Yoga For Strong Spine: మీ వెన్నును బలోపేతం చేసే తేలికైన యోగాసనాలు ఇవే!
Yoga For Strong Spine: వెన్నెముక ఆరోగ్యం కోసం తప్పకుండా చేయాల్సిన కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి. వాటిని ఎలా చేయాలో వివరంగా తెలుసుకోండి.
ఈ మధ్య కాలంలో చాలా మంది కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఎక్కువగా పని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు కుర్చీలో అలాగే కూర్చుని పని చేయడం వల్ల నడుం నొప్పి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఇలాంటి వారు వెన్నును బలంగా చేసుకోవడానికి కొన్ని తేలికపాటి యోగాసనాలు ఉన్నాయి. వాటిని చేసుకోవడం ద్వారా నడుం నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే ఈ సమస్యలు రాకుండానూ ఉంటాయి. మరి ఆ యోగాసనాలేంటంటే..
ఉత్తిత త్రికోణాసనం:
ఇది నిలబడి చేసే యోగాసనం. ముందుగా నిటారుగా నిలబడండి. తర్వాత కాళ్లను పక్కవైపుకు వీలైనంత ఎడంగా చేయండి. ఇప్పుడు చేతుల్ని భుజాలతో సమానంగా పక్కవైపుకు చాచండి. ఇప్పుడు వంగుని కుడి చేతితో కుడి కాలి పాదాన్ని తాకండి. మళ్లీ నిలబడండి. ఇప్పుడు ఎడమ చేతితో ఎడమ కాలి పాదాన్ని తాకండి. మళ్లీ లేచి నిలబడండి. ఇప్పుడు ఎడమ చేతితో కుడి కాలి పాదాన్ని తాకండి. మళ్లీ లేచి నిలబడండి. ఇప్పుడు కుడి చేతితో ఎడమ చేతి పాదాన్ని తాకండి. క్రమం తప్పకుండా ఈ యోగాసనాన్ని చేయడం ద్వారా మీ వెన్నుకు ఎంతో దన్నుగా ఉంటుంది.
భుజంగాసనం :
నాగు పాము ఎలాగైతే తల పైకిత్తి చూస్తూ ఉంటుందో అలా పడగ విప్పిన పాము లాగ మనం ఆసనం వేయడాన్నే భుజంగాసనం అంటారు. దీన్ని చేయడానికి ముందు నేల మీద యోగా మ్యాట్‌ని పరుచుకోండి. ముఖం నేల వైపు ఉండేలా బోర్లా పడుకోండి. అర చేతుల్ని ఛాతి పక్కగా నేలపై ఆనించి చిన్నగా మెడను, ఆ తర్వాత నడుమును పైకి ఎత్తండి. మెడను వీలైనంత వెనకకు వంచి ఉండండి. తర్వాత యథాస్థితికి రండి. ఈ భంగిమ వల్ల వెన్నుముక సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
అధోముఖ స్వానాసనం :
ముందు దీర్ఘంగా శ్వాస తీసుకుని నిటారుగా నిలబడండి. తర్వాత చేతుల్ని, మెడను ఆకాశం వైపుకు ఎత్తండి. అలా కొన్ని సెకన్లు ఉన్న తర్వాత నిటారుగా కిందికి వంగి కాళ్లను పట్టుకోండి. తర్వాత మెల్లగా కాళ్లు, చేతులను దూరం జరుపుతూ విల్లులా వంగండి. ఈ సమయంలో మీ ముఖం నేల వైపు చూస్తూ ఉండాలి. నడుము గాలిలో వంగి ఉండాలి. ఇలా కొద్దిపాటి సమయం ఉండి మళ్లీ తిరిగి యథా స్థానానికి రండి. నడుము, వెన్ను, మెడ సంబంధిత సమస్యలు ఉన్న వారు, ఎక్కువగా కూర్చుని పనులు చేసే వారు రోజూ ఈ మూడు ఆసనాల్ని వేయడం ద్వారా మీ వెన్నెముక బలోపేతం అవుతుంది.