కొందరికి పగటి పూట కంటే రాత్రి పూటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది. మరి కొందరేమో నిద్రపోవడానికి ముందు నీటిని తాగేందుకు మొగ్గు చూపుతుంటారు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అలవాటు అన్నట్లుగా ఉంటుంది. మరి అసలు నిద్రకు ముందు నీళ్లు తాగడం మంచిదేనా అంటే సమాధానాలు భిన్నంగా వినిపిస్తున్నాయి. కొన్ని లాభాలతో పాటు కొన్ని నష్టాలూ ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
పగలంతా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అందుకని మన శరీరం, కండరాలు ఎంతో శ్రమ పడతాయి. దీని వల్ల శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. ఫలితంగా మనలో నీటి శాతం తగ్గుతుంది. ఇలాగే నిద్ర పోవడం వల్ల శరీరం అసౌకర్యానికి గురవుతుంది. గొంతు పొడిగా అయిపోయి గురక వచ్చే అవకాశాలూ ఉంటాయి. ఇలాంటివన్నీ తగ్గాలంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా చేసుకోవాలి. కాబట్టి నిద్రపోయే ముందు నీటిని తాగడం మంచిదే. అందువల్ల ఒత్తిడికి లోనైన కండరాలకు సాంత్వన చేకూరుతుంది. అవి మళ్లీ బలోపేతం అవుతాయి. దీంతో చక్కగా నిద్ర పట్టి మరుచటి రోజుకల్లా మనం మరింత హుషారుగా తయారవుతాం. అలాగే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను నీరు బయటకు నెట్టివేస్తుంది. దీని వల్ల మన చర్మం నిగారింపుతో, నునుపుగా తయారవుతుంది. మనం నిద్రలోకి జారుకున్న తర్వాత సహజంగానే మన శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం మనం నిద్రపోవడానికి ముందు నీళ్లు తాగడమే. దీని వల్ల వేడి చేయడం లాంటివీ తగ్గుతాయి. అలాగని ఎక్కువ చలువా చేయకుండా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.
నిద్రపోయే ముందు నీటిని ఎక్కువగా తాగడం వల్ల అందరిలో సర్వసాధారణంగా ఎదురయ్యే ప్రధాన సమస్య మూత్ర విసర్జన. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగితే ఆ రాత్రంతా అవసరం అయినప్పుడల్లా మూత్ర విసర్జన కోసం లేవాల్సి ఉంటుంది. అందువల్ల నిద్రకు చాలా భంగం వాటిల్లుతుంది. అలాగే ఈ శ్రమ వల్ల ప్రశాంతమైన నిద్ర దూరం అవుతుంది. రాత్రి పూట ఎక్కువగా నీరు తాగి పడుకుంటే గుండెల్లో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులూ తలెత్తవచ్చు. మనం రాత్రి పూట ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే అవి శ్వాసకోశ నాళాల్లోకి చేరి శ్వాసించడానికి ఇబ్బంది కలిగించవచ్చు.
పడక మీదకు చేరడానికి సరిగ్గా గంటన్నర లేదా కనీసం గంట ముందు నీటిని తాగాలి. అక్కడితో ఆ రోజుకు నీటిని తాగడం ఆపేయాలి. దీని వల్ల పైన పేర్కొన్న లాభాలతోపాటు, నష్టాలూ రాకుండా ఉంటాయి. నిద్రకూ ఇలాంటి ఆటంకాలు రావు.