మన దేశంలో అన్ని చోట్లా జరుపుకునే ప్రధాన పండుగలలో దసరా ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. కానీ రావణుని బొమ్మను దహనం చేయకుండా పూజించే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. రావణుడు గొప్ప రాజు, యోధుడు, శివభక్తుడని నమ్ముతారిక్కడ. ఇంకా కొన్ని కారణాల చేత ఆ ప్రదేశాల్లో రావణుణ్ని పూజిస్తారు. ఆ ప్రదేశాలేంటో చూడండి.
మందసౌర్ ప్రాంతం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఒక నగరం. రావణుని భార్య మండోదరి జన్మించిన ప్రదేశం ఇది.ఇక్కడ రావణునికి ఒక ఆలయం కూడా ఉంది. ఆ గుడిలోనే దాదాపు 35 అడుగుల రావణుడి భారీ విగ్రహం ఉంది. మందసౌర్ అనే పురాతన నగరాన్ని దష్పూర్ అని పిలిచేవారు. ఈ రోజు ఇక్కడ రావణ దహనం జరగదు. రావణునికి పూజలు చేస్తారు.
శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అతని నుండి ఆత్మ లింగాన్ని వరంగా పొందడానికి రావణుడు ఈ ప్రదేశంలో తీవ్రమైన తపస్సు చేశాడని చెబుతారు. శివుడు అతని తపస్సు, భక్తి మెచ్చి ఆ కోరికను తీర్చాడు. రావణుడు పొందిన ఈ లింగాన్ని కర్ణాటకలోని గోకర్ణలో ప్రతిష్ఠించారని నమ్ముతారు. అందుకే కాంగ్రా ప్రజలు రావణుడిని గొప్ప శివభక్తుడిగా భావిస్తారు. అతని భక్తికి దేవుడు అతన్ని ఆశీర్వదించాడని నమ్ముతారు. రావణున్ని కొలిచే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.
రావణుడితో చారిత్రక సంబంధం ఉన్న రాజస్థాన్ లోని ఒక నగరం జోధ్ పూర్. రావణుడు మండోర్‌లోనే మండోదరిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. మండోర్ జోధ్‌పూర్ పాతపేరు. అందుకే ఇక్కడి ప్రజలు తమ ఇంటి అల్లుడికి ఎంత గౌరవం ఇస్తారో రావణుడికి కూడా అంతే గౌరవం ఇస్తారు. దసరా రోజున ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడానికి బదులు ప్రజలు ఆయన మృతికి సంతాపం తెలుపుతారిక్కడ.
బిస్రాఖ్ ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాకు సమీపంలో ఉన్న గ్రామం. ఇది రావణుడి జన్మస్థలమని నమ్ముతారు. బిస్రాఖ్ ప్రజలు రావణుడిని తమ పూర్వీకుడిగా భావిస్తారు. అతని తెలివితేటలు , భక్తిని ఆరాధిస్తారు. ఇక్కడ ఉన్న రావణుడి ఆలయం సంవత్సరంలో ఎక్కువ భాగం మూసివేసే ఉంచుతారు. కానీ దసరా రోజు మాత్రం ఆలయం తెరిచి పూజలు నిర్వహిస్తారు.
టాపిక్