Floral emojis: ఈ ఎమోజీల అర్థాలు తెలుసా? ఒక్కోటి ఒక్కోరకం బంధాన్ని సూచిస్తాయట..
Floral emojis: మెసేజీలలో ఫ్లోరల్ ఎమోజీలను అలా ఊరికే వాడేస్తున్నారా? అయితే ప్రతి పూవు ఎమోజీకీ, ఆకులకు సంబంధించిన ఎమోజీకీ ఉన్న అర్థాలేంటో తెలుసుకోవాల్సిందే.
ఎవరితో అయినా చాటింగ్ చేసేటపుడు టెక్ట్స్ కన్నా ఎక్కువగా ఎమోజీలే వాడుతుంటాం. అవి మన ఫీలింగ్ ని అవతలి వ్యక్తికి ఇంకా స్పష్టంగా తెలియజేస్తాయి. మెసేజీలను ఇంకాస్త అర్థవంతంగా మార్చేస్తాయి. కానీ కొన్ని ఎమోజీలను అర్థం తెలీకున్నా వాడేస్తున్నాం. కొన్ని రకాల పూలు, ఆకులకు ప్రత్యేక అర్థాలుంటాయి. కొన్ని స్నేహాన్ని, కొన్నేమో ప్రేమనీ తెలియజేస్తాయి.
పూల ఎమోజీలలో దాదాపు చాలా మట్టుకు వివిధ రకాల బంధాల్ని సూచిస్తాయి. అయితే కొన్ని సార్లు దాన్ని ఉపయోగించే తీరు బట్టి వాటి అర్థం మారొచ్చు. ప్రతిచోటా పలానా అర్థమే ఉంటుందని చెప్పలేం కానీ, వాటి మామూలు అర్థాలేంటో మాత్రం తెలుసుకుందాం.
🌹 గులాబీ (Rose):
గులాబీ ఎమోజీని ప్రేమ, ఇష్టాన్ని సూచిస్తుంది. దీన్ని ఒకరిమీద ప్రేమను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తారు.
🌸 చెర్రీ బ్లోసోమ్ (Cherry Blossom):
చెర్రీ బ్లోసోమ్ ఎమోజీ అందాన్ని, వసంతాన్ని, కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. కొత్తగా చిగురించిన స్నేహాన్ని, లేదా ప్రేమ బంధం తొలిరోజులని తెలియజేయడానికి వాడొచ్చు.
🌻 సన్ ఫ్లవర్ (Sunflower):
ఈ పువ్వు ఆనందాన్ని, విధేయతను సూచిస్తుంది. క్లోజ్ ఫ్రెండ్ లేదా దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫ్రెండ్షిప్ తెలియజేస్తుంది.
💐 బొకే (Bouquet):
దీన్ని మామూలుగా అభినందనలు తెలియజేయడానికి, వేడుకలు, ప్రత్యేక రోజులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వాడతారు.
🌺 మందారం (Hibiscus):
మందార పూవు అందాన్ని, సానుకూల ఆలోచనా ధోరణి తెలియజేస్తుంది. ఇది చీకూ చింతా లేని సంబంధాల్ని, బలమైన స్నేహాల్నీ సూచిస్తుంది.
🌷 తులిప్ (Tulip):
తులిప్ పువ్వు ఎమోజీ దయ, ఆప్యాయతతో ముడిపడి ఉంటుంది. ఇది లోతైన స్నేహం, అభిమానం లేదా ప్రేమపూర్వక బంధాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించవచ్చు.
🌼డైసీ( Daisy):
డైసీ ఎమోజి అమాయకత్వం, స్వచ్ఛత మరియు సరళతను సూచిస్తుంది. ఇది ఉల్లాసభరితమైన స్నేహాన్ని లేదా మరీ అంత దగ్గర కాని బంధాల్ని కూడా సూచిస్తుంది.
🌿 ఆకు (Herb):
ప్రకృతిని, శ్రేయస్సును సూచిస్తుంది. మనల్ని రక్షించి, తోడుగా ఉండే బంధాలను సూచిస్తుంది. క్లోజ్ ఫ్రెండ్, మార్గదర్శకులుగా ఉండేబంధానికి ప్రతీక.
🌱 మొలకెత్తే విత్తనం(Seedling):
ఇది ఎదుగుదలను, కొత్త బంధాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఒక బంధంలో కొత్త ప్రారంభాన్ని, లేదా కొత్త స్నేహాన్ని తెలియజేస్తుంది. ఈ బంధాలకు చాలా శక్తి, ఎదుగుదల ఉంటుందని తెలియజేస్తుంది.
🍀 Four Leaf Clover:
ఇది అదృష్టాన్ని సూచిస్తుంది. ఏదైనా బంధంలో ఇద్దరూ పరస్పరం ఒకరి జీవితంలో ఒకరు సానుకూలతను తీసుకొస్తారని తెలియజేస్తుంది.
🍂 రాలిన ఆకు(Fallen Leaf):
చెట్టు నుంచి రాలిన ఆకు ఇది. కాలాల్లో మార్పును, సమయాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఒక బంధం ముగిసిందని తెలియజేస్తుంది. లేదా బంధంలో వచ్చిన మార్పులను గుర్తుచేస్తుంది.
ఈ ఎమోజీల అర్థాలన్నీ వాటిని వాడే వ్యక్తుల ఆలోచనల్ని బట్టి, అభిప్రాయం బట్టి మారొచ్చు.