First Flight Journey: మొదటిసారి విమాన ప్రయాణమా? ఈ విషయాలు తెల్సుకోండి
First Flight Journey: మొదటిసారి విమానంలో ప్రయణించబోతుంటే కాస్త కంగారుగా ఉంటుంది. అందుకే ప్రయాణంలో, ప్రయాణానికి ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దాంతో మీ మొదటి గగన ప్రయాణం మరింత సులువవుతుంది.
మొదటిసారి విమానంలో ప్రయాణించబోతున్నారా? ప్రయాణానికి ముందు ఎయిర్ పోర్ట్ లో ఏం చేయాలో, ప్రయాణ సమయంలో ఎలా ఉండాలో ముందుగానే కొన్ని ముఖ్య విషయాలు తెల్సుకుంటే మేలు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక గాబరా పడకుండా ఉంటారు. కొన్ని చిన్న చిన్న విషయాలు తెల్సుకుంటే చాలు. అవేంటో చూద్దాం.
ప్రయాణానికి ముందు..
1. టిక్కెట్ బుక్ చేసుకునే ముందే పాస్‌పోర్ట్ అప్‌డేట్ ఉందా లేదా అని చూసుకోవాలి. అలాగే మీ ఫ్లైట్ సరైన సమయానికే ఉందా? లేదా ఏమైనా ఆలస్యం అవుతోందా? లేదంటే విమానం ఏమైనా రద్దయ్యిందా అని మీకు అప్‌డేట్స్ వస్తుంటాయి. ఎయిర్ పోర్ట్ వెళ్లేముందు విమానం స్టేటస్ తప్పకుండా చూసుకోవాల్సిందే.
2. విమానంలో మనం ఎంత లగేజీ తీసుకెళ్లాలనే విషయంలో పరిమితులుంటాయి. మీరు ప్రయాణిస్తున్న ఎయిర్ లైన్ కంపెనీ ఒక్కొక్కరికీ ఎన్ని బ్యాగులు, ఎంత బరువు పరిమితి ఇస్తుందో ముందే చూసుకోండి. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లేముందు ఇంట్లోనే మీ లగేజీ బరువు పరిమితిలో ఉందో లేదో చూసుకుంటే అక్కడికెళ్లాక ఏ ఇబ్బందీ ఉండదు. లేదంటే ఎక్కువ లగేజీ తీసుకెళ్లడం కోసం డబ్బులు కట్టాల్సి వస్తుంది.
3. మీతో పాటూ విమానంలో తీసుకెళ్లడానికి ఒక చెక్ - ఇన్ బ్యాగ్ అనుమతి ఉంటుంది. అందులో మీకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులు, పాస్‌పోర్ట్, టిక్కెట్, బోర్డింగ్ పాస్, ఫోన్, ల్యాప్‌టాప్, వ్యాలెట్, చార్జర్, ఏవైనా మందులు, మీ గుర్తింపు కార్డుల్లాంటివి ఉంచుకోండి. అవసరానికి అందుబాటులో ఉంటాయి.
4. చెక్ ఇన్ బ్యాగులో, ఇతర లగేజీలలో కొన్ని విమాన సంస్థలు కొన్ని రకాల వస్తువుల్ని అనుమతించవు. మంటను ప్రేరేపించే వస్తువులు, కొన్ని రకాల మందులు, పదునైన వస్తువులు, బ్యాటరీలు.. ఇలాంటివి కొన్ని మన లగేజీలో ఉండటం నిషిద్ధం. అవి ముందుగానే తెల్సుకోండి.
ప్రయాణం చేసేటప్పుడు..
1. మీ సీట్ వెనక్కి రిక్లైన్ చేసుకోవాలనుకుంటే ముందుగా వెనక ప్యాసెంజర్‌ను ఒకసారి గమనించుకోవాలి.
2. పిల్లలతో ప్రయాణిస్తుంటే వాళ్లు అల్లరి చేయకుండా ఏవైనా ఆటవస్తువులు దగ్గర ఉంచుకోండి. వేరేవాళ్లకు ఇబ్బంది కాకుండా చూసుకోండి.
3. దూర ప్రయాణం అయితే మీతో తప్పకుండా నెక్ పిల్లో, ఐ మాస్క్ లాంటివి ఉంచుకోండి. హాయిగా నిద్రపోవచ్చు.
4. మన భద్రతకు సంబంధించిన విషయాలు విమాన సిబ్బంది చెప్తారు. మీ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ప్రాణాపాయ స్థితి వస్తే లైఫ్ జాకెట్ ఎలా వాడాలి, ఆక్సీజన్ మాస్క్ ఎలా తీసుకోవాలి, ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా వాడాలి.. లాంటి విషయాలన్నీ చెబుతారు. వాటిని వినడంలో అశ్రద్ధ చేయకండి.
టాపిక్