మనం ఏదైనా విషయం గురించి సరిగ్గా ఆలోచించాలన్నా, సరైన నిర్ణయం తీసుకోవాలన్నా మెదడు పాత్ర కీలకంగా ఉంటుంది. ఇది అనేక నాడుల సమూహం అని చెబుతారు కదా. అవన్నీ ఆరోగ్యంగా ఉండి, సరిగ్గా పని చేస్తేనే మనం తెలివిగా ప్రవర్తించ గలుగుతాం. లేకపోతే జ్ఞాపక శక్తి కోల్పోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తికమక పడటం.. లాంటివి జరుగుతాయి. మరి మెదడుకు పదును పెట్టే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. వాటిని రోజూ ఆచరించడం వల్ల మన మెదడు మరింత షార్ప్‌గా తయారవుతుంది. వీటిని ఎక్సర్‌సైజులుగా భావించి కొందరిపై కొన్ని కొన్ని అధ్యయనాలు జరిగాయి. ఆ ఫలితాలు చూశక పరిశోధకులే ఆశ్చర్యపోయారు. వారిలో మెదడు పని తీరు అంతగా మెరుగుపడిందట మరి. అవేంటో తెలుసుకుందామా?
కొన్ని ముక్కలన్నీ సరైన పద్ధతిలో కలిపితే ఓ ఆకారం వస్తుంది కదా. ఇలాంటి జిగ్సా పజిల్స్ మార్కెట్‌లో చాలా దొరుకుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా చిన్న పిల్లలే ఆడుకుంటారని అనుకుంటారు. పెద్దవారూ వీటిని అప్పుడప్పుడూ ఆడుతూ ఉండండి. అందువల్ల మెదడు మరింత చురుకుగా పని చేయడం మొదలుపెడతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
కంప్యూటర్లో కొన్ని సొలిటర్ కార్డ్ గేమ్స్ ఉంటాయి కదా. అవేనండీ పేకలతో అంకెలు సెట్ చేసే ఆటల్లాంటివి. వాటిని ఆడటం వల్లా మెదడులో కొన్ని భాగాలు ఎక్కువగా ఉత్తేజితం అవుతాయి. అందువల్ల మన మెదడు మరింత పదును దేలుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కంప్యూటర్లో కొన్ని రకాల కార్డ్స్‌ని ఆడుతూ ఉండమని పరిశోధకులు చెబుతున్నారు.
మిమ్మల్ని మీరు బాగా పరీక్షించి చూసుకోండి. ఎక్కువగా మీరు రాయడానికి, మాట్లాడటానికి కొద్ది పదాలను మాత్రమే వాడుతూ ఉంటారు. అలా కాకుండా భాషా పరిధిని మరింత పెంచుకోండి. కొత్త కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోండి. వాటిని వాడేందుకు ప్రయత్నించండి. అలాగే కొత్త భాషలు నేర్చుకోండి. ఎక్కువ భాషల్ని నేర్చుకోవడం వల్ల మెదడు మరింత చురుగ్గా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
సంగీతం వినడం, దాన్ని ఇతరులకు నేర్పించడం వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితం అవుతాయి. అలాగే మనసారా డ్యాన్స్ చేయడం వల్లా మెదడు నరాల పని తీరు మెరుగవుతుంది. 2017లో జరిగిన ఓ అధ్యయనంలో ఫీల్ గుడ్ మ్యూజిక్‌ని వినడం వల్ల మెదడు శక్తివంతం అవుతుందని తేలింది. దీని వల్ల క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయని వెల్లడైంది.
టాపిక్