పీరియడ్స్ కొంతమందిలో 21 రోజులకోసారి వస్తే మరికొందరిలో 35 రోజులకు వస్తాయి. రెండు నుంచి నాలుగైదు రోజులు రక్తస్రావం అవుతుంది. తర్వాత ఆగిపోతుంది. అలా కాకుండా కొన్నిసార్లు నెలసరి కన్నా ముందే రక్తస్రావం అవుతుంది. కొందరికి రక్తం చుక్కల్లాగా కనిపిస్తే మరికొందరిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. కొన్నిసార్లు ఇది సాధారణమే అయినా, మరికొన్ని సార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఇది సూచన కావచ్చు.
కొన్నిసార్లు సాధారణంగా వచ్చే హార్మోన్ల అసమతుల్యత, మార్పుల వల్ల రక్తస్రావం అవ్వొచ్చు. అలాగే ఇన్ఫెక్షన్లు, ట్యూమర్లు లాంటి తీవ్రమైన సమస్యల వల్ల కూడా కావచ్చు. బ్లీడింగ్ కొద్దిగా అయినా, ఎక్కువగా అయినా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
కొందరిలో పీరియడ్స్ సమయం కన్నా తక్కువ బ్లీడింగ్ అవుతుంది. మరికొందరిలో తీవ్రంగా ఉంటుంది. పొత్తి కడుపులో, కటి ప్రాంతంలో నొప్పి రావచ్చు. వైట్ డిశ్చార్జి ఎక్కువగా అవ్వడం, లేదంటే వైట్ డిశ్చార్జి అయినప్పుడు దుర్వాసన రావడం కూడా ఇన్ఫెక్షన్ అయిందని సూచన కావచ్చు. దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. మోనోపాజ్ దాటిన తర్వాత కూడా ఇలా బ్లీడింగ్ అయితే నిర్లక్ష్యం చేయకూడదు.
చాలా మట్టుకు హార్మోన్లలో వచ్చే మార్పులు పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడానికి కారణం కావచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయుల్లో హెచ్చుతగ్గుల వల్ల ఈ సమస్య రావచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయుల్లో మార్పుల వల్ల గర్భాశయ లోపలి పొర ఊడిపోవడమే దీనికి కారణం.
గర్భనిరోధక మాత్రలు వాడటం, ప్యాచెస్, ఇంజెక్షన్లు, హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్, గర్భం రాకుండా వాడే ఇంట్రా యుటరిన్ డివైసెస్ (IUDs) లాంటివి వాడటం వల్ల రక్తస్రావం కనిపించొచ్చు. వాటిని వాడటం మొదలుపెట్టినప్పుడు లేదంటే వాటిని మోతాదు ప్రకారం తీసుకోవడం మర్చిపోయినప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు. గర్భనిరోదక పద్ధతి ఏది మొదలు పెట్టినా మొదటి మూడు పీరియడ్స్ సరిగ్గా గమనించాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
గర్భాశయంలో గడ్డల్లాంటివి అయితే కూడా పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే కటి ప్రాంతంలో నొప్పి, నెలసరి సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది.
కొంతమంది మహిళలో అండం విడుదలయ్యే సమయంలో కూడా బ్లీడింగ్ అవ్వొచ్చు. నెలసరి సమయానికి సరిగ్గా మధ్యలో ఇలా అవ్వొచ్చు. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గడమే దానికి కారణం.
శృంగారం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల (STIs) వల్ల, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID) వల్ల.. ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నెలసరి మధ్యలో బ్లీడింగ్ అవ్వచ్చు.
మానసిక ఒత్తిడి వల్ల వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల కూడా నెలసరి మధ్య బ్లీడింగ్ అవుతుంది. అలాగే రక్తం పలుచబడేలా చేసే మందుల వాడకం, ఇంకేవైనా మందుల వాడకం వల్ల ఈ సమస్య రావచ్చు. కాబట్టి ఈ మార్పులన్నీ గమనించుకోవాలి.
ఇవన్నీ హార్మోన్లలో వచ్చే సాధారణ అసమతుల్యత వల్ల వచ్చే బ్లీడింగ్ తగ్గించుకోడానికి మార్గాలు. తీవ్రమైన ఆరగ్య సమస్యలుంటే వెంటనే వైద్య చికిత్స అవసరం.