పార్వతీ దేవి, శివుని జంట మనకు ఇష్టమైనది. ఇద్దరి మధ్య ఉన్న బంధం ప్రేమ, అంకితభావం, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం మనసు సంతోషించే విధంగా ఉంటుంది. అర్థనారీశ్వరులుగా పేరొందిన జంట శివపార్వతులది. దంపతులంటే ఇలాగే ఉండాలి. ప్రతి అమ్మాయి శంకరుడి లాంటి భర్తను కోరుకుంటుంది. పార్వతీ మాత ప్రతి స్త్రీకి ఆదర్శం. వాళ్లిద్దరి నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. శ్రావణ మాసంలో పార్వతీ దేవిని, శివుణ్ని రోజూ పూజిస్తున్నప్పుడు వాళ్ల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా తెల్సుకోవాల్సిందే. మన జీవితానికి అన్వయించుకోవాల్సిందే. గౌరీ శంకరుల బంధం పెళ్లైన ప్రతి జంటకు ఏం నేర్పుతుందో చూద్దాం.
ఏ బంధమైనా సక్రమంగా నడవాలంటే ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ లేకుండా ఏ సంబంధం ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం. ఒళ్లంతా బూడిద రాసుకున్న శివుణ్ని, మెడలో పామును, పులి చర్మాన్ని ధరించి కైలాసంలో నివసించే శివుణ్ని పార్వతీ మాత భర్తగా కోరుకుంది. ఎలాంటి ఆశలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంది. కానీ నేటి కాలంలో ప్రేమకు తప్ప ఇతర విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అబ్బాయికి మంచి బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లు, కారు ఉంటే తప్ప అమ్మాయిలు అతన్ని సెలెక్ట్ చేయరు. అబ్బాయిలు కూడా ఆకర్షణీయమైన, అందమైన అమ్మాయిలను, సమాజం దృష్టిలో గొప్పగా అనిపించుకునేలా జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటారు. అయితే వీటి వల్ల వైవాహిక జీవితం ఎక్కువ కాలం సజావుగా సాగదు.
అర్థనారీశ్వరులు అంటే శివపార్వతులు. అంటే సగ భాగం శివుడు, సగం పార్వతి. అర్థనారీశ్వరుడిలానే భార్యాభర్తల అనుబంధం కూడా ఉండాలి. భార్యాభర్తల శరీరాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ ఇద్దరూ ఒకటే. భార్యాభర్తల బంధంలో చిన్నా పెద్దా ఎవరూ ఉండరు ఇద్దరూ సమానమే. ఈ విషయాన్ని భార్యాభర్తలిద్దరూ అర్థం చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామిని ఎల్లప్పుడూ సమానంగా చూడాలి.
భార్యాభర్తల మధ్య సంబంధంలో నిజాయితీ, పారదర్శకత ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తలిద్దరూ తమ భాగస్వామి నుండి ఏదీ దాచకూడదు. ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. శివుడి స్వరూపం కారణంగా, పార్వతీ మాత ఒకసారి తన తండ్రి ఆస్థానంలో అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, శివుడు కోరుకుంటే, అతను పార్వతి ద్వారం వద్దకు యువరాజుగా ఊరేగింపుతో చేరుకునేవాడు. కానీ తన బంధంలో నిజాయితీని ఎంచుకుని తన నిజస్వరూపంలో అందరి ముందుకొచ్చాడు.
భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. భార్యలు తమ భర్తలను గౌరవిస్తారు కానీ భర్త నుంచి ఆ గౌరవం పొందకపోవడం చాలా సార్లు చూస్తుంటాం. రెండు వైపుల నుంచి ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. పార్వతి పుట్టింట్లో శివుణికి అవమానం జరిగినప్పుడు అవమానించినప్పుడు, పార్వతీదేవి తన భర్త గౌరవం కోసం సతీదేవిగా మారింది. మరోవైపు, పార్వతి సతీదేవిగా ఉన్నప్పుడు శివుడు ఆమె గౌరవం కోసం తాండవం చేసి యావత్ లోకాన్ని నాశనం చేశాడు.