Unhealthy packed foods: ఆరోగ్యకరం అని చెప్పి అమ్మేస్తున్న 5 ప్యాక్డ్ ఫుడ్స్ ఇవే, వీటి జోలికి పోకండి
Unhealthy packed foods: మీకు తెలీకుండానే అనారోగ్యం కలగజేసే కొన్ని స్నాక్స్, పదార్థాలు ఇంట్లోకి తెచ్చేసుకుంటున్నారు. వాటివల్ల దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తప్పవు.

సాధారణంగా ఇంట్లో చేసిన ఆహారం ముందు బయటవేవీ పనికిరావు. అయినా సరే కొన్ని బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. కొన్ని రకాల డ్రింకులు, స్నాక్స్ బయట నుంచి తెచ్చుకుని తినడమే అలవాటుంటుంది. చిరు ఆకలి ఉన్నప్పుడు ఇవి మన కడుపు నింపుతాయి. కానీ వాటిలో పోషకాలుండవు. చూడ్డానికి హెల్తీగా కనిపించే కొన్ని ప్యాకెట్లు నిజానికి ఆరోగ్యానికి నష్టం చేస్తాయి. అలాంటివేంటో చూడండి.
టీతో తినే రస్క్ లేదా టోస్ట్:
టోస్ట్ లేదా రస్క్‌ను పిల్లలకు పాలతో ఇవ్వడం చాలా మందికి అలవాటుంటుంది. ఉదయాన్నే కాస్త కడుపునిండుతుందని అలా తినడం అలవాటయిపోతుంది. కానీ రస్క్ తినడం ఆరోగ్యానికి, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో పోషకాలుండవు. షుగర్ స్థాయులు దీంట్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు ఈ అలవాటును మాన్పించండి. లేదంటే దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతింటుంది.
కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ తాజాగా తాగినప్పుడే ఆ లాభాలన్నీ. ప్యాకెట్ లో వచ్చే కొబ్బరి నీళ్లు తాగితే అందులో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి తాజా కొబ్బరి నీళ్లు మాత్రమే తాగండి.
ప్యాకెట్ మసాలా ఓట్స్ ఓట్స్:
ఓట్స్ ఆరోగ్యకరమనీ, బరువు తగ్గిస్తాయనీ వీటిని తినడం అలవాటు చేసుకుంటాం. కానీ మసాలా ఓట్స్ ఇన్స్టంట్ గా చేసుకుని తినడం వల్ల పూర్తి స్థాయి లాభాలు పొందలేము. వీటిలో పోషకాలూ సరిగ్గా ఉండవు. వీటిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ పోషకాలు తక్కువే. అలాగే వీటిలో ఉండే వన్నీ కృత్రిమమైనవే. కాబట్టి ఓట్స్ ఆరోగ్యం కోసం తినాలి అనుకుంటే ఇన్స్టంట్ మసాలా ఓట్స్ జోలికి పోకండి. ఏ ప్రయోజనాలు ఉండవు. మీరే రెగ్యులర్ ఓట్స్ తెచ్చుకుని ఇంట్లో చేసుకోండి.
డైజెస్టివ్ బిస్కెట్లు:
చాలా మంది మామూలుగానూ, కొందరు డయాబెటిక్ వ్యాధి గ్రస్తులు కూడా డైజెస్టివ్ బిస్కెట్లను ఆరోగ్యం కోసం తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ డైజెస్టివ్ బిస్కెట్లలో 12 శాతం దాకా షుగర్ తో పాటు మైదా కూడా ఉంటుంది. వీటిని ఆరోగ్యకరమైన బిస్కెట్లని ఏ రకంగానూ పరిగణలోకి తీసుకోలేం.
ప్యాకెట్ సూప్స్:
ప్యాకెట్లలో దొరికే ఇన్స్టంట్ సూప్స్ పిల్లలు, పెద్దలకు చాలా ఇష్టం ఉంటుంది. ఇవి తొందరగా తయారు చేసేయొచ్చు. రుచిలో కూడా బాగుంటాయి. కానీ ఈ ఇన్స్టంట్ సూప్స్ లో సోడియం గ్లూటామేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి హానికరం. రోజూ ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
టాపిక్