Girl things: ముఫ్పై ఏళ్ల లోపు అమ్మాయిల దగ్గర తప్పకుండా ఉండాల్సినవి ఇవే..-know what a women must have before turning 30 years old ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Girl Things: ముఫ్పై ఏళ్ల లోపు అమ్మాయిల దగ్గర తప్పకుండా ఉండాల్సినవి ఇవే..

Girl things: ముఫ్పై ఏళ్ల లోపు అమ్మాయిల దగ్గర తప్పకుండా ఉండాల్సినవి ఇవే..

Koutik Pranaya Sree HT Telugu
Published Jul 16, 2024 12:30 PM IST

Girl things: ముఫ్పై ఏళ్లు దాటక ముందు అమ్మాయిల దగ్గర తప్పకుండా ఉండాల్సిన విషయాల గురించి వివరంగా చదివేయండి. వీటివల్ల మహిళల్లో ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి.

ముప్ఫై ఏళ్ల లోపు మహిళల దగ్గర ఉండాల్సినవి
ముప్ఫై ఏళ్ల లోపు మహిళల దగ్గర ఉండాల్సినవి

అమ్మాయిలకు 30 ఏళ్లు వస్తున్నాయంటే చాలా విషయాలు మారిపోతాయి. కొందరికి పెళ్లిళ్లవుతాయి. కొందరికి పిల్లలు పుడతారు. కొందరు కెరీర్ లో సెటిల్ అయిపోతారు. ఈ ముప్ఫై అనే సంఖ్య అమ్మాయిల జీవితాల్లో చాలా ముఖ్యమైంది. మీరు ఎలాంటి జీవనశైలిలో ఉన్నా సరే మీరు ముఫ్పై ఏళ్లు దాటే లోపు మీ దగ్గర తప్పకుండా ఉండాల్సినవి, మీకోసం మీరు చేసుకోవాల్సినవి కొన్నుంటాయి. వాటివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ జీవనశైలి మారుతుంది. అవేంటో చూసేయండి.

1. సొంత బ్యాంక్ అకౌంట్:

మీరు ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా, పెళ్లి అయినా అవకపోయినా మీకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ తప్పకుండా ఉండాలి. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా దాంట్లో ఎంతో కొంత ఆదా చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మీకు ఆర్థికంగా కాస్త స్వాతంత్య్రం ఉన్నట్లే. మీకు లేకుంటే వెంటనే ఒక అకౌంట్ తెరవండి.

2. డ్రైవింగ్ లైసెన్స్:

కార్ లేదంటే స్కూటీ.. ఏదో ఒకటి నడపడం తప్పకుండా నేర్చుకోండి. వాటికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. దీనివల్ల మీకు తెలీకుండానే ఇండిపెండెంట్ గా ఉండటం అలవాటవుతుంది. చిన్న అవసరానికి బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా ఒకరిమీద ఆధారపడక్కర్లేదు. వేరేవాళ్లని ఇబ్బంది పెట్టక్కర్లేదు.

3. వ్యాయామానికి షెడ్యూల్:

మానసికంగా, శారీరకంగా బాగుండాలంటే వ్యాయామం తప్పనిసరి. ముప్ఫై ఏళ్ల లోపు మీరు చేయగలిగే, మీకు నచ్చే శారీరక కసరత్తులేంటో తెల్సుకోండి .వాటిని రోజూ క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోండి. డ్యాన్స్, స్కిప్పింగ్ ఏదైనా ఒకటి అలవాటు అయిపోవాలి.

4. ధైర్యం:

ఒక్కరే సినిమాకు వెళ్లగలగాలి, ఒక్కరే షాపింగ్ చేయగలగాలి, ఒక్కరే మీ పిల్లల కోసం బయటకు వెళ్లగలగాలి. వాళ్లడగింది తేగలగాలి. ప్రతిసారీ ఒంటరిగా వెళ్లాలని కాదు. కానీ, అవసరమైనప్పుడు ఒక్కరే మీ పనులు చేసుకోగలిగే ధైర్యం రావాలి.

5. నైపుణ్యం:

మీరు మాత్రమే ప్రత్యేకంగా, సమగ్రంగా చేయగలిగే ఏదైనా పని మీకు వచ్చి ఉండాలి. మీ ఉద్యోగంలో, బయటా అది మీకు అండగా ఉంటుంది. ఎప్పటికీ డబ్బు సంపాదించగలిగే సత్తా దానివల్ల మీకు వస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందిది.

6. మీ మనుషులు:

మీ చుట్టూ వంద మంది ఉన్నా కొందరితో మాత్రమే మీరు అన్ని విషయాలు పంచుకోగలుగుతారు. మీరు ముప్ఫై ఏళ్లు దాటేలోపు మీకంటూ మీరు గుడ్డిగా నమ్మి, ఏదైనా చెప్పుకోగలిగే స్నేహితులు, ఆత్మీయులు ఉండాలి. దానివల్ల మీకు మానసికంగా చాలా ధైర్యం దొరుకుతుంది.

7. ఆస్తులు:

అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా సంపాదిస్తున్నారు. కాబట్టి మీకు వచ్చిన జీతం అకౌంట్‌లో ఉంచుకోకుండా సరిగ్గా ఇన్వెస్ట్ చేయండి. ఇల్లు, ప్లాట్, బంగారం.. ఏదైనా ఒక ఆస్తి కొనండి. మీకు చాలా సంతృప్తి ఉంటుంది. అమ్మాయిలు ఆస్తులు సంపాదించాల్సిన అవసరం ఏముందని అనుకోకండి. మీరు ఊహించలేని ఆత్మవిశ్వాసం దీనివల్ల వస్తుంది.

8. ట్రిప్:

మీ తల్లిదండ్రులను ఒక్కసారైనా మీ డబ్బులతో, మీరే అన్నీ సౌకర్యాలు చూసుకుని ట్రిప్‌కు తీసుకువెళ్లండి. వాళ్లకి చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే తప్పకుండా ఒక్కసారైనా మీ స్నేహితులతో కలిసి మంచి ప్రదేశానికి టూర్ వెళ్లి రండి. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి.

9. కొత్త విషయాలు:

కొత్త భాష నేర్చుకోవడం, కొత్త పుస్తకాలు చదవడం, కొత్త వంటలు నేర్చుకోవడం.. ఎప్పుడూ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీ తెలివి తేటల్ని పెంచుకునే పనులు చేస్తూనే ఉండాలి.

Whats_app_banner