Spring Onion Pickle: ఉల్లికాడల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? అన్నంలోకి, పరాటోల్లోకి అదిరిపోతుంది.. రెపిసీ ఇదిగో
Spring Onion Pickle: ఉల్లికాడలతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా. అన్నం, పరోటాలు, దోసలు దేంట్లోకి అయినా కమ్మగా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
సీజన్లో మాత్రమే దొరికే కూరగాయలను, పండ్లను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మిగిలిన సమయాల్లో అవి దొరకవు కనుక వాటి నుంచి వచ్చేఆరోగ్య ప్రయోజనాలను మనం మిస్ అవకూడాదని వారి ఉద్దేశం. శీతాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయల్లో ఉల్లికాడలు కూడా ఉన్నాయి. ఇవి సాధారణంగా ఆగస్ట్ నుండి ఫిబ్రవరి వరకు ఎక్కువగా దొరుకుతాయి. తర్వాత లభించడం కష్టమే. ఉల్లికాడలను తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఉల్లికాడలను కూరల్లో, స్పెషల్ రైస్ లో వేసుకుని తినడం మీకు తెలిసే ఉంటుంది. కానీ దీంతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఈ సారి కచ్చితంగా తయారు చేసి చూడండి. అన్నం, రొట్టెలు, దోసలు ఇలా దైంట్లోకైనా కమ్మగా అనిపించే పచ్చడి తయారు చేయడం కూడా చాలా సులువు. ఇంకెందుకు ఆలస్టేయం టేస్టీ అండ్ హెల్తీ ఉల్లికాడల పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..
ఉల్లికాడల పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
- ఉల్లికాడలు
- అల్లం చిన్న- ముక్క
- వెల్లుల్లి రెబ్బలు- 5 లేదా 6
- పచ్చిమిర్చి- 5 లేదా 6
- నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1/2 టీస్పూన్
- కొత్తిమీర - 1/2 కప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- తగినంత నీరు
ఉల్లికాడల పచ్చడి తయారీ విధానం
- పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఉల్లికాడలను తీసుకుని శుభ్రంగా గోరు వెచ్చటి నీటితో కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- తర్వాత కొత్తిమీర ఆకులను కూడా గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి చక్కగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లికాడలు పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
- మెత్తటి పేస్టులాగే మారిన ఈ మిశ్రమంలోకి కాస్త నిమ్మరసం వేసి బాగా కలపండి.
- అంతే టేస్టీ అండ్ హెల్తీ ఉల్లికాడల పచ్చడి తయారయినట్లే.
- పరోటా, రోటీ, దోస లేదా అన్నంతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు.
- అంతేకాదు మీరు ఈ చట్నీని 4-5 రోజులు ఫ్రిజ్లో నిల్వ చేయవచ్చు.
ఉల్లికాడలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఉల్లికాడలు (Spring onions) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి పచన వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి, ఎందుకంటే వాటిలో ఫైబర్ ఎక్కువ. హృదయ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తూ, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఉల్లికాడలు విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లతో ఇమ్యూనిటీను పెంచుతాయి, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా ఉపకరిస్తాయి. అవి శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు తీసే డిటాక్స్ గుణం కలిగి ఉంటాయి. ఉల్లికాడలు మంచి పొటాషియం మూలంగా రక్తపోటు నియంత్రణ, కిడ్నీల పనితీరు మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే, శక్తి పెరిగి, బరువు తగ్గడం కోరుకునే వారికి ఇది అనువైన ఆహారం.
సంబంధిత కథనం