Self Defense Techniques: అగంతకుడు మీ ముందుంటే మిమ్మల్ని కాపాడే రక్షణ మార్గాలు తెల్సుకోండి
Self Defense Techniques: అమ్మాయిలు, మహిళలు తమ భద్రతకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి స్వీయ రక్షణ పద్ధతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మనకు ఎలాంటి ఆపద జరగదనే సానుకూల ఆలోచన మంచిదే. ప్రతి ఒక్కరు ఆపత్కాలాన్ని ఎదుర్కుంటారని కాదు. కానీ ఆనుకోకుండా వచ్చిన ఆపదని ఎదుర్కోడానికి మాత్రం ప్రతి అమ్మాయి సిద్ధంగా ఉండాలి. మీమీద ఎలాంటి దాడి జరిగాన ఎదుర్కోగలగాలి. అలాంటి సమయంలో మిమ్మల్ని కాపాడే ఈ ఆత్మరక్షణ పద్ధతుల గురించి నేర్చుకోండి. ఇవి మీ ప్రాణాలను కాపాడడంతో పాటే ఆపత్కాలం నుంచి రక్షిస్తాయి.
ఆపదలో రక్షించే స్వీయ రక్షణ మార్గాలు:
కళ్లమీద గురి:
ఒక పురుషుడు మహిళపై దాడి చేస్తే ముందుగా అతని కళ్లపై దాడి చేయాలి. కంటికి గాయం కలిగించడం వల్ల దాడి చేసిన వ్యక్తి పట్టు సడలిపోతుంది. అతని నుంచి మహిళకు తప్పించుకునే అవకాశం దొరుకుతుంది.
కాళ్లతో
చేతులతో దాడిచేసే అవకాశం లేకుండా చేతులు కట్టేసినట్లయితే కాళ్లతో లేదా మోకాలితో వాళ్ల రెండు కాళ్ల మధ్యలో బలంగా కొట్టండి. దీంతో ఆపద నుంచి తప్పించుకోడానికి సమయం దొరుకుతుంది.
గొంతు
గొంతు మీద దాడి చేయొచ్చు. గొంతు మీద గట్టిగా నొక్కడం వల్ల దాడి చేసిన వ్యక్తి పట్టు బలహీనపడుతుంది. తప్పించుకునే అవకాశం లభిస్తుంది. మీరు ఆటోలోనో క్యాబ్ లోనో ప్రయాణిస్తున్నప్పుడు మీరు గనక వెనక సీట్లో ఉంటే, ఏదైనా అపాయం ఉందనిపిస్తే.. డ్రైవర్‌ని ఆపాలి అనుకుంటే.. వాళ్ల చొక్కా కాలర్ పట్టుకుని వెనక్కు లాగండి. ఆ కాలరే గొంతుకు బిగుతుగా మారి వాళ్లకు ఊపిరాడకుండా చేస్తుంది. వెంటనే వాహనాన్ని ఆపేస్తారు. మీకు తప్పించుకోడానికి సమయం దొరుకుతుంది.
మోచేతితో
మోచేతితో మిమ్మల్ని దాడిచేసే వ్యక్తి ముఖం, ముక్కు, దవడల మీద దాడిచేయండి. కడుపులో, పక్కటెముకల మీద గట్టిగా కొట్టండి. ఇవి మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి సమయం ఇస్తాయి.
ఆత్మ విశ్వాసం
ఆపదలో ఉన్నామని తెలిసినా మీ ఆత్మ విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది. ధైర్యంగా నిలబడండి. మీ చూపులో భయం కనిపించొద్దు. మీ మాటలతో ఎదుర్కునేందుకు ప్రయత్నించండి. గట్టిగా దూరంగా వెళ్లమని మందలించండి. మీ ధైర్యం ఎదుటి వ్యక్తిని భయపెడుతుంది.
ఫేక్ కాల్
ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, ఎక్కడైనా ఒంటరిగా నిలబడాల్సి వచ్చినప్పుడు ఒక ఫేక్‌కాల్ మాట్లాడండి. ఎదుటి వ్యక్తికి మీ గురించి సమాచారం అంతా ఇస్తుండండి. ఎక్కడ నిలబడ్డారో చెప్పండి. మీపక్కన ఎవరో ఉన్నారన్న సమాచారమూ వాళ్లకు వినబడేలా చెప్పండి. వాహనంలో ప్రయాణిస్తే నేరుగా ఆ బండి నంబర్ డ్రైవర్‌నే అడగండి. అతనికి వినపడేలా ఫోన్లో ఎవరికైనా ఆ నంబర్ చెప్పండి. ఇవన్నీ మీ సమాచారం ఎవరికో ఇచ్చారని ఎదుటి వ్యక్తికి తెలిసేలా చేస్తాయి.
సురక్షితమైన ప్రాంతానికి ఎలా చేరుకోవాలి?
మీకు క్షణం అవకాశం దొరికినా అక్కడినుంచి ముందు పరిగెత్తండి. మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి రద్దీగా ఉండే ప్రదేశానికి, సిసిటివి కెమెరాలు ఉన్న ప్రదేశానికి లేదా పోలీసులు లేదా గార్డులు ఉన్న సురక్షితమైన ప్రదేశానికి చేరుకోండి. తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం సులభం అవుతుంది. పెంట్రోల్ బంకులు, ఏటీఎంలు.. లాంటి చోట్ల తప్పకుండా సీసీటీవీ కెమెరాలుంటాయి. వాటిలో మీరు కనిపిస్తున్నట్లు మిమ్మల్ని అటాక్ చేస్తున్న వ్యక్తికి తెలిసేలా మీ ప్రవర్తన ఉండాలి.
సేఫ్టీ యాప్స్:
ఫోన్లో తప్పకుండా కొన్ని ఎమర్జెన్సీ సేఫ్టీ యాప్స్ ఉంచుకోండి. ఈ యాప్స్ అత్యవసర సమయాల్లో మీకు తక్షణ సాయం అందిస్తాయి. మీరు ఒంటరిగా ప్రయాత్నిస్తున్న ప్రతిసారీ, లేదా పరిస్థితులు అనుమానాస్పదంగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఒక చిన్న సమాచారం ముందుగానే మీకు తెలిసిన వారికి ఇవ్వడం మర్చిపోవద్దు.
టాపిక్