Knee pain in winter: మోకాలి నొప్పులకు చికిత్స ఇదే-know these surgical and non surgical treatments for knee pain in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know These Surgical And Non Surgical Treatments For Knee Pain In Winter

Knee pain in winter: మోకాలి నొప్పులకు చికిత్స ఇదే

HT Telugu Desk HT Telugu
Jan 13, 2023 11:19 AM IST

Knee pain in winter: మోకాలి నొప్పులకు నాన్ సర్జికల్, సర్జికల్ చికిత్సలు చాలా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరూ చూడండి.

Knee pain in winter: మోకాలి నొప్పులకు అందుబాటులో సర్జికల్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్
Knee pain in winter: మోకాలి నొప్పులకు అందుబాటులో సర్జికల్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ (Towfiqu barbhuiya)

మోకాలి నొప్పులు చాలా బాధాకరంగా, దీర్ఘకాలికంగా ఉంటుంది. మీ కదలికలను నియంత్రిస్తుంది. మీ మూడ్‌ను దెబ్బతీస్తుంది. ఇక వింటర్‌లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. బారోమెట్రిక్ ప్రెజర్ తగ్గడం వల్ల కీళ్లలో వాపు ఏర్పడుతుంది.

రోజువారీ పనులు చేసుకోనీకుండా మీ మోకాలి నొప్పులు ఇబ్బంది పెడుతున్నట్టయితే మీకు అందుబాటులో ఉన్న చికిత్సలను ఒకసారి పరిశీలించాల్సిందే. తొలి దశల్లో నాన్ సర్జికల్ చికిత్సా విధానాలు పరిశీలించవచ్చు. అయితే చాలా కేసుల్లో మోకాలి సర్జరీ కూడా అవసరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సీతారామ్ భార్తియా ఇనిస్టిట్యూట్ అండ్ హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బీరేన్ నాదకర్ణి హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడారు. మోకాళ్ల నొప్పుల చికిత్సలో ఉన్న సర్జికల్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్లను వివరించారు.

నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్లు ఇవే..

1. NSAID: నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్‌

నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్‌ని సాధారణంగా నొప్పి నివారణ మందులు అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా మోకాలి నొప్పికి చికిత్స చేయడంలో మొదటి అడుగు. ఓవర్-ది-కౌంటర్, ప్రిస్క్రిప్షన్‌ రూపంలో కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి మంటను తగ్గిస్తాయి. అసౌకర్యాన్ని నిరోధిస్తాయి. ఇది దీర్ఘకాలిక పరిష్కారం కానప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది.

2. Injections: ఇంజెక్షన్లు

మోకాలి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంజెక్షన్ థెరపీ సూచిస్తారు. ఈ ఇంజెక్షన్లు స్టెరాయిడ్స్ లేదా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ను కలిగి ఉంటాయి. తాత్కాలికంగా ఇవి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఇవి తక్షణం పనిచేయడం మొదలుపెడతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేంటరీ ఇంజెక్షన్లలో హైల్యూరానిక్ యాసిడ్, లూబ్రికెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఔషధం కలగలసి ఉంటాయి.

3. Platelet-Rich Plasma (PRP): ప్లేట్‌లెట్ ప్లాస్మా చికిత్స

ఇటీవలి కాలంలో ప్లేట్‌లెట్ బాగా ఉన్న ప్లాస్మాతో కూడిన చికిత్స ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఆటల్లో గాయాలకు ఈ చికిత్స బాగా ఉపయోగపడుతోంది. గాయపడిన భాగంలోకి ప్లేట్‌లెట్ బాగా ఉన్న ప్లాస్మాను ఎక్కించడం ద్వారా ఈ చికిత్స చేస్తారు. రక్తం గడ్డ కట్టడానికి, అలాగే నయం చేయడానికి ఈ ప్లేట్‌లెట్స్ దోహదపడుతాయి. పీఆర్‌పీ థెరపీ తాత్కాలికంగా ఆ నొప్పి ప్రాంతంలో మంట పుట్టిస్తుంది. అయితే సహజమైన హీలింగ్ ప్రాసెస్‌గా గుర్తించాలి.

4. Bracing: మోకాలి బ్రేసింగ్

మోకాలి కీళ్ల వద్ద బయటి నుంచి స్థిరత్వాన్ని అందించేందుకు పట్టీల్లాంటి ఈ బ్రేసెస్ ఉపయోగపడతాయి. మోకాలి కండరాలకు బలాన్ని ఇస్తాయి. కీలును స్థిరంగా ఉంచి అసౌకర్యాన్ని, మంటను తగ్గిస్తాయి. నొప్పిని తగ్గించి కదలికకు ఇబ్బంది లేకుండా చేస్తాయి.

5. Physical Therapy: ఫిజికల్ థెరఫీ

మోకాలి నొప్పిని ఫిజికల్ థెరఫీ ద్వారా కూడా తగ్గించవచ్చు. మోకాలు బలం సంతరించుకునేలా ఫిజికల్ థెరిఫిస్ట్ దీనికి తగిన స్ట్రెచెస్, ఎక్సర్‌సైజెస్ చేయిస్తారు. మోకాలి చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేసేలా తగిన వ్యాయామం చేయిస్తారు. మోకాలి దృఢత్వాన్ని తగ్గించి చలనశీలతను పెంచేలా చేస్తారు.

6. Lifestyle modifications: జీవన శైలి మార్పులు

మోకాలి నొప్పుల తీవ్రత ఆధారంగా కొన్ని జీవన శైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గించుకోవడం, కఠినమైన పనులకు దూరంగా ఉండడం, రన్నింగ్ వంటివి మానుకోవడం, తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయడం వంటి జీవనశైలిని అనుసరించాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

మోకాలి నొప్పికి సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్లు ఇవే

1. Total Knee Replacement Surgery: మోకాలి పూర్తి రీప్లేస్మెంట్ సర్జరీ

నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ పనిచేయనప్పుడు మీ వైద్యుడు మోకాలి రీప్లేస్మెంట్ చికిత్సను సూచిస్తారు. దెబ్బతిన్న కీలు భాగాలను తొలగించి కృత్రిమ భాగాలను అమరుస్తారు. కీలు తన విధులు సక్రమంగా నిర్వర్తించేలా ఈ సర్జరీ చేస్తారు.

2. Partial Knee Replacement Surgery: మోకాలి పాక్షిక రీప్లేస్మెంట్ సర్జరీ

మోకాలి పాక్షిక రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా కూడా మోకాలి నొప్పిని నయం చేస్తారు. దీనిని యూనికంపార్ట్‌మెంటల్ నీ ఆర్థ్రోప్లాస్టీ అని కూడా పిలుస్తారు. ఈ సర్జరీలో భాగంగా మోకాలిలోని మూడు కాంపోనెంట్లలో ఒక దానిని రీప్లేస్ చేస్తారు. పూర్తి రీప్లేస్మెంట్ సర్జరీ కంటే దీని ద్వారా త్వరగా కోలుకునే వీలుంటుంది.

3. Arthroscopic Procedures: ఆర్థ్రోస్కోపిక్ విధానం

సర్జికల్ డయాగ్నిస్టిక్ ప్రక్రియనే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. మోకాలిలో అసౌకర్యాన్ని గుర్తించి చికిత్స అందించడంలో ఈ సర్జరీ ఉపయోగపడుతుంది. మోకాలి నొప్పి మూలాన్ని గుర్తించడానికి కెమెరాతో కూడిన ట్యూబ్‌ను కీలులోకి పంపిస్తారు. ఒకవేళ అక్కడ మరమ్మతు అవసరమైతే సర్జరీ చేస్తారు. చిరిగిన లిగమెంట్స్ సరిచేయడానికి, కీలు నుంచి విడిపోయిన వాటిని తొలగించడానికి వీలవుతుంది. దెబ్బతిన్న కార్టిలేజ్ మార్పిడికి లేదా తొలగించడానికి కూడా ఈ సర్జరీలో సాధ్యమవుతుంది.

WhatsApp channel

టాపిక్