Ways to Preserve Eggs: ఏంటీ? గుడ్లను ఇలా కూడా నిల్వ చేయొచ్చా! ఎన్ని రోజులైనా పాడుకావు..
Ways to Preserve Eggs: ఒకేసారి ఎక్కువ గుడ్లను తెచ్చుకుంటే పాడైపోతాయనే భయం అక్కర్లేదు. వాటిని భద్రపరిచే విధానాలు తెలుసుకుంటే చాలు. ఈ టిప్స్ మీకోసమే. తెల్సుకుని పాటించేయండి.
గుడ్లు భద్రపర్చే విధానాలు (freepik)
మనం గుడ్లను పౌష్టికాహారంగా భావిస్తాం. వీలైనంతగా ఆహారంలో చేర్చుకుని తినేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వీటిలో విటమిన్ ఏ, బీ6, బీ12, సెలీనియం లాంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకనే మనం దుకాణానికి వెళ్లినప్పుడు ఎక్కువగానే గుడ్లను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. వీటిని నిల్వ చేసుకునేందుకు సాధారణంగా అంతా ఫ్రిజ్‌లోనే పెట్టుకుంటూ ఉంటాం కదా. అయితే ప్రపంచ వ్యాప్తంగా గుడ్లను నిల్వ చేయడానికి రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు. వాటిలో కొన్ని మనకు ఆశ్చర్యకరంగానూ అనిపిస్తూ ఉంటాయి. అవేంటో తెలుసుకుని అవసరం అయినప్పుడు ఆ విధానాల్ని మనమూ పాటించేయొచ్చు.

గుడ్లను నిల్వ చేయడంలో రకరకాల పద్ధతులు :
- చైనాలో గుడ్లను ఉప్పు మధ్యలో పెట్టి నిల్వ చేసుకుంటారు. వీటినే వీరు సాల్టింగ్ ఎగ్స్ అంటారు. అంటే ఒక పొర ఉప్పు వేస్తారు. పైన గుడ్లను సర్దుతారు. ఆ పైన మరో పొర ఉప్పు వేస్తారు. ఇలా చేయడం వల్ల అవి కొన్ని నెలలపాటు పాడు కాకుండా ఉంటాయట. అలాగే వీరు వైన్‌లో గుడ్లు వేసి కూడా నిల్వ చేస్తారు.
- గుడ్లను స్టోర్ చేయడానికి నీటిలో వేసే పద్ధతి ఒకటి ఉంది. ఒక సీసాలో నీటిని పోసి అందులోకి జాగ్రత్తగా గుడ్లు జార విడవాలి. దానికి మూత పెట్టి గది ఉష్ణోగ్రతలో పెట్టేయవచ్చు. ఇలా చేయడం వల్ల గుడ్లు దాదాపుగా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయట. రుచిలో కాస్త తేడా ఉండొచ్చేమోగాని ఆరోగ్యానికి మాత్రం ఇవి చెడ్డ ఏమీ చేయవట.
- గుడ్లను ఉడకబెట్టి తొక్క తీసి మనం కూరలు చేసుకుంటూ ఉంటాం. ఇలా హార్డ్ బోయిల్ చేసిన గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అవి వారం రోజుల వరకు పాడు కాకుండా ఉంటాయి. సలాడ్లు, ప్రొటీన్ షార్ట్స్ లాంటివి చేసుకుని వాటిని అప్పటికప్పుడు తినడానికి వీలుగా ఉంటాయి. అందుకనే ఈ పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణ పొందింది.
- మినరల్ ఆయిల్ సహాయంతో గుడ్లను గది ఉష్ణోగ్రతలోనే ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. అందుకు మనకు తాజా గుడ్లు, ఫుడ్ గ్రేడ్ మినరల్ నూనె కావాల్సి ఉంటుంది. గుడ్లకు పైన ఈ నూనెను పూసి గుడ్ల ట్రేలో పెట్టేసుకోవడమే. నెలకోసారి పై నుంచి కింద వైపుకు గుడ్లను తిప్పుకుంటే ఉంటే దాదాపుగా 9 నెలలపాటు ఇవి నిల్వ ఉంటాయట. అదే వీటిని ఫ్రిజ్‌లో పెడితే ఇంకా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.
టాపిక్