MP tiger reserves: వేటాడే, పోట్లాడే పులులు మీ కళ్ల ముందే.. మధ్య ప్రదేశ్‌ పార్కుల్లో ఈ కల తీరుతుంది-know the list of 7 tiger reserves tiger safari in madhya pradesh ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mp Tiger Reserves: వేటాడే, పోట్లాడే పులులు మీ కళ్ల ముందే.. మధ్య ప్రదేశ్‌ పార్కుల్లో ఈ కల తీరుతుంది

MP tiger reserves: వేటాడే, పోట్లాడే పులులు మీ కళ్ల ముందే.. మధ్య ప్రదేశ్‌ పార్కుల్లో ఈ కల తీరుతుంది

Koutik Pranaya Sree HT Telugu
Jul 29, 2024 02:30 PM IST

MP tiger reserves: మధ్య ప్రదేశ్ రాష్ట్రం పులుల సంఖ్యలో ముందుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 7 టైగర్ రిజర్వుల గురించి తెల్సుకోండి. ఇక్కడ అందుబాటులో ఉన్న యాక్టివిటీలు కూడా చూసేయండి.

మధ్య ప్రదేశ్ టైగర్ రిజర్వ్‌లు
మధ్య ప్రదేశ్ టైగర్ రిజర్వ్‌లు

దేశంలో ఎక్కువ పులుల సంఖ్యతో అగ్ర రాష్టంగా మధ్య ప్రదేశ్ నిలుస్తుంది. 2022 గణాంకాల ప్రకారం ఈ రాష్టంలో పులుల సంఖ్య 785. టైగర్ స్టేట్ గా చెప్పుకునే ఈ రాష్ట్రంలో 7 టైగర్ రిజర్వులున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని కొత్త టూరిజం యాక్టివిటీలనూ ప్రారంభిస్తోంది. సఫారీలు, నేచర్ వాక్, జంగల్ సఫారీ, ట్రీ హౌజ్ లో ఆవాసం ఉండటం, విలేజ్ టూర్ల లాంటి కొత్త యాక్టివిటీలు ఈ లిస్టులో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన నేషనల్ పార్కులు, సఫారీలు ఎక్కడున్నాయో, అక్కడికి ఎలా చేరుకోవాలో, వాటి ప్రత్యేకతలేంటో వివరంగా చూసేయండి.

మధ్య ప్రదేశ్ లో 7 టైగర్ రిజర్వులు:

1. బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్:

బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ సఫారీ
బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ సఫారీ

ఈ పార్కులో పులుల సంఖ్య 104 దాకా ఉంటుంది. ఉమారియా, కట్ని జిల్లాల మధ్యలో ఈ పార్కు విస్తరించి ఉంది. దీని వైశాల్యం 1,536.93 చదరపు కిలోమీటర్లు. చెప్పాలంటే ఇది చిన్న సైజు పార్కుల్లో ఒకటి. కానీ పులుల సాంద్రత మాత్రం ఎక్కువ. ఇక్కడ ప్రతి 14 కి.మీకు ఒక పులి ఉండొచ్చని అంచనా. ప్రకృతి ఒడిలోనే పులులను చూడ్డానికి ఇదొక మంచి ప్రదేశం. డిల్లీ నుంచి జబల్ పూర్ రావడానికి 2 గంటల విమాన ప్రయాణం చేస్తే చాలు. ఆ తర్వాత 4 గంట రోడ్డు ప్రయాణంతో ఈ పార్కుకు చేరుకోవచ్చు.

సఫారీలో పులులు కనిపించిన దృశ్యం
సఫారీలో పులులు కనిపించిన దృశ్యం

2. కన్హా నేషనల్ పార్క్:

మండ్లా, బాలాఘాట్ జిల్లాల మధ్య ఈ పార్కు విస్తరించి ఉంది. దేశంలోనే అత్యుత్తమ టైగర్ రిజర్వులలో ఇదీ ఒకటి. మధ్య ప్రదేశ్ రాష్టంలో పెద్ద నేషనల్ పార్క్ కూడా ఇదే. ఇక్కడ పులుల సంఖ్య 61. ఈ పార్కులో సఫారీ అనుభూతి మర్చిపోలేరు. అంత అద్బుతంగా ఉంటుంది. ప్రది 15 కి.మీకు ఒక పులి ఈ పార్కులో ఉంటుందని అంచనా. టూరిస్టులు జబల్ పూర్ కు విమాన మార్గంలో చేరుకోవాలి. లేదంటే బాలాఘాట్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి కన్హా గేట్ దాకా బస్ సౌకర్యం ఉంటుంది.

3. పెంచ్ టైగర్ రిజర్వ్:

పెంచ్ టైగర్ రిజర్వ్‌లో పులుల దృశ్యాలు
పెంచ్ టైగర్ రిజర్వ్‌లో పులుల దృశ్యాలు

ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతం సియోని, ఛింద్వారా జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ పులుల సంఖ్య 61. ఈ పార్కు విస్తీర్ణం 1179.63 చదరపు కిలోమీటర్లు. ప్రతి 19 కి.మీకు ఒక పులి కనిపించే అవకాశం ఉంటుందట. జంగల్ బుక్ సినిమా కల్పిత ప్రపంచం ఈ ప్రాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని సృష్టించిందే.

4. వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్:

ఇది ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన టైగర్ రిజర్వ్. సాగర్, దామో, నార్సింగ్ పూర్ జిల్లాల్లో ఈ రిజర్వ్ విస్తరించి ఉంది. దీని వైశాల్యం 2339 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 15 పులులుంటాయని అంచనా. ఇది భోపాల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

5. సత్పురా టైగర్ రిజర్వ్:

ఈ రిజర్వ్ పులులతో పాటూ దాని ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. సత్పురా పర్వత శ్రేణి పేరు మీదుగా దీనికి సెవెన్ ఫోల్డ్ అనే పేరూ ఉంది. ఇక్కడ 40 పులుల దాకా ఉండొచ్చు. దాదాపు పది వేళ్ల క్రితం నాటి రాతి పెయింటింగులు ఇక్కడ చూడొచ్చు. ఈ పార్కుల టూరిస్టులకు మంచి అనుభూతి ఇస్తుందనే చెప్పాలి. జబల్ పూర్, భోపాల్ కు విమాన మార్గంలో చేరుకుని, తర్వాత రోడ్డు మార్గంలో సత్పురా టైగర్ రిజర్వ్ కు సులభంగా చేరుకోవచ్చు.

6. పన్నా టైగర్ రిజర్వ్:

పన్నా టైగర్ రిజర్వ్
పన్నా టైగర్ రిజర్వ్

ఈ రిజర్వ్ విస్తీర్ణం 1,598.10 చదరపు కిలోమీటర్లు. పన్నా, ఛతర్పూర్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 25 పులులుంటాయి. ఇక్కడ ప్రవహించే కెన్ నది అందాలు చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. సఫారీలో వెళ్తూ ఈ సుందర దృశ్యాన్నీ చూడొచ్చు. దీనికి దగ్గర్లో ఉన్న ఖజురహో ఎయిర్ పోర్టు నుంచి సులువుగా పన్నా టైగర్ రిజర్వ్ చేరుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి జూన్ 15 మధ్య కన్హా టైగర్ రిజర్వ్ చూడ్డానికి మంచి సమయం.

వేటాడే పులులు
వేటాడే పులులు

7. సంజయ్ దుబ్రి నేషనల్ పార్క్:

వెదురు, సాల్ చెట్లతో ఈ నేషనల్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు సుందర దృశ్యాలను అందిస్తుంది. దీని విస్తీర్ణం 1,674.5 చదరపు కిలో మీటర్లు. సిధి, షాడోల్ జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. 5 పులులు, 152 పక్షుల రకాలు, 32 రకాల క్షీరదాలకు ఈ పార్క్ నిలయంగా ఉంది. 34 రకాల మంచి నీటి చేపల రకాలు, 11 రకాల సరీసృపాలు ఇక్కడున్నాయి. సంజయ్ నేషనల్ పార్కు సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ యొక్క ముఖ్యమైన భాగం.

మధ్య ప్రదేశ్ టూరిజం బోర్డు మేనేజింగ్ డైరెక్టర్.., టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ షియో శేఖర్ షుక్లా ఆ రాష్ట్ర టూరిజం గురించి మాట్లాడారు. అటవీ శాఖ, టూరిజం ఆపరేట్లరు, స్థానిక నాయకులతో కలిసి టూరిజం యాక్టివిటీలను మొదలుపెడతున్నాం అన్నారు. జులై నుంచి సెప్టెంబర్ సమయంలో పార్కులు మూసి ఉన్న సమయంలోనూ వీటి వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలుంటాయన్నారు.

వీటిలో ఏ టైగర్ రిజర్వులను చూడాలన్నా అక్టోబర్ నుంచి జూన్ మధ్య సమయం ఉత్తమం.

 

Whats_app_banner