాస్త రంగు, మెరుపు కూడా కావాలి కాబట్టి షియాబటర్ ఉన్న లిప్ బామ్ అయినా ఎంచుకోవచ్చు. ఇది సహజ మాయిశ్చరైజర్. దీంట్లో విటమిన్ ఎ, ఈ ఉంటాయి. ఈ బటర్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పెదాలకు ఉండే ఉబ్బు తగ్గిస్తాయి. ఎప్పుడూ పొడిబారే లక్షణం ఉన్న పెదాలుంటే రోజూవారీ దీన్ని చక్కగా వాడుకోవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెకున్న తేమ అందించే లక్షణం గురించి చెప్పక్కర్లేదు. పెదాలు పొడిబారినా, పొట్టు తేలుతున్నా, పగుళ్లు ఎక్కువగా ఉన్నా కొబ్బరి నూనె రాసుకోవచ్చు. దీనికి యాంటీమైక్రోబియల్ లక్షణాలుంటాయి. అందుకే పెదాలు తేమగా ఉండేలా చూస్తుందిది. కొబ్బరి నూనె నేరుగా రాసుకోవడం ప్రతిసారీ వీలుకాదు కాబట్టి కొబ్బరి నూనె లిప్ బామ్ ఎంచుకుంటే ఈ ఫలితాలు పొందొచ్చు.

సన్ ప్రొటెక్షన్:

పెదాల మీద సూర్యరశ్మి ప్రభావం పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరెంచుకునే లిప్‌బామ్ కనీసం ఎస్‌పీఎఫ్ 30 ఉన్నది ఉండాలి. లిప్ బామ్ లోనే సన్ ప్రొటెక్షన్ దొరికితే ప్రత్యేకంగా దాని మీద మరో సన్‌స్క్రీన్ రాయక్కర్లేదు. ఎండలో తిరిగినప్పుడు పెదాలు నల్లబడకుండా ఇది కాపాడుతుంది. ఎప్‌పీ‌ఎఫ్ బదులుగా లిప్‌బామ్ లో జింక్ ఆక్సైడ్, టైటానియం డై ఆక్సైడ్ ఉండే వాటిని సహజ సన్‌స్క్రీన్‌లా అనుకోవచ్చు. వాటిని ఎంచుకున్నా ఎండ నుంచి రక్షణ దొరుకుతుంది.

ఆముదం:

ఆముదానికున్న లక్షణాల వల్ల చాలా రకాల మందుల్లో దీన్ని వాడతారు. చర్మం లోపలి దాకా ఇంకిపోయే గుణం దీనికుంది. అందుకే క్యాస్టర్ అయిల్ ఉన్న లిప్ బామ్ ఎంచుకుంటే పెదాల ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

జొజొబా ఆయిల్:

చాలా రకాల లిప్‌బామ్‌లలో జొజొబా ఆయిల్ ఉంటుంది. దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. చర్మం మృదువుగా ఉండేలా చూస్తుందిది. పెదాల నలుపు కూడా తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యం కోసం చూస్తే జొజొబా నూనె ఉన్న లిప్ బామ్ ఎంచుకోండి చాలు.

Whats_app_banner