వెంట్రుకల విషయంలో కలబంద చేసే అద్భుతాలు తెలిస్తే ఖరీదైన ఉత్పత్తుల జోలికే పోరు!-know the wonderfull benefits of aloe vera for hair growth and scalp health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వెంట్రుకల విషయంలో కలబంద చేసే అద్భుతాలు తెలిస్తే ఖరీదైన ఉత్పత్తుల జోలికే పోరు!

వెంట్రుకల విషయంలో కలబంద చేసే అద్భుతాలు తెలిస్తే ఖరీదైన ఉత్పత్తుల జోలికే పోరు!

Ramya Sri Marka HT Telugu

కలబంద జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన సహజ పరిష్కారంగా పని చేస్తుంది. దీన్ని సరిగ్గా ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల నుంచి చుండ్రు సమస్య, పోషణ వరకూ అనేక లాభాలు పొందవచ్చు.వెంట్రుకల ఆరోగ్యం కోసం సులభంగా ఇంట్లోనే కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.

కలబందతో వెంట్రుకలకు కలిగే ప్రయోజనాలు

ఎన్ని ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడినా ఒక్కసారి జుట్టు రాలడం మొదలైతే ఆందోళన తప్పదు. చుండ్రు, తలంతా పొడిబారడం, వెంట్రుకలు రాలడం ఇవన్నీ ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. వీటితో పాటు కలుషిత వాతావరణం, కెమికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ టూల్స్ వాడటం వంటి వాటి వల్ల తల ఆరోగ్య బలహీనపడుతుంది. దీంతో జుట్టు పొడిబారడం, కుదుళ్ల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు మొదలవుతాయి. వీటన్నింటినీ ఇవన్నీ పరిష్కరించటానికి సహజమైన పరిష్కారం ఏదైనా ఉందా అంటే అది కలబంద అని చెబుతున్నారు నిపుణులు.

ఇంట్లో, పెరట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటే కలబంద మొక్కలో పోషకాలు, విటమిన్లు, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలొవెరాలో ఉండే విటమిన్‌లు A, C, E, B12లతో పాటు ఫోలిక్ యాసిడ్, యాంటి ఫంగల్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జుట్టు, తలపై చర్మానికి సహజమైన రక్షణ కలిగిస్తాయి. వెంట్రుకల ఆరోగ్యానికి కావాల్సిన తేమను అందించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

వీటివల్ల జుట్టు పెరుగుదల మెరుగవుతుంది, తలపై ఉండే చర్మం చల్లబడుతుంది, చుండ్రు సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా దీన్ని ఇంట్లోనే పెంచుతూ తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించవచ్చు. కలబంద జుట్టు సమస్యలను తీర్చడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది. వెంట్రుకలు, కుదుళ్ల ఆరోగ్యంగా బాగుండటం కోసం దీన్ని ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం రండి.

కలబంద వల్ల వెంట్రుకలకు కలిగే ప్రధాన లాభాలు (Key Benefits of Aloe Vera for Hair)

1. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది

కలబంద తలపై ఉండే చర్మానికి అంటే కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో జుట్టు రూట్లకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు అందుతూ కొత్త వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది.

2. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది

అలొవెరాలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల తలచర్మంపై ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొడిదనం, చుండ్రు వంటి సమస్యలకు ఇది సహజ పరిష్కారంగా పని చేస్తుంది.

3. వెంట్రుకలకు తేమను అందిస్తుంది

కలబందలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండటం వల్ల జుట్టు పొడిబారకుండా, మెత్తగా, మెరుస్తూ తయారవుతుంది. డ్రై & ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నవారికి ఇది బహుళంగా ఉపయోగపడుతుంది.

4. వెంట్రుకలను బలపరుస్తుంది

కలబందలో ఉండే విటమిన్ A, C, E వంటి యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసి, వాటిని బలంగా చేస్తాయి.

5. స్ప్లిట్ ఎండ్స్ (చివర్లు చిట్లిపోవడం) తగ్గిస్తాయి

తలపై చర్మానికి తేమ అందడం వల్ల జుట్టు చివర్లో చిట్టకుండా ఉండేందుకు కలబంద బాగా పనిచేస్తుంది. దీని వల్ల కుదుళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వెంట్రుకల చివర్లు దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుంది.

6. తల చర్మం శుభ్రంగా ఉంటుంది

కలబంద ఎంజైములు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి, తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. దీంతో జుట్టు వృద్ధికి అనుకూలమైన పరిసరాలు కలుగుతాయి. వెంట్రుకలు బలంగా ఎదగడం మొదలవుతుంది.

7. సహజమైన మెరుపు

వెంట్రుకలకు సహజ మెరుపు కలబంద వాడకం వల్ల జుట్టు పై పొర (క్యూటికిల్) మృదువుగా మారి,సహజంగా మెరిస్తూ కనిపిస్తాయి.

8. జుట్టు రాలడం తగ్గిస్తుంది

కలబందలో ఒత్తిడిని తగ్గించే గుణం, తలచర్మానికి చల్లదనాన్ని ఇవ్వడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ లేదా పొడిబారిన తల చర్మం వచ్చే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

9. తక్కువ ఖర్చుతో – ఎక్కువ ప్రయోజనం

దీన్ని ఇంట్లోనే తక్కువ చోటులో కూడా పెంచుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేకుండా, సహజమైన పరిష్కారంగా పనిచేసే అద్భుతమైన మొక్క ఇది.

కలబంద ఉపయోగించే సులభమైన విధానాలు:

1. నేరుగా గుజ్జును అప్లై చేయడం

కలబందను కోసి, దాంట్లోని గుజ్జుని తసి నేరుగా వెంట్రుకలు తలకు పట్టించి అరగంట తరవాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయచ్చు.

2. కలబంద+ కొబ్బరి నూనె మిశ్రమం

1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసి జుట్టుకి మసాజ్ చేయండి. 1 గంట తర్వాత కడగాలి.

3. కలబంద+ పెరుగు హెయిర్ మాస్క్

2 స్పూన్లు కలబంద జెల్, స్పూన్లు పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయచ్చు.

4. కలబంద+ మెంతి పొడి మిశ్రమం

1 స్పూన్ మెంతి పొడి + 2 స్పూన్లు కలబంద గుజ్జును తీసుకుని పేస్ట్ లా తయారు చేసి స్కాల్ప్‌పై అప్లై చేయండి. ఇది చుండ్రుకు చక్కటి పరిష్కారం.

5. హెయిర్ సీరమ్ లా ఉపయోగించుకోవచ్చు

తక్కువ మోతాదులో కలబందజెల్‌ను తలపై స్ప్రే చేసుకోవచ్చు (నీటిలో కలిపి). జుట్టు మృదువుగా, మెరిసేలా ఉంటుంది.

కలబంద వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • తాజా కలబంద గుజ్జును ఉపయోగించాలి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న జెల్‌లు కొన్నిసార్లు కెమికల్స్ కలిగి ఉండవచ్చు.
  • సెన్సిటివ్ స్కిన్ ఉంటే ముందు చిన్నపాటి పాచ్ టెస్ట్ చేయాలి.
  • వారంలో 2–3 సార్లు మాత్రమే వాడాలి. రోజూ వాడడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశాలున్నాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం