Happy Hormones: ముద్దు, కౌగిలింత.. మనలో ఏం మార్పులు తెస్తాయో తెలుసా!
Happy Hormones: మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు సరైన స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఆ హార్మోన్ల పేర్లేంటో, వాటి స్థాయులు పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
మనం ఆనందంగా ఉండాలంటే మన శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలవ్వాలి. వాటి వల్ల మాత్రమే మనం సంతోషంగా, ఉల్లాసంగా ఉండగలుగుతాం. మరి ఏం చేయడం వల్ల ఈ హ్యాపీ హార్మోన్లు మనలో విడుదలవుతాయి? అసలు ఆ హార్మోన్‌లు ఏంటి? లాంటి వివరాల్నింటినీ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హ్యాపీ హార్మోన్లు ఇవే :
ఎండార్ఫిన్లు:
మనం మానసికంగా ఆనందంగా ఉండటానికి నేరుగా సంబంధం ఉన్న హార్మోన్‌లు ఎండార్ఫిన్లు. ఇవి మన శరీరం మనకు సౌలభ్యంగా ఉండేలా చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి. గాయాల వల్ల కండరాలు ఎక్కడైనా దెబ్బతిన్నట్లయితే వాటిని సరి చేసి మనకు సౌఖ్యాన్ని కలిగిస్తాయి.
డోపమైన్:
ఈ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల మనం ఫీల్ గుడ్ ఆలోచనలతో ఉత్సాహవంతంగా ఉంటాం. బరువు తగ్గడం, శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచుకోవడం లాంటి చిన్నా, పెద్దా లక్ష్యాలను మనం చేరుకోగలిగినప్పుడు ఇది మనలో అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మనం మరింత ఉత్సాహంగా ఉంటాం.
సెరటోనిన్:
సెరటోనిన్ మనలో ఒత్తిడి, ఆందోళనల లక్షణాలను తగ్గిస్తుంది. అందువల్ల మనం మంచిగా ఉన్న భావన మనకు కలుగుతుంది.
హ్యాపీ హార్మోన్లు పెరగాలంటే ఏం చేయాలి?:
- జంతువులతో ఆడుకోవడం, ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటి వాటి వల్ల మనలో హ్యాపీ హార్మోన్లు తగినంతగా విడుదలవుతాయి.
- మీరు ఆనందంగా నవ్వుతూ ఉండేందుకు మీకు ఏఏ విషయాలైతే సహకరిస్తాయో ఆ పనల్ని తరచుగా చేస్తూ ఉండండి. పర్యాటక ప్రాంతాల్ని సందర్శించడం, మంచి కామిక్ పుస్తకాలు చదవడం, పచ్చని ప్రకృతిలో గడపడం.. లాంటి వాటిని చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రియమైన వారితో నాణ్యమని సమయాన్ని గడపండి.
- ఎక్కువ ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉండండి. మీరు ఏ పనినైతే ఎంజోయ్ చేస్తారో దానిలో మాత్రమే మీ భవిష్యుత్తను నిర్దేశించుకోండి. అప్పుడు ఆ పనిని మీరు ఎంతో ఆనందంగా చేయగలుగుతారు. దాని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
- శరీరానికి విటమిన్ డి సరిపడినంతగా అందేలా చూసుకోండి. అందుకు కాసేపు ఎండలో ఉండండి. డీ విటమిన్ లభించే పుట్టగొడుగులు, చేపలు, సముద్రపు ఆహారాలను తీసుకోండి. దీని వల్ల మన ఎముకలు బలంగా అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి ఇండైరెక్ట్‌గా మనలో సెరటోనిన్ హార్మోన్‌ని వృద్ధి చేస్తాయి.
- వారంలో రెండు సార్లు 50 నుంచి 100 గ్రాముల వరకు డార్క్ చాక్లెట్‌ని తినడం వల్ల మనలో హ్యాపీ హార్మన్లు విడుదలవుతాయి. అంతేకాకుండా దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే మీరు తింటున్న డార్క్ చాక్లెట్‌లో 70 నుంచి 85 శాతం కొకొవా యే ఉండాలని గుర్తుంచుకోండి.